బిర్లా ప్లానిటోరియం అనగానే స్కై థియేటర్ గుర్తుకు వస్తుంది చాలామందికి. ఆకాశంలోని నక్షత్రాలను, భూ పరిణామ క్రమాన్ని.. డైనోసార్ ఆనవాళ్లు.. ప్రకృతి అందాలు... పక్షుల కిలకిలా రావాలు.. జల చరాల విన్యాసాలు మనకు కనిపిస్తాయి. బి.ఎమ్ బిర్లా సైన్స్ మ్యూజియం అనగానే సైన్స్, ఎడ్యుకేషన్ పర్యాటకులను, విద్యార్థులను ఆవహిస్తుంది. ఇది అంతుపట్టని రహస్యాలకు నిలయం.. సైన్స్‌ను పరిశోధించి, సాధించిన వింతలను కండ్లకు కడుతోందీ బిర్లా ప్లానిటోరియం. సముద్రంలోని రంగురంగుల చేపలు, అరుదైన జంతువులు, సముద్రపు అడుగున వింతైన కోరల్ రీఫ్స్తో పాటు మరెన్నో వింతలు చూపించేందుకు టైమ్ ట్రావెలర్. టైమ్ ట్రావెలర్‌లో ''బాటమ్ ఆఫ్ ద సీ'' అనే షోను ప్రదర్శిస్తారు. ఈ ప్రదర్శన కేవలం వేసవి సేలవుల్లోనే ఉంటుంది. ఈ హాలీ డేస్‌లో ప్లాన్ చేసుకొని కుటుంబంతో సహా సందర్శించండి.
నిన్నటి దాకా మనం విన్న సముద్రపు వింతలు, విశేషాలను ఇప్పుడు కళ్లారా చూసే అవకాశం కల్పిస్తోంది బిర్లా సైన్స్ మ్యూజియం. నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్ సహకారంతో వేలాది మంది పరిశోధకులు, సాహస యాత్రికులు, సాంకేతిక నిపుణులతో సముద్రగర్భంలో సాగించిన అన్వేషణ వీడియోలను సేకరించి బాటమ్ ఆఫ్ ద సీ పేరుతో ప్రదర్శిస్తుంది. త్రీడీ టెక్నాలజీతో రూపొందించిన ఈ వీడియోలో సముద్ర గర్భాల్లో ఉండే అద్భుతమైన ప్రదేశాలు, అరుదైన చేపలు, సముద్ర జీవులు, మొక్కలను చూడొచ్చు. త్రీడీ ప్రదర్శన కావడంతో చూపరులకు సముద్రంలో పయనిస్తున్న అనుభూతి కలిగిస్తుంది.
టైమ్ ట్రావెలర్ : కిలోమీటర్ల లోతులో ఉండే సముద్రంలో ప్రయాణి స్తూ పరిశోధకులు చిత్రించిన ఈ వీడియోలో సముద్ర గర్భం ఎలా ఉంటుందో కండ్లకు కడుతూనే, ఆ ఆవరణలోని వివిధ రకాల జీవులు, వాటి మధ్య సంబంధాలను తెలియజేస్తుంది. రంగురంగుల చేపల సంచార విన్యాసాలు, ఆహార సేకరణ (వేట), సమద్రపు గుర్రం, తీగ జాతి మొక్కకు ఉన్నట్లుగా శాఖలు ఉన్న అరుదైన చేపలు ఇందులో కనిపిస్తాయి. వీటిని సీ హార్స్ అని పిలుస్తారని మ్యూజియం సిబ్బంది పేర్కొంటున్నారు. ఉపరితల నేలపై చీమలు పుట్టలు పెట్టినట్టే సముద్ర నేలలో చేపలు కూడా ఆవాసాలను ఏర్పాటు చేసుకోవడం, వాటిల్లోకి అవి ఎలా ప్రవేశిస్తాయో ఈ ప్రదర్శనలో చూడొచ్చు. చేపల గమనం, చిన్న చేపను పెద్ద చేప వేటాడడం ఇందులో ప్రధానంగా కనిపిస్తుంది. అతిచిన్న చేప నుంచి షార్క్ వరకు ఇదేవిధంగా తింటూ సముద్రంలో ఎలా జీవిస్తున్నాయో తెలియజేస్తూనే, చేపలు, నీటి జంతువుల మధ్య ఉండే సంబంధాన్ని కూడా తిలకించవచ్చు.
వేసవి సెలవుల్లో మాత్రమే : బిర్లా ప్లానెటోరియంలో ఇప్పటి వరకు అంతరిక్ష విశేషాలే చూసే అవకాశం ఉంది. అంతరిక్షంతోపాటు సముద్రంలోనూ అనేక రహస్యాలున్నాయి. ఆ వింతలను, విశేషాలను ప్రజలకు తెలియజేయాలని బాటమ్ ఆఫ్ ద సీ ప్రదర్శన ఏర్పాటు చేశాం. ఈ ప్రదర్శన కేవలం వేసవి సెలవుల్లోనే అందుబాటులో ఉంటుంది. వీడియో ప్రదర్శనతోపాటు ఫొటో ప్రదర్శన కూడా అందుబాటులో ఉంటుంది. వీడియో ప్రదర్శన 70 నిమిషాలపాటు ఉంటుంది. విద్యార్థులకు ఇది బాగా ఉపయోగపడుతుంది. పిల్లలకు అందుబాటులో ఉండాలనే ఉద్దేశ్యంతో పాఠశాల విద్యార్థులకు ప్రవేశ రుసుంలో సగం రాయితీ ఇస్తున్నాం. వేసవి సెలవులు తర్వాత ప్రదర్శన నిలిపివేస్తాం. సైన్స్‌పై ఆసక్తి, అభిమానం ఉన్నవారు తప్పక ఈ అవకాశం సద్వినియోగం చేసుకుంటే మంచిది.
Authorization