నుబ్రా వ్యాలీ ఒక అందమైన పూలలోయ. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో ఉన్న ఈ ప్రదేశం సముద్ర మట్టానికి 10,000 అడుగుల ఎత్తున ఉంది. దీనిని 'లడఖ్ తోట' అని కూడా పిలుస్తారు. సంవత్సరం పొడవునా మంచుతో కప్పబడి ఉండే నుబ్రా వ్యాలీ ని వేసవిలో సందర్శించటానికి ఇష్టపడతారు పర్యాటక ప్రియులు. నుబ్రా వ్యాలీ ప్రాంతంలో ఎక్కువగా పసుపు, గులాబీ వర్ణాలు కలిగిన పూలు పూస్తాయి. ఈ రంగు పువ్వులే అక్కడ అధికంగా కనిపిస్తాయి. ప్రపంచంలోనే ఎత్తైన రోడ్డు మార్గం గుండా వాలీ చేరుకొనే ప్రయాణం ఊపిరి బిగబట్టే విధంగా ఉంటుంది. సంవత్సరం పొడవునా మంచుతో కప్పబడే ఈ ప్రాంతం పర్యాటకులకు నూతన ఉత్తేజాన్ని ఇస్తుంది.
నుబ్రా వ్యాలీలో చూడదగ్గ ప్రదేశాలు పనామిక్ గ్రామం, ఆరామాలు. ఈ ప్రాంతంలో ఇస్లాం మతం పుట్టక ముందు బౌద్ధ మతం వ్యాప్తిలో ఉండేదని అక్కడి ఆధారాల ద్వారా తెలుస్తుంది. ఎన్నో యుద్ధాలను చవిచూసిన ఈ ప్రాంతం ఇప్పటికీ వన్నె తగ్గకుండా పర్యాటకులను ఆకర్షిస్తున్నది అంటే... అక్కడి ప్రకృతి సౌందర్యాల గురించి తప్పకుండా తెలుసుకోవాల్సిందే..!
నుబ్రా వ్యాలీ చేరుకోవాలంటే, ఖార్ దుంగ్ లా పాస్ ఒక్కటే మార్గం. ఇది ఒక రోడ్డు మార్గం. సముద్ర మట్టానికి 18380 అడుగుల ఎత్తున ఉండే ఈ రోడ్డు మార్గం ప్రపంచంలోనే అతి ఎత్తైన రోడ్డు మార్గం. ఈ మార్గంలో ప్రయాణించేటప్పుడు అందమైన కారాకోరం, లడఖ్ పర్వత శ్రేణులను చూడవచ్చు.
పనామిక్ గ్రామం లేV్‌ా పట్టణానికి 150 కిలోమీటర్ల దూరంలో నుబ్రా వ్యాలీలో కలదు. ఈ గ్రామం ఇండో-చైనా సరిహద్దు ప్రాంతంలో ఉన్నది. గ్రామ పొలిమేర వరకు ప్రయాణించాల్సి ఉంటుంది. అది దాటితే చాలు చైనా దేశం వస్తుంది. ఇక్కడ ఒక వేడి నీటి బుగ్గ కూడా ఉంది. నుబ్రా వ్యాలీలో ఉన్న ప్రధాన ఆకర్షణల్లో మైత్రేయ బుద్ధ ఒకటి. దీన్ని భవిష్యత్ బుద్ధ లేదా లాఫింగ్ బుద్ధ అని పిలుస్తారు. ఈ విగ్రహం కొండ మీద ఓపెన్ ప్రదేశంలో 32 మీటర్ల ఎత్తులో ఉంటుంది. మైత్రేయ బుద్ధ చూడటానికి వింతగా కనిపిస్తుంది. కొండ మీద ఉన్న విగ్రహం శ్యూక్ నది వైపుగా పాకిస్థాన్ వైపుకు తిరిగి ఉంటుంది. ఈ విగ్రహాన్ని శాంతికి చిహ్నంగా భావిస్తారు అక్కడి స్థానికులు. అలాగే ఈ ప్రాంతం బౌద్ధ ఆరామాలకు నిలయం. ఇన్సా బౌద్ధ ఆరామాన్నే 'ఇన్సా గొంపా' అని కూడా పిలుస్తారు. ఇది చాలా చారిత్రక ప్రదేశం కూడా. పనామిక్ గ్రామ సమీపంలో ఉంటుంది కానీ ఇక్కడికి వెళ్ళాలంటే సుమారు 6 గంటలు ట్రెక్కింగ్ చేయాలి. ఈ పురాతన బౌద్ధ ఆరామంలో బౌద్ధ మతానికి సంబంధించిన చిత్రాలు కనిపిస్తాయి. దీంతో పాటు డిస్ కిట్ బౌద్ధ ఆరామం సముద్ర మట్టానికి 10310 అడుగుల ఎత్తులో ఉన్న డిస్ కిట్ గ్రామంలో ఉంది. ఇది నుబ్రా వ్యాలీలో ఉన్న అతిపెద్ద పురాతన ఆరామం. ఈ ఆరామంలో టిబెట్ సంస్కృతికి చెందిన అనేక శిల్పాలను, చిత్రాలను, పెయింటింగ్‌లను చూడవచ్చు. ఇంత అందమైన చారిత్రక ప్రదేశాలను ఒక్కసారైన తప్పక చూడాల్సిందే..!
Authorization