అందమైన ప్రకృతి దృశ్యాలకు, నిర్మలమైన వాతావరణానికి పేరుగాంచిన ప్రాంతం పాలంపూర్. ఇది కాంగ్రా లోయలో ఉన్న ఒక కొండ ప్రాంతం. దేవదార్ చెట్లతో నిండిన దట్టమైన అడవులు, స్వచ్ఛమైన నీటి ప్రవాహాలతో ఈ ప్రాంతం చాలా సుందరంగా ఉంటుంది. ఇది సముద్ర మట్టానికి 1220 మీటర్ల ఎత్తున ఉంటుంది. ఇక ప్రకృతి ప్రేమికులైతే ఈ ప్రదేశాన్ని ఓ వరంలా భావిస్తారు. పాలంపూర్ అనే పేరు హిమాచల్ భాషలో పులుం అనే పదం నుంచి వచ్చింది. 'పులుం' అంటే 'నీరు సమృద్ధిగా ఉండటం' అని అర్థం. బ్రిటిష్ వారు ఏటవాలు ప్రాంతాల్లో టీ పొదలను పెంచాలని నిర్ణయించుకున్నప్పుడు, 19వ శతాబ్దంలో ఈ పట్టణం ఏర్పడింది. టీ తోటలకు చాలా ప్రాచుర్యం పొందింది. ఇక్కడి నుంచే అనేక రకాల బ్రాండ్ల టీ ఎగుమతులు జరుగుతుంటాయి. ఇక్కడ ఉన్న చిన్న చిన్న పట్టణాలు, ఎగువన ఉన్న వరి పొలాలు, గ్రామాలు మంచుతో కప్పబడిన ధాలుధర్ పర్వతాలు ఈ ప్రాంతాన్ని స్వర్గధామం చేశాయి. ఇక్కడ ఉష్ణోగ్రత మధ్యస్థంగా ఉంటుంది. కాబట్టి ఏ కాలంలోనైనా సందర్శించవచ్చు. పాలంపూర్ కు 40కిలోమీటర్ల దూరంలో గగ్గల్ (ధర్మశాల-కాంగ్రా విమానాశ్రయం అని కూడా అంటారు) ఉన్నది. డిల్లీ, ముంబై నుంచి కూడా నేరుగా ప్రయాణ సౌకర్యం కలదు.
Authorization