ఎటుచూసినా తెలుపు తివాచీ పరిచినట్లుండే దట్టమైన హిమం, ఆ మంచును కుప్పలుతెప్పలుగా పోసినట్లుండే పర్వతాలపై సూర్యకిరణాలు పడి బంగారు వర్ణంలో మెరిసిపోయే చూడచక్కని దృశ్యాలు, పచ్చని పచ్చికబయళ్ళు, ఆపిల్ తోటల అందాలు, లోయలు, పైన్... ఓక్ చెట్ల సోయగాలు ఇవన్నీ సిమ్లాను భూతల స్వరంగా తీర్చిదిద్దాయి. ప్రతి సంవత్సరం సిమ్లాలో జరిగే వింటర్ స్పోర్ట్స్ అంగరంగ వైభవంగా జరుగుతాయి. వింటర్ స్పోర్ట్స్ సిమ్లాకు ప్రత్యేక ఆకర్షణ. సిమ్లా మంచుకొండల్లో అడ్వెంచర్ టూర్ ఓ మరుపురాని అనుభూతి.
మంచుపై స్కేటింగ్ చేస్తూ దూసుకుపోవడంలో ఉన్న ఆనందం మాటల్లో చెప్పరానిది. సిమ్లా నుంచి కుఫ్రి వెళ్లేదారి అంతా ఒకవైపు ఆకాశాన్నంటే పర్వతాలు, మరోవైపు లోతైన లోయలు. ఈ పర్వత శ్రేణులన్నీ మంచుదుప్పటి కప్పుకున్నట్లుగా ఉంటే, లోయలన్నీ రంగు రంగుల సీతాకోక చిలుకల్లా కనిపిస్తుంటాయి. సిమ్లా పట్టణం మొత్తం కొండల్లోనే అమరి ఉంది. అర్ధచంద్రాకారపు పర్వతాల పై భాగంలో ఉండే ఈ పట్టణంలో ఎటుచూసినా పైన్, దేవదారు చెట్లు ఒకదాన్ని మించి మరొకటి ఆకాశాన్నంటుతున్నాయా! అన్నట్టుగా ఉంటాయి. అయితే శీతాకాలంలో మాత్రం ఈ చెట్లు మంచుదుప్పటి కప్పుకొని శ్వేతవర్ణంలో కనువిందు చేస్తాయి. ఇక్కడి ఇండ్లన్నీ దూరం నుంచి చూస్తే ఒకదానిపై ఒకటి పేర్చినట్టుగా ఉంటాయి.
హాట్ వాటర్ స్ప్రింగ్: సిమ్లా విహారంలో ప్రత్యేక ఆకర్షణ వేడి నీటి గుండం. ఈ వేడినీటి గుండంలో స్నానం చేయడం ఎంతో ఉల్లాసాన్ని ఇస్తుంది. ఈ నీటి గుండంలో తప్ప దాని చుట్టుపక్కల పరిసరాలన్నీ రక్తం గడ్డకట్టించేంత చల్లగా ఉంటాయి. కానీ, ఈ వేడినీటి గుండంలోని నీరు మాత్రం మరుగుతూ ఉంటుంది. ఈ నీటిలో సల్ఫర్ ఉన్న కారణంగా రసాయనిక చర్య జరిగి అలా జరుగుతూఉంటుందట.
లక్కడ్ బజార్: సిమ్లా వెళ్లిన పర్యాటకులు మొట్టమొదటగా దర్శించేది మాల్ రోడ్డు. మాల్ సెంటర్ ఇక్కడ ఓ ప్రత్యేక ఆకర్షణ. ఈ మాల్ రోడ్డులో విహరించ డానికి పర్యాటకులు ఎక్కువగా ఇష్టపడతారు. గుర్రమెక్కి మాల్ అంతా చుట్టి, కావాల్సినవన్నీ కొనుక్కోవచ్చు. సిమ్లా, దాని చుట్టుపక్కల ప్రాం తాల్లో ఆపిల్ తోటలు ఎక్కువగా ఉంటాయి. పర్యాటకులు ఈ పండ్లను కోసుకుంటున్నా స్థానికులు అభ్యంతరం చెప్పారు. అయితే కేవలం పండ్లను మాత్రమే కోసుకోవాలి. అలా కాకుండా పచ్చికాయలను ముట్టుకుంటే మాత్రం ఊరుకోరు. సిమ్లాలో ముఖ్యంగా దర్శించాల్సిన వాటిలో హిమాలయ పర్వతాలు ముఖ్యమైనవి. అత్యద్భుతంగా కనిపించే స్కాండర్ పాయింట్, చర్చి, లైబ్రరీ, లక్కడ్ బజార్... తదితరాలు ఇక్కడ ముఖ్యమైన ప్రదేశాలు. లక్కడ్ బజార్ లో కొయ్యలతో చేసిన హస్త కళల వస్తువులు విరివిగా దొరుకుతాయి.
స్టేట్ మ్యూజియం: ఇక ఇక్కడి స్టేట్ మ్యూజియంలో హిమాచల్ ప్రదేశ్ కు చెందిన పురాతన, చారిత్రక ప్రాధాన్యం ఉన్న శిల్పాలు, పెయింటింగ్స్ చాలా ఉంటాయి. భారతీయ సంస్కృతిని కండ్లకు కట్టినట్టు చూపించే ఈ మ్యూజియంలో ఆసక్తి కలవారికి సమయం ఎలా గడిచిపోతుందో కూడా తెలిదు. అలాగే ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ స్టడీస్ కూడా చూడదగ్గ ప్రాంతం. అక్కడి నుంచి 15 నిమిషాలు నడిస్తే ప్రాస్పెక్ట్ హిల్‌కు చేరుకోవచ్చు. ఇక్కడి నుంచి ఏడు కిలో మీటర్ల దూరంలో సమ్మర్ హిల్ చూడవచ్చు.
అక్కడ ఉండే జార్జియన్ హౌస్‌లోనే మహాత్మా గాంధీ విడిది చేసేవారు. హిమాచల్‌ప్రదేశ్ యూనివర్సిటీ కూడా ఇక్కడే ఉంది.సిమ్లా నుంచి బయలు దేరినప్పటి నుంచి ప్రతి ఐదు లేక ఆరు కిలోమీటర్లకు ఒక టూరిస్ట్ ప్లేస్ దర్శన మిస్తుంది. అలాంటి వాటిలో తత్తపాని, హాట్ వాటర్ స్ప్రింగ్ తప్పకుండా దర్శిం చాలి. సిమ్లాకు చేరుకో వాలంటే... ఢిల్లీ నుంచి చండీగఢ్, కల్కాల మీదుగా వెళ్లాలి. కల్కా నుంచి సిమ్లా వెళ్లే టారు ట్రైన్ శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌కు కనెక్టింగ్ ట్రైన్లో వెళ్లవచ్చు.
నిజానికి సిమ్లా ప్రయాణం కల్కా నుంచి మొదలవుతుంది. అక్కడి నుంచి నారోగేజ్ రూట్లో టారు ట్రైన్లో ప్రయాణించడం పర్యాటకులకు మరపురాని అనుభూతులను మిగుల్చుతుంది. ఎటుచూసినా హిమాలయ పర్వతశ్రేణులు, లోయలు, పైన్, ఓక్ చెట్లతో నిండి ఉంటుంది. సిమ్లా, కల్కాల మధ్య 103 సొరంగాలు, 87 బ్రిడ్జిలు ఉన్నాయి. టారు ట్రైన్లో వెళ్లేటప్పుడు వీటన్నింటినీ చూస్తూ, అంతులేని ఉద్వేగాన్ని పొందవచ్చు. గ్రేటెస్ట్ నారో గేజ్ ఇంజనీరింగ్ అచీవ్మెంట్ ఇన్ ఇండియాగా గిన్నిస్ బుక్‌లో ఈ మార్గం రికార్డు అయింది.
సమ్మర్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా: వింటర్ స్పోర్ట్స్ సంరంభం తర్వాత ఫిబ్రవరి చివరి మాసం నుంచి వేసవి విడిదికి వచ్చే పర్యాటకుల సందడి పెరుగుతుంది. భారతదేశంలోని ప్రముఖ పర్యాటక స్థలాలలో ఒకటిగా, వేసవి విడిదిగా పేరుగాంచింది సిమ్లా. 1819 లో బ్రిటీష్ వారిచే కనుగొనబడిన సిమ్లా, ఆ తర్వాత 1864 వ సంవత్సరంలో సమ్మర్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా ప్రకటించారు. బ్రిటీష్ వారి కాలంలో సిమ్లాను వేసవి విడిది గా ఉపయోగించుకునే వారు. దేశ విభజన సమయంలో కాశ్మీరుకు సంబంధించిన చర్చలు ఇక్కడి వైశ్రారు భవనంలోనే జరగడం విశేషంగా చెప్పవచ్చు. అందుకే సిమ్లాను సందర్శించే పర్యాటకులు తప్పకుండా వైశ్రారు భవనాన్ని కూడా దర్శిస్తుంటారు.
దూర ప్రాంతాల నుంచి విమానయానం ద్వారా సిమ్లా చేరుకోవాలనుకునే పర్యాటకులకు దగ్గరి విమానాశ్రయం సిమ్లా ఎయిర్పోర్ట్. దాదాపు అన్ని ప్రధాన నగరాల నుండి ఇక్కడికి విమాన సదుపాయం ఉన్నది. ఈ ఎయిర్పోర్ట్.. కులుమనాలి, ఢిల్లీ నగరాల ఎయిర్‌పోర్ట్‌లతో సంబంధం కలిగి ఉంటుంది. వివిధ నగరాల నుంచి వచ్చే పర్యాటకులు ఢిల్లీ ఎయిర్ పోర్టులో వారికి ఏది అనువుగా ఉంటే ఆ ఎయిర్పోర్ట్ ద్వారా సిమ్లాకు చేరుకోవచ్చు.
- సంహిత
Authorization