స్విట్జర్లాండ్ దేశంలోని ఓ పెద్ద నగరం జురిక్. ఆల్ప్స్ పర్వతాలతో, ప్రకృతి అందాలతో కనువిందుచేస్తుంది ఈ నగరం. ఇక్కడి అధికారిక భాష జర్మన్, కరెన్సీ స్విస్ ఫ్రాంక్. ఆల్ప్స్ పర్వతాల చుట్టూ నదుల, సరస్సుల నీటిపై కర్రలతో కట్టిన ఇళ్లుంటాయి. ఇవి ఇంచుమించు క్రీస్తుపూర్వం 5000 నుంచి 500 సంవత్సరాల నాటివట. గత చరిత్రకు అద్దం పట్టే ఈ నిర్మాణాల్ని యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది. స్విట్జర్లాండ్ ఆర్థిక రాజధాని ఇదే. ప్రపంచంలోని ప్రధాన బ్యాంకుల, బీమా కంపెనీల ప్రధాన కార్యాలయాలు ఎక్కువగా ఇక్కడే ఉంటాయి. ఇక్కడ సరళమైన ప్రభుత్వ విధానాలు, తక్కువ పన్ను ఉండటమే దీనికి ప్రధాన కారణం.
దేశం మొత్తంలో ఇక్కడి విమానాశ్రయం, రైల్వే స్టేషన్లే ఎక్కువ రద్దీగా ఉంటాయి. ఇక్కడి ప్రజలు ఎంతో సంతోషంగా ఉంటారు. నిరుద్యోగ సమస్య అస్సలుండదిక్కడ. 'బెస్ట్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇన్ ది వరల్డ్' గా దీనికి టైటిల్ కూడా ఉంది. ఇంకా దీన్ని హాపీయెస్ట్ సిటీగానూ పిలుస్తుంటారు. ఏటా ఆగష్టు నెలలో ఈ సిటీలో పెద్ద టెక్నో స్ట్రీట్ పార్టీ జరుగుతుంది. లక్షల మంది వింత వేషాలు వేస్తూ పరేడ్ చేస్తుంటారు. ఈ సిటీలో ఇంచుమించు 12 వందలకు పైగా మంచినీళ్ల ఫౌంటేన్లున్నాయి. గమ్మత్తయిన ఆకారంలో కనువిందు చేస్తుంటాయి. అంతేకాదు ఈ ఫౌంటేన్ల దగ్గర ఫొటోలు దిగడమే కాదు దాహమూ తీర్చుకోవచ్చన్నమాట. ఇక్కడి జంతుప్రదర్శన శాల దాదాపు ఐదు వేల జీవులతో పర్యటకుల్ని ఆకట్టుకుంటుంది. ఈ జూలో పెంగ్విన్ పరేడ్, ఆసియన్ ఎలిఫెంట్ ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణ. ఏటా ఇక్కడికి ఇంచుమించు పన్నెండు లక్షల మంది సందర్శకులు వస్తుంటారు. రోమన్లు ఈ నగరాన్ని ఏర్పాటు చేశారు. టురికమ్ అని పిలిచేవారు. తర్వాతి కాలంలో జురిక్ అనే పేరు స్థిరపడింది. ఈ నగరం పక్కనే జురిక్ నది ఉంటుంది. ఇది ఇప్పటి వరకు రెండు సార్లు పూర్తిగా గడ్డకట్టి పోయిందట. అది 1929, 1962 సంవత్సరాల్లో చలికాలం ఓ కొన్ని వారాల పాటు గడ్డకట్టే ఉంది. అప్పుడు పర్యాటకుల సందడి అంతా ఇంతా కాదు. మామూలుగా ఈ నది అందర్నీ ఆకట్టుకుం టుంది. రాత్రి వేళల్లో మరింత కనువిందు చేస్తుంది.
Authorization