బెంగళూరు అనగానే పచ్చదనం కండ్ల ముందు కదులుతుంది. చల్లటి వాతావరణం స్నేహంగా పలకరిస్తుంది. అందుకే ఆ ప్రదేశం అందమైన పర్యాటక కేంద్రమైంది. ఈ మహానగరం మాత్రమే కాదు.. దీనికి చుట్టుపక్కల చూడదగిన ప్రదేశాలుఎన్నోఉన్నాయి. అవేంటో చూసేద్దాం...
అవళబెట్ట : ఇది బెంగళూరుకు 90 కి.మీటర్ల దూరంలో ఉంటుంది. వన్ డే పిక్నిక్ స్పాట్‌కు తగిన ప్రదేశం ఇది. కుటుంబంతో కలిసి ఒక్కరోజులో ట్రిప్ ముగించే వీలున్న టూరిస్ట్ ప్లేస్ కూడా! అవలబెట్టకు ఓ చారిత్రక విశిష్టత ఉంది. కామధేను కాలుమోపిన ప్రదేశమని నమ్ముతారు. ఇక్కడి కొండ మీద ఆలయం ఉంది. ట్రెక్కింగ్ అవకాశం కూడా ఉంది. అసలే పచ్చదనం. ఇక వర్షాకాలంలో అయితే ఎటుచూసినా చెట్లు, పూలతో పరిసరాలన్నీ ఆహ్లాద కరంగా ఉంటాయి. కొండ పైనున్న హిల్ టాప్, దానికి కొంచెం దిగువన ఉండే క్లిఫ్ ప్రత్యేక ఆకర్షణ. క్లిఫ్ చేరుకోవటం తేలిక. అయితే ఫొటోలు దిగేవాళ్లతో అక్కడ ఎప్పుడూ రద్దీగా ఉంటుంది. ఈ కొండపై కోతులు కూడా ఎక్కువ. అందుకే తినే వస్తువుల విషయంలో జాగ్రత్త తప్పనిసరి. ఇక్కడ రెస్టారెంట్లు లాంటివి ఉండవు కాబట్టి ఆహారం వెంట తీసుకెళ్లాల్సిందే!
స్కందగిరి : ఇది బెంగళూరుకు 70కి.మీటర్ల దూరంలో ఉంది. స్కందగిరి 'కలవరదుర్గ' అనే పర్వతాల కోట. బ్రిటిషర్లతో పోరాడేందుకు వీలుగా టిప్పు సుల్తాన్ ఈ ప్రదేశంలో ఎన్నో కోటలు కట్టించాడు. తర్వాతి కాలంలో ఈ కోటలు కూలిపోయినా వాటి ఆనవాళ్లు ఇప్పటికీ మిగిలే ఉన్నాయి. ఈ కొండ ప్రాంతం మీద ట్రెక్కింగ్ చేస్తూ అందాలను వీక్షించొచ్చు. అయితే ఇక్కడ దొంగలు, మోసగాళ్లు ఎక్కువ. గైడ్ల పేరుతో తప్పు దారిలో తక్కువ దూరం చుట్టి తీసుకొచ్చి ఎక్కువ డబ్బులు వసూలు చేస్తుంటారు. కాబట్టి బృందంగా ఏర్పడి స్వయంగా ట్రెక్కింగ్‌కి వెళ్లిరావటం ఉత్తమం. చీకటి పడుతున్న సమయంలో ట్రెక్కింగ్ చేయకపోవటమే మంచిది. ఇక్కడ ట్రెక్కింగ్ ప్రారంభంలోనే పాపాగ్ని మఠ్ అనే గుడి ఉంటుంది. గుడికి కుడివైపున తిరిగి వంద మీటర్లు నడిస్తే పైకి దారి కనిపిస్తుంది. ఈ దారివెంటే ప్రయాణిస్తూ కొండల మీద గీసిన బాణం గుర్తులను అనుసరిస్తే ఎటువంటి ఇబ్బంది లేకుండా కొండంతా చుట్టిరావొచ్చు. రాత్రివేళ మూన్లైట్ ట్రెక్కింగ్ కూడా చేయొచ్చు. ఇందుకోసం రాత్రి 12 నుంచి బయలుదేరి కొండపైకి 3-4 గంటలకు చేరుకోవచ్చు. సాహసంగా ఉండాలనుకుంటే టెంట్స్, స్లీపింగ్ బ్యాగ్స్ తీసుకెళ్లాలి. మంచినీళ్లు, స్వెటర్లు, స్నాక్స్, టార్చ్ తప్పనిసరి.
భీమేశ్వరి : ఇది బెంగళూరు నుంచి 105 కి.మీటర్ల దూరంలో ఉంది. కావేరి నదికి సమీపంలోని శివసముద్ర జలపాతం. మెకెదతు ఫాల్స్ మధ్యలో ఉందీ ప్రదేశం. కావేరి నదిలో దొరికే మహశిర్ చేప ఈ ప్రాంతం ప్రత్యేకత. జలపాతాలు, అడవులు, జంతువులతో నిండిన భీమేశ్వరి కుటుంబసమేతంగా వెళ్లిరావాల్సిన చక్కటి టూరిస్ట్ ప్లేస్. కావేరి నది పక్కనే విస్తరించిన ప్రదేశం కాబట్టి ఇదొక ప్రసిద్ధ ఫిషింగ్ హబ్‌గా కూడా పేరు పొందింది. నది పొడవునా అక్కడక్కడా ఫిషింగ్ క్యాంప్స్ కనిపిస్తాయి. ఫిషింగ్ వచ్చినవాళ్లేకాదు రానివాళ్లు కూడా ఇక్కడ చేపలు పట్టొచ్చు. కాబట్టి వీలైతే గాలం తీసుకుని ఆ ప్రయత్నం కూడా చేయొచ్చు. ఫిషింగ్ క్యాంప్‌లో అన్ని సౌకర్యాలు ఉంటాయి. దోమ తెరలు, మంచాలు, స్నానం కోసం సదుపాయం, ఓపెన్ ఎయిర్ డైనింగ్ హాల్లో భోజనం ఏర్పాట్లు ఉంటాయి. ఫిషింగ్తోపాటు ట్రెక్కింగ్, బోటింగ్‌కు కూడా భీమేశ్వరి అనుకూలమైనది. కావేరి నదిలో రివర్ రాఫ్టింగ్, కోరకల్ రైడ్ చేయొచ్చు. అంత ఓపికలేనివాళ్లు విశ్రాంతిగా కూర్చుని పక్షుల కిలకిలలు వింటూ సేదతీరొచ్చు. వసతి కోసం టెంటెడ్ కాటేజెస్, లాగ్ హట్స్ ఉన్నాయి.
బిలిగిరి రంగన్ హిల్స్ : ఇది బెంగళూరుకు 180 కి.మీటర్ల దూరంలో ఉంది. కర్నాటక, తమిళనాడు సరిహద్దు లో ఉండే బిలిగిరి రంగన్ ఓ పర్వత సముదాయం. బి.ఆర్.హిల్స్ అని పిలిచే ఈ ప్రదేశం బర్డ్ వాచింగ్‌కు అనుకూలమైనది. అప్పుడప్పుడూ అడవి జంతువులు కూడా కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడున్న బిఆర్‌టి వైల్డ్‌లైఫ్ శాంక్చురీలో రకరకాల జంతువులు చూడొచ్చు. కావేరి, తుంగభద్ర నదుల మధ్య నెలవైన ప్రదేశం కాబట్టి పచ్చదనం, చల్లదనాలకు ఇక్కడ కొదవే ఉండదు. బిఆర్ హిల్స్‌లోని ఎత్తయిన కొండ మీద బిలిగిరి రంగస్వామి దేవాలయం సందర్శించుకోవచ్చు. ఇక్కడున్న రెండువేల ఏళ్లనాటి దొడ్డ సంపిగె మార అనే ఓ పెద్ద చంపక చెట్టు ఉంది. దీని ఎత్తు 34 మీటర్లు, వెడల్పు 20 మీటర్లు. ఇక బిఆర్ హిల్స్‌లో ఫిషింగ్, రివర్ రాఫ్టింగ్, ట్రెక్కింగ్ చేయెచ్చు.
ముత్యాల మడువు : ఇది బెంగళూరుకు 43 కి.మీటర్ల దూరంలో ఉంది. ఒక పూటలో వెళ్లి రాగల హాలిడే స్పాట్ ముత్యాల మడువు. దీన్నే వర్ల్ వ్యాలీ అని కూడా అంటారు. చుట్టూ కొండలు మధ్యలో లోయ.. దాన్లో నెలవై ఉన్న ఈ చిన్న జలపాతం, కొలను చక్కని పిక్నిక్ స్పాట్. వంద అడుగుల ఎత్తు నుంచి జారిపడే జలపాతం, చుట్టుపక్కన పరుచుకున్న పచ్చదనం ఈ ప్రదేశం ప్రత్యేకతలు. ఈ జలపాతం అడుగునున్న కొలను లోతుగా ఉండదు. కాబట్టి నిరభ్యంతరంగా కొలనులో మునకలేయొచ్చు. ఇదే లోయలో ఇంకో రెండు జలపాతాలు కూడా ఉన్నాయి. వాటిని కూడా తప్పక చూసి తీరాల్సిందే! ఇక్కడో చిన్న శివాలయం కూడా ఉంది. అయితే వీటి దగ్గరికి నేరుగా వాహనాల్లో వెళ్లే వీలుండదు. కాబట్టి పార్కింగ్‌లో వెహికల్స్ వదిలి వంద మెట్ల దాకా ఎక్కాల్సి ఉంటుంది. పార్కింగ్ ప్లేస్‌లో రెస్ట్ రూమ్స్, రెస్టారెంట్లు ఉంటాయి.
Authorization