జీవితంలో ఏది సాధించాలని వున్న దానికి ఒక చక్కని ఆలోచన, ప్రణాళిక ఎంతో ఉపకరిస్తాయి. నేను మా శ్రీవారు, మా అమ్మాయి, అల్లుడు గారు కలసి బాల్కన్ మౌంటెన్స్ సదరన్ ఈస్ట్రన్ యూరప్‌లో వున్న దేశాల్ని చూడాలని ప్లాన్ చేశాం. హైదారాబాద్ నుండి పారిస్, పారిస్ నుండి సోఫియా (బల్గేరియా), రుమేనియా, సర్బియా సర్జీవో, మెసడోనియా, అల్బేనియా, మాల్డోవా (మెసపటోమియా) దేశాన్ని చూడడానికి బయల్దేరాం. ఆరు నెలల ముందు ఈ టికెట్స్ బుక్ చేసుకున్నాం. 29,000 రూపాయలకు టికెట్ బుక్ చేసుకున్నాం. సోఫియాలో దిగగానే మేం ఒక కారుని అద్దెకి తీసుకున్నాం. 4500 కిలోమీటర్లు 20 రోజులు కారులోనే ప్రయాణం...
ఒక గంటలోపల కారు తీసుకొని సర్బియాలో బుక్ చేసుకున్న (ఏర్ బి అండ్ బి) ఎబిబి అంటే అపార్ట్మెంట్స్ ఇండిపెండింట్ ఇల్లు అద్దెకు తీసుకోవటమన్న మాట. ఇక్కడ డబుల్ బెడ్ రూమ్ కేవలం రెండు వేలకు దొరికింది. అది చాలా అందంగా వుంది. అందులో వంటిల్లు, వండుకొనడానికి గదులు చాలా శుభ్రంగా, పెద్దవిగా ఉన్నాయి. మేం ఆ ఇంటిలో చల్లని ఎ.సి. రూమ్‌లో పప్పు అన్నం వండుకొని వేడి వేడిగా తింటుంటే ఆ రుచియేవేరు డబ్బును ఆదా చేసుకోవచ్చు ఆరోగ్యం కూడా పాడవదు. సాయంత్రం నాలుగు గంటలకు సోఫియా సిటీ చూడడానికి కారులో బయల్దేరాం. సిటీ మధ్యలో (ట్రామ్) ట్రైన్ తిరుగుతుంది. రోడ్డుమీద గిటారు వాయిస్తున్న వాయిద్యకారుని సంగీతం వింటూ ఆ పట్టణ అందాల్ని తిలకిస్తూ 5 కి.మీ నడిచాం. రోడ్డు మద్యలో పూల కుండీలు, కూర్చోవడానికి బెంచీలు వున్నాయి. రోడ్డుకి ఇరువైపులా అంగళ్ళు (షాప్స్) వున్నాయి. అవి తిలకిస్తూ అక్కడే వున్న బల్గేరియా చర్చికి వెళ్ళాం. చర్చిలో షారుఖ్‌ఖాన్ సినిమా సూట్ చేశారు. చాలా పురాతనమైన చర్చి చాలా పెద్ద గా ఉంది. ''చమక్ చలో'' టైటిల్ సాంగ్ కోసం ఈ చర్చి ముందు షూటింగ్ జరిగింది.
ఈ చర్చి బల్గేరియన్ ఆర్ధడాక్స్ చర్చి 6.7 మిలియన్స్ బల్గేరియన్స్ వున్నారు. ఇందులో 85 శాతం బల్గేరియన్స్ చర్చి కి చెందిన వాళ్ళని రిజష్టర్ చేసుకున్నారు. ఈ చర్చి 1500 సంవత్సరాల వెనక సెంట్ అలెగ్జాండర్ నేవిస్కీ కట్టారు. ఈ చర్చి గోపురాలు బంగారు రంగుతో మెరుస్తున్నాయి. ఆర్కిటెక్చర్ చాలా అందంగా వుంది. ఆ కాలంలో ఇంత అందమైన చర్చి కట్టారని అబ్బురపడిపోయాను. లోపల కూడా చాలా బాగా వుంది. రెప్పవాల్చకుండా ఆ అద్బుతమైన చారిత్రక చర్చిని కనులార తిలకించి తిరుగు ముఖంపట్టాం. రాత్రి రొయ్యలు, చేపలు తెచ్చుకొని ఫ్రై చేసుకొని తిన్నాం. తర్వాత రోజు మరికొన్ని చర్చిలు చూసి అక్కడి నుండి పోల్దీవ్ అనే ప్రదేశానికి బయల్దేరాం. పొద్దున పది గంటలకు బయలుదేరితే మూడు గంటలకు చేరుకున్నాం. అక్కడ 1500 రూపాయలకు ఎయిర్ బిబిలో బుక్ చేసుకున్న ఇంట్లో దిగాం. ఈ పోల్దీవ్లో పవన్ కళ్యాణ్ పిక్చర్ అజ్ఞాతవాసి సినిమా షూటింగ్ జరిగింది.
లీగ్ ఆఫ్ కోరింధ్...
ఇది చాలా పురాతనమైన పట్టణం. ఇది రెండు నుండి 13 వ శతాబ్దంలో ఏర్పడింది. వోల్గా, కామ నదులు ప్రవహిస్తున్నాయి. ఇది ఏడు కొండల మధ్యన కట్టిన పట్టణం. ఓడియన్ ఆఫ్ పిలిప్పొ పోలీస్ థియేటర్ ఆఫ్ ఫిలిప్పు. ఇది రోమన్ చక్రవర్తి కాలంలో కట్టిన అతి పురాతనమైన స్టేడియం. ఆరు వేల మంది కూర్చుని తిలకించడానికి ఈ స్టేడియం (థియేటరు) కట్టారు. ఇది (ఎడిజడ్) రెండవ శతాబ్దంలో కట్టిన అతి పురాతనమైన సుందరమైన కట్టడం. పోల్దీవ్ 6000 బి.సి నాటి పట్టణం. ఇది ఫిలిప్ మెసెడోనియా రాజు ఈ పట్టణానికి ఫిలిపోలిస్ అనే పేరు పెట్టాడు. (346బిసి) కాలంలో ఈ రాజు గారు (గ్రేట్ ఎంపరర్) అలెగ్జాండర్ తండ్రి ఈ రాజుగారు ఏధెన్స్ని, తేబ్స్ని కథోనియా అనే యుద్దంలో ఈ ప్రదేశాన్ని గెలుచుకొన్నారు. దీనినే గ్రీకు రాజ్యంలో లీగ్ ఆఫ్ కోరింధ్ అంటారు.
దీన్ని దజామ్బాజ్, టాక్సిమ్ తేపె అనే కొండల మధ్యన ట్రేయాన్ అనే రాజుగారు కట్టారు. దీన్ని మార్బుల్ రాతితో కట్టారు. ఇది మొత్తం తెల్లటి స్తంబాలతో గ్రీకు నాగరికత ఉట్టిపడేటట్టుగా నిర్మించారు. ఆ కాలంలో కట్టిన గదులు, గదులబైట వరండాలు చాలా పెద్ద పెద్ద స్తంభాలతో ఆర్చిలాగ కట్టారు. ఆ గదులని దాటి కొద్దిగా కింది భాగంలో స్టేడియంలాంటి నిర్మాణం కనిపిస్తుంది. చుట్టూ అర్ధ చంద్రాకారంలో వున్న మెట్లు ఈ మెట్లమీద కూర్చోని ఆనాటి ప్రదర్శనని తిలకించేవారు. రెండవ శతాబ్దం నాటి మహాఅద్బుతమైన కట్టడాన్ని చూసి సంభ్రమాశ్చర్యానికి లోనయ్యాను. అక్కడే ఒక అరగంట కూర్చోని ఆనాటి విశేషాలను నెమరువేసుకొని ఆ పురాతన పట్టణ వైభవాన్ని చూడడానికి బయల్దేరాం. ఈ ప్రాంగణమంతా అలనాటి రాతి పలకలతో వీధులన్నీ పరచివున్నాయి. ఏడు అడుగుల వెడల్పుతో లోపలి వీధులు, పక్కన చిన్న కాలువలలో మురికినీరు పోవడానికి డ్రైనేజి సిస్టమ్ ఎంతో చక్కటి ప్రణాళికతో కట్టారు. అలా నడుస్తూ ఉంటే దారి పొడవునా పెద్ద పెద్ద భవంతులు రాతి కట్టడంతో కట్టి వున్నాయి. అవి తిలకిస్తూ ఒక చోట నాలుగు అంతస్థుల భవనానికి పై నుండి కింది వరకు పెయింటింగ్స్ వేసి వున్నాయి. అక్కడ ఫోటో దిగి అక్కడున్న అన్నీ పురాతనమైన వీధులలో మూడు కోడిగుడ్లు పెద్ద రాతితో చేసిన గుడ్లు వాటికి రంగు వేసి ఒక పళ్ళెం ఆకారంలో వున్న రాతి పళ్ళెంలో అందంగా ఉంచారు.
లిటిల్ పారిస్...
అదే రోజూ మేం 13 కి.మీ. నడిచాం. కాని అలసట అనేది తెలియలేదు. ఎందుకంటే ''ఆకలుండదు దాహా ముండదు'' నిన్ను చూస్తుంటే అని ఆనందంగా పాడుతూ ఆ వీధులన్నీ తిరిగాం. ఒక చోట లోహంతో తయారు చేసిన బొమ్మ అరుగుమీద కూర్చుని వుంది. ఆ బొమ్మ చెవిలో మన కోరిక చెబితే ఆ కోరిక నెర వేరుతుందట. నేను ఆ చెవిలో నా కోరిక చెప్పాను. ఎన్నో అందమైన చెట్లతో ఫౌంటెన్స్తో ఎంతో అందమైన స్థలంలో ఆనాటి రాజులు తిరుగాడిన అన్ని స్థలాలు చూస్తూ చికెన్‌తో చేసిన రోటీ వేడి వేడిగా తిన్నాం. పురాతనమైన పోస్టాఫీస్ అన్నీ చూసాం. తర్వాతరోజు మ్యూజియం చూశాం. అక్కడి నుండి రుమేనియాకి బయల్దేరాం. ఇది 500 కి.మీ దూరం వుంది. ఆరు గంటల ప్రయాణం. పొద్దున ఆరు గంటలకు బయలుదేరితే మూడు గంటలకు చేరుకున్నాం. ఆ దారివెంట ఎంతో పెద్ద చెట్లతో అడవిని అభివృద్ది చేశారు. ఆ ప్రాంతంలోనే బాహుబలి సినిమా కూడా షూట్ చేశారు. ఎంతో అందమైన దారి సరస్సులు, నదులు, పచ్చని చెట్లతో చాలా ఆహ్లాదకరంగా వుంది. ఆ తర్వాత రోజూ రొమానియా క్యాపిటల్ బుచారెస్ట్కు చేరుకున్నాం. 1,877,155 మిలియన్స్ప్రజలు ఇక్కడ నివసిస్తున్నారు. దీన్ని (లిటిల్ పారిస్) అని కూడా అంటారు.
- నర్మదా రెడ్డి
9849018510
Authorization