మేం న్యూయార్క్ దర్శించడానికి వీలుగా మమ్ముల్ని ఉదయం టిఫిన్ చేసిన తరువాత ఎడిసన్‌లోని ఇంటి దగ్గరి నుండి కార్లో తీసుకొని వెళ్లి ఫెర్రీ దగ్గర వదిలేసి ఆఫీస్ కు వెళ్ళిపోయాడు సుమన్ (మా అబ్బాయి శరత్ స్నేహితుడు) ఫెర్రీ అంటే న్యూజెర్సీ నుండి న్యూయార్క్ వెళ్లేందుకు హడ్సన్ నది పక్కన ఉన్న నౌకాయాన కేంద్రం. ఉదయం పది గంటలకు వందలాది మంది న్యూయార్క్ కు షిప్ పై వెళ్లేందుకు రెడీగా ఉన్నారు. షిప్లో ప్రయాణికులు ఇటునుండి అటు, అటు నుండి ఇటు వెళ్తున్నారు, వస్తున్నారు. రద్దీగా ఉంది ఫెర్రీ ప్రయాణికులతో. వాస్తవానికి న్యూయార్క్ ఎక్కువ జన సాంద్రత గల నగరం, ఖరీదైన ప్రాంతం. ఖర్చులు కూడా ఎక్కువ బతకడానికి. వేలాది మంది ఉద్యోగస్తులు న్యూయార్క్ చేరుకుంటారు. ఖరీదైన నగరం కాబట్టి జీవనం కొనసాగించడం ఎక్కువ ఖర్చుతో కూడుకుంది. న్యూయార్క్‌లో ఉద్యోగం చేస్తూ, న్యూజెర్సీ లో నివాసం ఉంటూ రోజు న్యూయార్క్ కు ఫెర్రీ పైనో, రైలు పైనో, ఇంకా కారులోనో వెళ్లి వస్తారని తెలిసింది. కారులో వెళితే అక్కడ కారు పార్కింగ్ కు కూడా పదో, ఇరవైయో డాలర్లు చెల్లించాల్సిందే. అందుకే రైల్, ఫెర్రీ గుండా లేదా షిప్ పైనో న్యూజెర్సీ నుండి న్యూయార్క్ కు వెళ్లి వస్తారట చాలామంది ఉద్యోగస్తులు. రైల్లో వెళ్ళితే రైల్ టికెట్ పెట్టుకోవాల్సిందే. కాని ఫెర్రీ ద్వారా షిప్ పై వెళితే పైసా ఖర్చు లేకుండా అరగంట వ్యవధిలోనే న్యూయార్క్ నగరాన్ని చేరుకోవచ్చు. మేం అలా ఫెర్రీ ఎక్కి న్యూయార్క్‌కు బయలు దేరాం.
కనుచూపు మేరలో ఒక వైపు స్టాట్చ్యూ ఆఫ్ లిబర్టీ స్వాగతం పలుకుతుంది. ఆ పక్కనే ఎల్లీస్ ఐలాండ్ కనిపిస్తుంది. ఇంకో దిక్కు వరల్డ్ ట్రేడ్ సెంటర్ ఎత్తయిన భవనాలు కనిపిస్తున్నాయి, నది మధ్యలో బ్రుక్లిన్ వంతెన గాలిలో వేలాడినట్టు అందంగా కనిపిస్తుంది. ఆపై దూరంగా మాన్ హట్టన్ ప్రాంతపు ఎత్తయిన భవ నాలు కనువిందు చేస్తాయి. న్యూయార్క్ అంటే ఆకాశహర్మ్యాల నగరమా అని అనిపించింది! ఇంకా న్యూయార్క్ నగరం గురించి చెప్పాలంటే అది అమెరికాలోని ప్రధాన నగరాల్లో, ఇంకా ప్రపంచ ప్రసిద్ద్ధ నగరాల్లో కూడా ఒకటి. అది ఆ దేశ వర్తక, వాణిజ్య రాజధాని, సాంస్కతిక రాజధాని కూడా! ప్రపంచంలో కూడా దానికి అంతటి పేరుంది. వినోదం, విజ్ఞానం, విద్య, పరిశోధన, క్రీడలు, రాజకీయం, వర్తకం, వాణిజ్యం, అన్నింటికీ కూడలి కేంద్రం. దూరం నుంచి చూస్తే హడ్సన్ నది పక్కన ఉన్న న్యూయార్క్ నగరం ఎత్తయిన భవనాలతో చూపరులను ఆశ్చర్యంలో ముంచెత్తుతుంది. అమెరికాలో నేను చూసిన మూడు విశేషమైన నగరాలైన న్యూయార్క్, చికాగో, లాస్ ఎంజెల్స్. అన్నింటి కంటే నాకు బాగా నచ్చింది న్యూయార్క్ నగరం. ఒక్క రోజు చాలుతుందా న్యూయార్క్ నగరం చూడడం, అస్సలే చాలదు! ఒక రాత్రి, ఒక పగలులా ఒకటి రెండురోజులైనా న్యూయార్క్ నగరాన్ని తనవితీరా దర్శించవచ్చు. మేం చూసింది మాత్రం ఉదయం పదకొండు గంటల నుండి సాయంత్రం ఐదు, ఆరు గంటల వరకే ! షిప్ పై న్యూయార్క్ కు ప్రయాణం ఆహ్లాదంగా అనిపించింది. చిన్నగా ప్రయాణం మధ్యలో వర్షపు చిను కులు కూడా కురిసినాయి. షిప్ పై నుండి వివిధ దిక్కులలో ఉన్న న్యూయార్క్ అందాలను ఫొటోలలో బంధించాం. మేం కూడా ఫొటోలు దిగాం. న్యూయార్క్ వైపు ఫెర్రీ లో దిగిన తరువాత మొదటగా మేం చూడాలనుకుంది స్టాట్చ్యూ ఆఫ్ లిబర్టీ .
స్టాట్చ్యూ ఆఫ్ లిబర్టీ, లిబర్టీ ఐలాండ్ లో ఉంది. దాని పక్కనే ఎల్లీస్ ఐలాండ్ ఉంది. ఇవి రెండూ చూడడానికి ప్రత్యేకంగా షిప్ పైన టికెట్ తీసుకొని వెళ్లాం. స్టాట్చ్యూ ఆఫ్ లిబర్టీ అనేది అమెరికా దేశపు గౌరవ చిహ్నం. దానిని సురక్షితంగా కాపాడుకోవడం అమెరికా బాధ్యత కూడా! అందుకేనేమో, షిప్‌లోకి వెళ్లేందుకు ప్రతేకమైన చెక్కింగ్ చేశారు ప్రతి ఒక్కరిని. 'స్టాట్చ్యూ ఆఫ్ లిబర్టీ' అనేది ఫ్రాన్స్ దేశపు నియో క్లాసికల్ శిల్పకళకు చిహ్నం. అది రాగితో తయారు చేసిన స్వేచ్ఛామాత విగ్రహం, దానిని ఫ్రాన్స్ దేశపు శిల్పి ఫ్రెడరిక్ అగస్టీ బెర్తోల్ద్ తయారు చేశాడు. దాన్ని గస్టవ్ ఈఫిల్ అనే ఫ్రెంచ్ ఇంజనీర్ అమెరికాలోని న్యూయార్క్ హార్బర్ ఐలాండ్ లో నిర్మించారు. పారిస్ లో ఈఫిల్ టవర్ నిర్మాణం చేసింది ఇతడే. అది ఫ్రాన్స్ దేశ ప్రజల తరపున అమెరికా దేశపు ప్రజలకు బహుమతిగా అమెరికా స్వేచ్ఛా, స్వాతంత్య్రాల (జులై 4, 1776)కు గుర్తుగా ప్రదానం చేశారు. అక్టోబర్ 28, 1886 నాడు జాతికి అంకితం చేశారు. 'స్టాట్చ్యూ ఆఫ్ లిబర్టీ' అనేది స్వేచ్చకు ప్రతీక అయిన రోమన్ దేవత విగ్రహం. తలపై కిరీటంతో నిండుగా వస్త్రాలు ధరించి, కుడి చేతితో తలపై భాగాన ఎత్తి పట్టుకున్న టార్చ్‌తో, ఎడం చేతిలో పుస్తకం పట్టుకొని ఉంది, దానిపై అక్షరాలు ముద్రించారు. అమెరికా స్వతంత్ర దినానికి గుర్తుగా. ఇంకా స్వేచ్ఛ పొందిన దానికి చిహ్నంగా విగ్రహం కాళ్ళ దగ్గర తెంచబడిన శంఖలాలు పడి ఉంటాయి. అలా 'స్టాట్చ్యూ ఆఫ్ లిబర్టీ' అమెరికా స్వేచ్ఛా స్వాతంత్రానికి ప్రతీక. ఆ స్వేచ్ఛామాత విగ్రహం అమెరికా దర్శించే విదేశీయులకు స్వాగతం పలుకుతునట్టుగా కనిపిస్తుంది.
అమెరికాలో చూడదగ్గ ముఖ్యమైన ప్రదేశాల్లో 'స్టాట్చ్యూ ఆఫ్ లిబర్టీ' ఒకటి. ఎందరో దేశ విదేశ యాత్రికులు వచ్చి 'స్టాట్చ్యూ ఆఫ్ లిబర్టీ' ని దర్శిస్తున్నారు. వివిధ భంగిమల్లో ఫొటోలు దిగుతున్నారు, వీడియోలు తీసుకుంటున్నారు. మేం కూడా ఫొటోలు దిగాం. లిబర్టీ ఐలాండ్ చాలా విశాలంగా ఉంది. అందులో అన్ని రకాల వస్తువులు కొనుక్కునే స్టాల్ కూడా ఉంది. కాఫీ, టీ, స్నాక్స్ సదుపాయం కూడా ఉంది. వాష్ రూమ్ సదుపాయం కూడా ఉంది. ఓ గంట గడిపి మళ్ళీ షిప్ పై బయలుదేరి వెనక్కు వచ్చాం. పక్కనే ఉన్న ఎల్లీస్ ఐలాండ్‌లో ఒక మ్యూజియం ఉంది. సమయం సరిపోదని దాన్ని చూడకుండానే వచ్చాం. న్యూయార్క్ దగ్గరి హడ్సన్ నది పక్కన చక్కటి ఉద్యాన వనం ఆహ్లాదం గొలుపుతూ ఉంది. తర్వాత మేం కొద్దిగా ముందుకు వచ్చాం రోడ్డు వైపు ఉన్న పార్క్ దగ్గరకు. అక్కడ కొందరు ఆఫ్రికన్స్ ఆ పార్క్ దగ్గర పర్యాటకులను ఆకర్షించడానికి రకరకాల శారీరక విన్యాసాలు చేస్తున్నారు. వచ్చినవాళ్లను డాలర్లు అడుక్కుంటున్నారు. కొద్దిసేపు ఆ విన్యాసాలను చూసి ముందుకు కదిలాం. అప్పటికి సమయం పన్నెండు దాటిపోయింది. ఇంకొద్దిగా ముందుకు పోయాం. అక్కడ ఒక పెద్ద కొమ్ములతో ఉన్న ఎద్దు విగ్రహం ఉంది. ఆ బుల్ ముందట నిలబడి ఫొటోలు తీసుకున్నాం. న్యూయార్క్ వీధులు జనంతో బిజీగా ఉన్న నగరం అనిపించింది. ఎటు చూసినా ఆకాశహర్మ్యాలు కనిపించాయి. ఆ నిర్మాణాలను చూడాలంటే తల పైకెత్తి చూడాల్సిందే! నేను చూసిన డాలస్, ఆస్టిన్ లాంటి నగరాల్లో రద్దీ తక్కువ. రోడ్లు విశాలంగా ఉన్నాయి. న్యూయార్క్ లో ఎటు చూసినా రద్దీ జనం. అలా చూస్తూ చూస్తూ వెళ్తుంటే సమయం ఒంటిగంట దాటి పోయింది. అక్కడికి దగ్గరలో సబ్ వే కనిపించింది. ముగ్గురం తిని మా దగ్గర ఉన్న మంచినీళ్ళు తాగి ముందుకు నడిచాం. అక్కడికి దగ్గరలోనే వరల్డ్ ట్రేడ్ సెంటర్ 2001 సెప్టెంబర్ 11 స్మారకం కూడా ఉంది. ప్రపంచంలోని ఎత్తయిన భవనాల సముదాయంలలో వరల్డ్ ట్రేడ్ సెంటర్ ఒకటి.
అందులో రెండు అతి ఎత్తయిన భవన సముదాయాలను ఆల్ ఖైదా ఉగ్రవాదులు విమానాలను హైజాక్ చేసి విమానాలతో వాటిని 11 సెప్టెంబర్, 2001 నాడు నేలమట్టం చేశారు. ఆ రెండు భవనాలు నేల మట్టమై, పరిసరాల్లోని భవనాలకు కూడా నష్టం వాటిల్లింది. ఆ భవనాల్లోని 2606 మంది ప్రాణాలు పోయాయి. విమానాల్లోని 157 మంది ప్రాణాలు కూడా పోయాయి. అది తీరని నష్టం అమెరికాకు! ఆ ప్రదేశంలో చనిపోయిన వారి స్మారకార్ధం ఒక మెమోరియల్ ను నిర్మించారు సందర్శకులు దర్శించడానికి. తరువాత ఓ దశాబ్ద కాలంలో మళ్ళీ నూతనంగా వరల్డ్ ట్రేడ్ సెంటర్ భవనాలను నిర్మించారు. ఆ స్మారకం ముందు నిలబడి ఫొటోలు దిగి ముందుకు కదిలాం. ఇంకొద్దిగా ముందుకు నడిచి ఒక దగ్గర కూర్చున్నాం, కూర్చోవడానికి సదుపాయం ఉంటే సాధారణంగా అమెరికా దేశపు పట్టణాలలో రోడ్డు పక్కన వస్తువులను అమ్మే దుకాణాలు, తినుబండారాల దుకాణాలు కనిపించవు. కాని న్యూయార్క్ లో మన ఇండియా లో ఉన్నట్టు ఒక దగ్గర తిను బండారాలు అక్కడే తయారు చేసి అమ్మే రోడ్డు పక్క స్టాల్స్ కనిపించాయి. కొద్ది సేపు విశ్రాంతి తీసుకొని దగ్గరలో ఉన్న బ్రూక్లిన్ వంతెన చూడ డానికి వెళ్లాం. ఓ ఇరవై, ఇరువై ఐదు నిమిషాలు నడిస్తే బ్రూక్లిన్ బ్రిడ్జి వచ్చింది. చరిత్ర ప్రసిద్ధమైన బ్రూక్లిన్ బ్రిడ్జి మమ్ములను మోహితులను చేసింది. అది న్యూయార్క్ నగరం మాన్ హట్టన్ దగ్గర ఈస్ట్ నది ముఖద్వారం వద్ద నిర్మించిన ఇనుప స్థంబాల గొలుసుల వంతెన. దాని నిర్మాణం 1869 లో మొదలు పెడితే 1883 లో పూర్తయింది అని చరిత్ర చెపుతుంది.
ఆ బ్రిడ్జి పై 1883 అనే సంవత్సం ముద్రించారు. దానిపైనుంచి పాదయాత్రికులు, సైకిలిస్టులు మాత్రమే వెళ్తున్నట్టుగా కనిపించారు. చాలా రద్దీగా కనిపించింది వచ్చిపోయే పర్యాటకులతో అక్కడ కొన్ని ఫొటోలు దిగి మళ్ళీ వెనుదిరిగాం. న్యూయార్క్ నగరం దర్శించడం అంటే ఎక్కువగా కాలినడకన పర్యటన జరపడమే. ఇంకా కొద్దిగా వెసలుబాటు ఉంటే లోకల్ ట్రైన్ లో మనం వెళ్ళవలసిన ప్రదేశానికి దగ్గారగా దిగి ఆ ప్రదేశాలను చూసి రావడమే. అప్పటికి సమయం పగలు మూడు దాటింది. నడుస్తూ అలసిపోయాం కొంత. మేం తరువాత చూడవలసింది టైం స్క్వేర్ అన్నాడు శరత్.
అప్పుడప్పుడు టైం స్క్వేర్ గురించి టీవీల్లో వినడమే. న్యూయార్క్ సిటీలో ఒక దగ్గర నుంచి ఇంకొక దగ్గరకు వెళ్ళడానికి అండర్ గ్రౌండ్ ట్రైన్ సదుపాయం ఉంది. మేం అండర్ గ్రౌండ్ ట్రైన్ ద్వారానే టైం స్క్వేర్ వెళ్లాం. న్యూయార్క్ లో టైం స్క్వేర్ ను చూడడం మరొక గొప్ప అనుభూతి! ప్రపంచంలోని వింతలు, వినోదాలు, ఆనందాలు, సంతోషాలు లాస్ వేగాస్ లో చూసిందే, మళ్ళీ న్యూయార్క్ టైం స్క్వేర్ లో చూశాం. ఆ ప్రదేశం నాకు న్యూయార్క్ లో మరో లాస్ వేగాస్ లా కనిపించింది. ఆటలు, పాటలు, అందమైన భామలు, వింతలూ, వినోదాలు, కబుర్లు, కాలక్షేపాలు అన్నీ టైం స్క్వేర్ లో ఉన్నాయి. పగలే అంత రద్దీగా వింతలూ, వినోదాలతో ఉంటే ఇంకా రాత్రి పూట మిరుమిట్లు గొలిపే లైట్ల కాంతిలో మనను ఆశ్చర్యచకితుల్ని చేస్తుంది. న్యూయార్క్ టైం స్క్వేర్ అనిపించింది. అప్పటికి సమయం నాలుగు దాటిపోయినట్టుంది. దాహం వేస్తుంటే రెండు వాటర్ బాటల్స్ కొనుక్కున్నాం మూడు డాలర్లకు ఒక బాటిల్ చొప్పున అర లీటర్ బాటిల్. మంచి నీళ్ళు కూడా ప్రియమే అమెరికాలో తాగాలంటే రోడ్డుపై. కూల్ డ్రింక్ తాగినా ఐదు, ఆరు డాలర్లకు ఒకటి చొప్పున కార్డ్ ద్వారా కొనుక్కోవచ్చు. టైం స్క్వేర్‌లో ఫొటోలు దిగిన తరువాత ఇక వెళ్దామన్నాడు శరత్. అప్పటికే చాలా అలసిపోయాం న్యూయార్క్ నగరంలో నడిచీ నడిచి. ఇంకా చూడవలసిన ప్రదేశాలు ఉన్నాయనిపించింది.
ముఖ్యంగా ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ చూడాలే, ఐక్య రాజ్య సమితి భవన సముదాయాలు చూడాలే అని ఉన్నా చూడలేకపోయాం. ఒక్క రోజు చాలదు న్యూయార్క్ చూడాలంటే అనిపించింది. మేం మిస్ అయింది మ్యాడం టస్సాడ్ మైనపు బొమ్మల మ్యూజియం కూడా, అది టైం స్క్వేర్ కు దగ్గరల్లోనే ఉందని తర్వాత తెలిసింది. అయినా న్యూయార్క్ ను మళ్ళీ ఒకసారి రాత్రి పూట కూడా ఉండి మిగిలిన ప్రదేశాలను దర్శించాలని అనిపించింది. అప్పటికి సాయంత్రం ఐదు అవుతుంది. మేం అండర్ గ్రౌండ్ రైల్లో మళ్ళీ న్యూయార్క్ ఫెర్రీ దగ్గరకు చేరుకున్నాం. సాయంత్రం ఆరు గంటల ప్రాంతాన షిప్ పై న్యూజెర్సీ వెళ్లే ప్రయాణికులతో రద్దీగా ఉంది ఆ ప్రాంతం. సాయంత్రం ఆరు, ఏడు మధ్యలో న్యూజెర్సీ ఫెర్రీ చేరుకున్నాం. అక్కడి నుండి ట్రైన్ లో న్యూజెర్సీ ఎడిసన్ కు దగ్గరి స్టేషన్‌కు చేరుకున్నాం. ఆ స్టేషన్ కు వచ్చి మమ్ములను రిసీవ్ చేసుకున్నాడు సుమన్. ఆ రాత్రి మాకు మటన్ తో భోజనం ఏర్పాటు చేశాడు. పగలంతా తిరిగిన అలసటతో ఆ రాత్రి మత్తుగా నిద్ర పట్టింది.
- సబ్బని లక్ష్మీ నారాయణ
8985251271
Authorization