పర్యాటక ప్రాంతాల్లో ఒక్కొక్క దేశానికి ఒక్కొక విశిష్టత ఉంది. అక్కడి వాతావరణం, దర్శనీయ ప్రదేశాలు మనల్ని ఆకట్టుకుంటేనే ఎంజారు చేయగలుగుతాం. ఈ వేసవి సెలవుల్లో అలా మేం బాగా ఎంజారు చేసింది సింగపూర్‌లోనే. బిజీ లైఫ్ నుంచి, ఉరుకుల పరుగుల జీవితం నుంచి కాస్త సేద తీరేందుకు ప్రతి సంవత్సరం వేసవి సెలవుల్లో ఏదో ఒక ప్రదేశాన్ని చుట్టి రావడం అలవాటు. ఈ సంవత్సరం మాత్రం సింగపూర్ వెళ్లి రావాలని ప్లాన్ చేసుకున్నాం. మా ఫ్యామిలీ, స్నేహితులతో కలిసి చేసిన ఈ ప్రయాణం అనేక అనుభూతుల్ని మిగిల్చింది. మేం చూసిన, మాకు ఆహ్లాదాన్నిచ్చిన, మమ్మల్ని ఆకట్టుకున్న ప్రదేశాలు అక్కడ ఎన్నో... వాటిల్లోంచి కొన్నింటిని మీతో పంచుకునేందుకు ఈ చిన్ని ప్రయత్నం.
సింగపూర్ అనగానే వెంటనే గుర్చొచ్చేది ఆకాశాన్ని తాకే కట్టడాలు, వినూత్న టెక్నాలజీని ప్రజలముంగిటకు తెచ్చిన అక్కడి పరిపాలన. నూతన ఆవిష్కరణలకు నెలవైన ప్రదేశమని, కానీ వీటన్నికంటే భిన్నమైనది అక్కడి పర్యాటక రంగం. సహజసిద్ధమైన ప్రకృతిని ఒడిసిపట్టి ప్రజల ముంగిట ఉంచిందని చాలా మందికి తెలియదు. బహుశా అందుకే కాబోలు ప్రతి సంవత్సరం మిలియన్ల మంది పర్యాటకులను ఆకర్షించగలుగుతుంది. దీనికి తోడు యూరప్ దేశాల్లోని వాతావరణ పరిస్థితులను తనలో మమేకం చేసుకున్నందుకు కూడా ఎక్కువ మంది ఈ దేశంలో పర్యటించేందుకు ఇష్టపడతారు. ప్రపంచంలో అత్యున్నత పర్యాటక కేంద్రంగా విలసిల్లుతున్న సింగపూర్‌లో చూడాల్సిన ప్రదేశాలు చాలా ఉన్నాయి. వాటిలో నైట్ సఫారీ, సింగపూర్ బొటానికల్ గార్డెన్స్, జురాంగ్ బర్డ్ పార్కు, మెర్లయోన్ పార్కు, సెంతోసా ద్వీపం, అండర్ సీ వరల్డ్ చాలా ముఖ్యమైనవి.
నైట్ సఫారీ...
సాధారణంగా జంతుప్రదర్శనశాలలను చూడాలంటే ప్రపంచంలో ఎక్కడైనా పగటివేళల్లోనే అనుమతిస్తుంటారు. మన హైదరాబాద్‌లోని జూపార్కులో కూడా పగటివేళల్లోనే సందర్శించడానికి అవకాశం ఉంటుంది. కానీ సింగపూర్ మాత్రం దీనికి భిన్నం. దానికి కారణం కూడా వాళ్లు చెబుతున్నారు. జంతువులు, పగటి వేళల్లో కంటే రాత్రి వేళల్లోనే సహజసిద్ధంగా సంచరిస్తుంటాయని. అందుకోసమే ఈ 'నైట్ సఫారీని' రాత్రి వేళల్లోనే సందర్శించేందుకు అనుమతిస్తున్నారు. రాత్రివేళల్లో తిరిగే జంతువులను, పక్షులను చూడాలంటే ప్రత్యేకమైన చీకటి గుహల్లోనే చూడాలి. ఈ అవకాశాన్ని ప్రపంచంలోనే మొట్టమొదటి సారిగా సింగపూర్ ఏర్పాటు చేసింది. ఆసియా, ఆఫ్రికా, దక్షిణ అమెరికాకు చెందిన అనేక అరుదైన అడవి జంతువులను అక్కడ చూడవచ్చు. నైట్ సఫారీను చూసేందుకు పర్యాటకులు ట్రాములో వెళ్ళాల్సి ఉంటుంది. నెమ్మదిగా ట్రాము కదులుతుంటే, జంతువులు వాటి సహజ పరిసరాలలో మనకు చాలా దగ్గరనుంచీ కనిపిస్తాయి. ఇలా రాత్రిళ్లు మన కండ్లముందే అవి తిరుగాడుతుంటే చూడటం ఓ వింత అనుభూతి. మేం నైట్ సఫారీకి వెళ్ళిన వెంటనే అక్కడి ఆదివాసీల నృత్యం మాకు స్వాగతం పలికింది. బలంగా ఉండే యువకులు విలువిద్య కౌశలం, వెదురు బొంగులు వేగంగా కదులుతుంటే వాటి మధ్య అడుగులు వేస్తూ చేసే నృత్యం చూడముచ్చటగా ఉంది. ఇందులో మరో ఆకర్షణ మంటలతో ఆదివాసీలు చేసే నృత్యం.
జురాంగ్ పక్షి కేంద్రం...
ఆగేయాసియాలోనే అతి పెద్ద పార్కుగా ప్రఖ్యాతి చెందిన జురాంగ్ పక్షుల కేంద్రం అద్భుతమైన ప్రదేశం. దాదాపు 600 జాతులకు చెందిన ఎనిమిది వేల పక్షులు ఈ పార్కులో ఉన్నాయట. ప్రపంచంలోని వివిధ రకాల పక్షి జాతులను పార్కును ఓ పద్ధతి ప్రకారం చూసేందుకు వీలుగా ఏసీ, పానో రైలు సదుపాయం నిర్వాహకులు కల్పించారు. మెయిన్ స్టేషన్లో ఎక్కి నుంచి వివిధ స్టేషన్లలో దిగుతూ... అక్కడి వాటిని చూస్తూ సాగే ప్రయాణం ఇది. ప్రపంచంలోనే అరుదైన లోరికీట్ పక్షులు (ఎరుపు రంగు చిలుకల్లా ఉండేవి) లోరీ స్టేషన్లో దిగినపుడు చూడవచ్చు. ఇక పక్షులకు ఆహారం పెడుతున్నపుడు వాటి హడావుడి చూసితీరాల్సిందే!. పక్షులకు ఆహారం వేస్తూ ఫొటోలు తీయించుకోవచ్చు. నేను, నా భార్య అక్కడ పక్షులకు ఆహారం తినిపిస్తూ ఎంజారు చేశాం.
ఈ బర్డ్స్ పార్కులోనే మరో ప్రత్యేక ఆకర్షణ అక్కడి మానవనిర్మితమైన అతి ఎత్తైన జలపాతం సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఈ పార్కులో వందలాది పెంగ్విన్లు, నిశాచర పక్షుల్ని, పెవికాన్లని, రకరకాల కొంగల్ని కూడా చూడవచ్చు. పుజీహాక్వాక్ స్టేడియంలో గద్దలు, హాక్‌లు, ఫాల్కన్ పక్షులు విన్యాసాలు ఆకర్షణీయంగా ఉంటాయి. పక్షులు వేటాడే విధానాన్ని ప్రత్యక్షంగా చూసే అవకాశం కలుగుతుంది. పచ్చని పొలాలకు, సెలయేర్లకు దూరంగా నగరజీవితానికి అంకితమైన మా లాంటి వాళ్ళకు ఇక్కడి వాతావరణం బాల్యం లోకి తీసుకెళుతుందంటే ఆతిశయోక్తి కాదేమో..! ఈ పార్కులోనే ఉన్న ఆంఫీథియేటర్ ప్రత్యేకత ఏంటో తెలుసా..! శిక్షణ తీసుకున్న అనేక పక్షుల చేత శిక్షకులు చిన్న రాళ్లతో గుట్టని పగులగొట్టడం, బాస్కెట్‌బాల్ ఆడటం, సందర్శకుడి చేతినుంచి డాలర్ నోటు ఎగరేసుకుపోవడం లాంటి ఫీట్లు చేస్తాయి. మొత్తంగా మనల్ని మంత్రముగ్ధుల్ని చేస్తాయి.
బొటానికల్ గార్డెన్స్...
140 సంవత్సరాల చరిత్ర కలిగిన బొటానికల్ గార్డెన్స్ సింగపూర్‌లో చూడదగ్గ మరో ప్రదేశం. పదివేల రకాల వృక్షాలు ఒకే ప్రాంగణంలో ఉండటం చూస్తే ఆశ్చర్యచకితులవుతాం. ఇక్కడి పువ్వులు రంగుల ప్రపంచాన్ని ఆవిష్కరిస్తుంటే, ఇందులోని ఆర్కిడ్ ఉద్యానవనం మరో అదనపు ఆకర్షణగా చెప్పవచ్చు. అసక్తికలవారు వాటి వివరాలు తెలుసుకునేందుకు కంప్యూటర్ తెరలను సైతం ఏర్పాటు చేశారు. అలాగే పిల్లల కోసం ఓ ప్రత్యేకమైన గార్డెన్ కూడా ఉంది. ఉష్ణప్రదేశాల్లో ఉండే మాంసాహార చెట్లు సైతం మనకు దర్శనమిస్తుంటాయి.
మెర్‌లయెన్ పార్కు...
సింగపూర్ లో ఇంకా చూడాలనిపించే పర్యాటక ప్రదేశాలు చాలా ఉన్నాయి. వాటిలో నగరంలోని మెర్ లయన్ పార్కు. దీన్ని తప్పక చూడాల్సిందే!. తెలుగు సినిమాల్లో కూడా ఇది మనకు కనిపిస్తుంటుంది. 'సింహపురి' సింగపూర్‌గా రూపాంతరం చెందడం వల్ల కాబోలు సింహం, చేప కలిగిన శిల్పానికి అత్యంత ప్రజాదరణ లభించింది. లండన్ కన్నా పెద్దదైన సింగపూర్ ఫ్లైయర్ ఎక్కిన వారు 165 మీటర్ల ఎత్తు నుంచి సింగపూర్‌నే కాకుండా, మెరీనాబే ని కూడా చూడవచ్చు.
డక్ టూర్...
ఆసియాలోనే మొట్టమొదటిసారి ప్రవేశపెట్టిన సింగపూర్ డక్‌టూర్ ఒక ప్రత్యేక ఆకర్షణ. నీటిమీదా, నేలమీదా ప్రయాణించే ఉభయచర వాహనంలో తిరుగుతూ అక్కడి పర్యాటక ప్రదేశాలను చూడటం. పన్ టెక్‌సిటీ, విక్టోరియా థియేటర్ సుప్రీంకోర్టు, వార్ మెమోరియల్ పార్కు మొదలైన వాటిని నీటిలో ప్రయాణించినపుడు, ఎప్సలనేడ్ మెర్ లయన్ విగ్రహం, తదితర విశేషాలు నేలమీద ప్రయాణంలో చూడవచ్చు. వీటిలో సింగపూర్‌లోని పురాతన చైనా గుడి చూడదగ్గది. ద్వారపాలకులుగా సింహాల విగ్రహాలు ఆకట్టుకుంటాయి. ఇంకా... బుద్ధుడి దంతం ఉన్నదని చెప్పబడే గుడి, సింగపూర్ జూ, పాసిక్ రిస్ పార్కు, ఎమ్ఎన్టి బొమ్మల మ్యూజియం, నేషనల్ మ్యూజియం, వార్ మెమోరియల్స్లాంటివి ఇతర సందర్శనీయ స్థలాలను కూడా చూడవచ్చు.
ఆర్చర్డ్ రోడ్ ప్రాంతం...
సింగపూర్‌లో మేం మొదట చూసిన ప్రదేశం ఆర్చర్డ్ రోడ్డు లోని షాపింగ్ సెంటర్లు. ఇక్కడున్న బహుళ అంతస్తుల షాపింగ్ సెంటర్లు, హౌటళ్లు సింగపూర్ పర్యాటకరంగానికి కేంద్రంగా భావించవచ్చు. సింగపూర్ ప్రయాణంలో చక్కటి ఆహారం, దాంతో పాటు ప్రపంచంలోనే ఐదు దేశాలలో సింగపూర్ షాపింగ్ ఒకటిగా గుర్తుంపు పొందింది. రాత్రి సమయంలో సింగపూర్‌లో వినోదాన్ని అందించే కొన్ని ప్రముఖ ప్రదేశాలలో ఇదొకటి.
సెంతోసా ద్వీపం...
సింగపూరు పర్యటనలో ''సెంతోసా ద్వీపా'' న్ని సందర్శించకపోతే ఆ పర్యటనే అసంపూర్ణమని చెప్పాలి. సింగపూర్ దక్షిణాన ఉన్న పర్యాటక ద్వీపం సెంతోసాకు ప్రతిసంవత్సరం ఐదు మిలియన్లకు పైగా సందర్శకులు వస్తుంటారట. ఇందులో 20-30 ప్రముఖ ప్రదేశాలు ఉన్నాయి. ఈ ద్వీపంలోకి కేబుల్ కార్లో వెళితేనే చాలా థ్రిల్లింగ్‌గా ఉంటుంది. భూమినుంచి అనేక అడుగుల ఎత్తునుంచి విహంగవీక్షణం చేయగలగడం ఒక మరపురాని అనుభూతి. సింగపూర్ సాంస్కృతిక చిహ్నమైన మెర్లయన్ 37మీటర్ల ఎత్తున్న విగ్రహాన్ని రెప్పవేయకుండా చూడాలనిపిస్తుంది. వీటిలో రెండవ ప్రపంచయుద్ధ సమయంలో జపనీయుల నుండి రక్షణగా దుర్గంగా సిలోసో కోట నిర్మించారు. ఈ ద్వీపంలోనే 'టైగర్ స్కై' టవర్ నిర్మించాడు. దీన్ని ఎక్కి చూస్తే సెంటోసా ద్వీపం అంతా అద్భుతంగా కనిపిస్తుంది. ఇక్కడ పదిహేనువందల సీతాకోక చిలుకలనే కాకుండా మూడు వేల రకాల అరుదైన అందమైన కీటకాల్ని చూసే అవకాశం కలుగుతుంది. అలాగే ఇక్కడి ''అండర్ వాటర్ వరల్డ్'' లో 2500 జాతులకి చెందిన 2,500 జలచరాల్ని చూసే వీలుంది. 83మీటర్ల సొరంగం నుంచి ట్రావ్‌లేటర్ ద్వారా అనేక రంగుల, ఆకారాల జలచరాల్ని చూడడం ఒక వింత అనుభవం.
భాష సమస్య కాదు
సింగపూర్ మనకు విదేశంగా కనిపించినప్పటికీ అక్కడ ఉన్నన్ని రోజులూ మాకు పెద్దగా భాష సమస్య ఎదురు కాలేదు. సింగపూర్‌లో ప్రజలు ఎక్కువగా, ఇష్టంగా మాట్లాడేది రెండే రెండు భాషలు. అవి ఒక మకాన్, రెండు సింగ్లీష్. ఇంగ్లీష్ గురించి మనకు తెలుసు కానీ ఈ సింగ్లీష్ ఏంటంటే!.. అక్కడి మలై, ఇండోనేషియా, తమిళం, చైనీస్ లాంటి భాషలకు ఇంగ్లీష్‌కు మేళవించి సింగపూర్ వాసులు మాట్లాడే భాషనే సింగ్లీష్ అంటారు. ఇంకా విడమరిచి చెప్పుకోవాలంటే సింగపూర్ ఇంగ్లీష్ అనవచ్చు. ఒక రకంగా మన హైదరాబాద్‌లోని ఉర్దూ - హిందీ లాంటిదన్నమాట.. అక్కడి సాంస్కృతిక వైవిధ్యం కూడా చైనీస్, మాలే, భారతీయ, అరబ్ జాతులను ప్రతిబింబిస్తుంది. బహుశా ఇది కూడా పర్యాటకులను ఆకట్టుకోవడానికి ఒక కారణం కావొచ్చు. వివిధ దేశాల నుంచి వచ్చిన పర్యాటకులు షాపింగ్ సందర్భంగా అక్కడి స్థానికులతో జరిపే సంభాషణ కూడ అర్థం చేసుకోవడానికి సులభంగా ఉంటుంది.
- యు. ఎల్లేష్, జాయింట్ రిజిస్ట్రార్,
ఉస్మానియా విశ్వవిద్యాలయం
9490706297
Authorization