ఆ బంగ్లా నిర్మాణం ఆద్యంతం అద్భుతం. అందమైన పాలరాతి మెట్లు. ఆకాశాన్ని తాకుతున్నట్టు ఉండే ఎత్తైన స్తంభాలు. అబ్బురపరిచే ఆర్కిటెక్చర్. ఆకట్టుకునే దర్బార్ హాల్... ఇట్లా చెప్పుకుంటూపోతే బంగ్లా మొత్తం అడుగడునా అద్భుతమే సాక్షాత్కారిస్తుంది. 60 ఎకరాల సువిశాల ప్రాంగణంలో పక్షుల కిలకిలరావాలు. ఆకుపచ్చని పరిసరాలు. వాటి మధ్య గంభీరంగా దర్శనమిచ్చే కట్టడం. 200 ఏండ్ల చరిత్రను తనలో దాచుకున్నది. ఇప్పటికీ చెక్కుచెదరని స్టకోవర్తో ఆనాటి ప్రభువుల కళాత్మక దృష్టిని చాటుతున్నది. అటువైపు వెళ్తున్న చూపరుల కండ్లను తనవైపు తిప్పుకుంటూ ఆశ్చర్యచకితులను చేస్తున్నది. ఒకప్పుడు రాజరీకానికి, బ్రిటిష్ దర్పణానికి నెలవైన ఈ నిర్మాణం ప్రస్తుతం విద్యా సుంగంధాలు వెదజల్లుతోంది. మహిళా కళాశాలగా, ఉస్మానియా యూనివర్సిటీ అనుబంధ సంస్థగా సేవలందిస్తున్న ''కోఠి విమెన్స్ కాలేజీ'' అలియాస్ బ్రిటిష్ రెసిడెన్సీ, కోఠి రెసిడెన్సీ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు మీ కోసం...
పర్షియన్ భాషలో కోఠి అన్న పదానికి మాన్షన్ అని అర్థం. మాన్షన్ అంటే పెద్ద భవనం. 200 ఏండ్ల కిందట కట్టిన ఈ భవనం పేరు మీదుగానే ఈ ప్రాంతానికి కోఠి అనే పేరు వచ్చింది. స్థానికులు దీన్ని ''బడే సాహిబ్ కీ కోఠి'' అని పిలుస్తారు. ఈ భవననిర్మాణం, ఆర్కిటెక్చర్, దీంట్లో ఉన్న మొదటి రెసిడెన్సీ అన్నీ ఇప్పటికీ గుర్తు చేసుకునే చరిత్రలే. ఈ రెసిడెన్సీ బంగ్లాను మద్రాస్‌కు చెందిన 'శ్యాముల్ రసల్ ' అనే రాయల్ ఇంజనీర్ కాగా సివిల్ కాంట్రాక్టర్ వీరాస్వామి మొదలియార్ పర్యవేక్షణలో దీన్ని నిర్మించారు. ఈ బంగ్లా నిర్మాణానికి నాలుగు ఏండ్ల కాలం పట్టింది (1803-1807). దీన్ని మొత్తంగా పల్లాడియన్ విల్లా స్టైల్లో కట్టారు. భవనానికి రెండువైపులా ఎత్తైన దిమ్మల మీద కూర్చోన్న సింహపు బొమ్మలు చాలా గంభీరంగా కనిపిస్తాయి. వాటి మధ్యలో ఇరవై రెండు పాలరాతి మెట్లు. పై భాగంలో 50 అడుగుల ఎత్తైన ఆరు స్తంభాలు కనిపిస్తాయి. స్తంభాల చివరి భాగంలో త్రికోణాకారంలో చెక్కిన చక్కటి నగిషీ పనితనం కనిపిస్తుంది.
దర్బార్ హాల్...
వరండా మొత్తం నాపరాయి డిజైన్‌తోనే ఉంటుంది. వరండా నుంచి లోపలికి వెళ్తుంటే 60 అడుగుల పొడవు, 33 అడుగుల వెడల్పు, 50 అడుగుల ఎత్తుతో దర్బార్‌హాల్ కనిపిస్తుంది. హాల్‌కు రెండువైపులా గుండ్రటి ఆకారంలో ఉండే పెయిటింగ్ గదులు, బాల్కనీ, లైబ్రరీ కనిపిస్తుంది. దర్బార్ హాల్లో నగిషీ డిజైన్లు, స్తంభాలు చాలా ఉంటాయి. దర్బార్ హాల్ మధ్యలో మూడు పెద్ద శాండ్లియర్లు, నాలుగువైపులా పెద్ద పెద్ద అద్దాలు ప్రత్యేక ఆకర్షణ. అద్దాల మీద సింహపు బొమ్మలు, చుట్టూ ఎరుపు, బంగారు రంగుతో ఫ్రేమ్‌వర్క్. ఇక రూఫ్ డిజైన్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. రూఫ్ మొత్తం లతలు, పువ్వులు , ఆకులతో రంగు రంగుల డిజైన్లతో తయారు చేశారు. మొదటి ఫ్లోర్లో గుండ్రటి పిల్లర్లు ఉంటే రెండవ ఫ్లోర్లో నలుచదరపు పిల్లర్లు కనిపిస్తాయి. వాటి మీద స్పష్టంగా చెక్కిన నగిషీలు కనిపిస్తాయి. దీన్ని బ్రిటిష్ వారు కట్టించారని చెబుతున్నా.. నిర్మాణానికి అయిన ఖర్చు మాత్రం నిజాం భరించాడని చెబుతారు.
మూడు దర్వాజాలు...
బంగ్లాకు మూడు దర్వాజలు ఉంటాయి. ఒకటి సైనికుల పహారా కోసం ఏర్పాటు చేశారు. దాన్ని మాన్స్ డోన్ గేట్ అని అంటారు. ఈ గేటు దగ్గర రెండు సొరంగాలు కనిపిస్తాయి. ఇది సైనికులకు ప్రత్యేకమైన మార్గం. రెండవది ఎంప్రెస్ గేట్. ఇది రెండు ఎత్తైన స్తంభాలతో చాలా ఘనంగా కనిపిస్తుంది. ఒకప్పుడు ఇది మెయిన్ గేట్గా ఉండేది. ఇక మూడవది రాబర్ట్ గేట్. ఇది బంగ్లాకు కుడివైపు ఉంటుంది.
వైట్ హౌజ్ మాదిరిగా...
ఈ బంగ్లాకు మరో ప్రత్యేకత ఉంది. అమెరికా అధ్యక్షభవనం వైట్ హౌజ్‌కు దీనికి చాలా పోలికలు కనిపిస్తాయి. ఎత్తైన నిర్మాణాలు, గుండ్రటి పిల్లర్లు, దర్బార్ హాల్ అన్నీ ఒకే మాదిరి కనిపిస్తాయి. దీనికి ఓ కారణం ఉంది. హైదరాబాద్‌లో ఉన్న బ్రిటిష్ రెసిడెన్సీని, అమెరికాలో ఉన్న వైట్ హౌజ్ నిర్మాణాల పనితనానికి ఒకే ఆర్కిటెక్చర్ కావడం వల్ల రెండు ఒకేలా కనిపిస్తాయి. రెండింటిలోని పోలికలను చూసినట్టైతే ముందు భాగం, వెనుక భాగంలో అర్ధచంధ్రాకారంలో ఉన్న పోర్టికోలు, పునాది, స్తంభాలు, స్తంభాల అంచుల్లో ఉండే డిజైన్, రూఫ్ డిజైనింగ్, వెంటిలేటర్లు అచ్చుగుద్దినట్టు ఒకే మాదిరి ఉంటాయి. మొత్తంగా రెండు భవనాలు పల్లాడియన్ విల్లా స్టైల్ డిజైన్‌లో ఉండటం దీనికి కారణం.
బ్రిటిష్ రెసిడెన్సీ
బంగ్లాలో బ్రిటిష్ రెసిడెన్సీ ముఖ్యమైందిగా చెప్పుకోవచ్చు. దీన్ని జేమ్స్ అకిల్లెస్ కిర్క్ పాట్రిక్ ప్రేమకు చిహ్నంగా చెబుతారు. బ్రిటిష్ అధికారి అయిన జేమ్స్ అకిల్లెస్ కిర్క్ పాట్రిక్ హైదరాబాద్‌కు మొదటి రెసిడెన్సీ. కిర్క్ పాట్రిక్‌కు ధనవంతుల కుటుంబాలతో మంచి సంబంధాలు ఉండేవి. అప్పటి నిజాం ప్రధాన మంత్రి మహ్మముద్ ఆలీఖాన్ మనవరాలు ఖైరున్నీసాను ప్రేమించాడు. ఆమెను పెండ్లి చేసుకోవడానికి ఇస్లాం మతంలోకి మారాడని చెబుతారు. దానికి చిహ్నంగా బ్రిటిష్ రెసిడెన్సీ కట్టారు. భవనంలో అడుగడునా వారి సృజనాత్మకత కనిపిస్తుంది. మెయిన్ బిల్డింగ్‌కు అనుబంధంగా ఉన్న భవనాలు, వాటి చుట్టూ ఉన్న గార్డెన్, దాంట్లోని పచ్చదనం, రెసిడెన్సీ మినియేచర్ ప్రతిఒక్కటి ఆకట్టుకుంటుంది. స్వాతంత్య్ర అనంతరం ఈ రెసిడెన్సీ భవనాన్ని ఉస్మానియా యునివర్శిటీ విమెన్స్ కాలేజీకి ఇచ్చారు. అలా ప్రపంచంలోనే మొదటిసారిగా వందల ఏండ్ల చరిత్ర గల ఓ చారిత్రక భవనం మహిళా కళాశాలగా మారింది. ఇంతటి ఘన చరిత్ర ఉన్న కట్టడాన్ని మీరు ఓ సారి సందర్శించాల్సిందే!
-రూప
7661910634
Authorization