''మీరు అనుకొన్న ప్రకారం రావచ్చు...ఇపుడన్నీ బాగున్నాయి
నీలకురింజి పూలు కూడా పూశాయి.''
అంటూ టూర్ ఆర్గనైజర్- కేరళ నుంచి పిలుపు. సరే ఏడెనిమిది రోజుల టూర్ ని ఐదు రోజులకే కుదించి గాడ్ ఓన్ కంట్రీకి బయలు దేరాం. కేరళ టూర్ కు ఆగస్టు నుంచి అక్టోబర్ వరకు అనువైన కాలం. అప్పుడే స్వదేశ సందర్శకులు ఎక్కువగా వస్తారట. తర్వాత ఫిబ్రవరి వరకు ఫారిన్ టూరిస్టులు, ఎక్కువ గా దుబారు నుంచి ఉంటారట. బోలెడంత ఫారినెక్స్ఛేంజ్ ఆదాయం.
కొచ్చిన్, అలెప్పీ, త్రిసూర్,మున్నార్, వాయినాడ్ ఇవన్నీ సందర్శకులు అధికం గా వచ్చే ప్రాంతాలు. ఈ దఫా మరో ప్రత్యేక ఆకర్షణ పన్నెండేళ్ళ కు పూసే 'నీలకురింజి' పూలు. ముందుగానే సందర్శకులకు.. వీటి గురించి పూర్తి వివరాలు ఇస్తూ.. మున్నార్‌లో తగిన ఏర్పాట్లు చేసి... ఇక హనీమూన్ జంటలకు కూడా ఆహ్వానాలు పలికింది కేరళ టూరిజం. కేరళ టూరిజం ఇండిస్టీ ఆదాయం, రాష్ట్ర స్థూల ఆదాయంలో జీడీపీ దాదాపు పది శాతం పైనే ఉంటుంది. కేరళలో నిరుద్యోగ సమస్య కాస్త ఎక్కువే. అందుకే చాలామంది గల్ఫ్ దేశాలకు పని వెతుక్కుంటూ వెళ్తారు. కేరళ రాష్ట్ర తలసరి ఆదాయం మాత్రం మిగిలిన రాష్టాలతో పోలిస్తే కాస్త ఎక్కువే.
అనుకోకుండా వచ్చిన వరదలు ఈసారి టూరిజాన్ని దెబ్బ తీశాయి. అంతకుముందు, ఈ సంవత్సరం మే నెలలో బయటపడిన 'నిఫా' వైరస్ కు జడిసి జూన్, జూలైలో వచ్చే చాలామంది విదేశీ యాత్రికులు రద్దు చేసుకొన్నారట. దాదాపు లక్షన్నర మంది పైగా చిరుద్యోగుల జీవనోపాధి కి పెద్ద దెబ్బ. ఒక అంచనా ప్రకారం ప్రతి ఒక్క టూరిస్ట్ వల్ల 14, 15 మందికి ఉపాధి లభిస్తుంది.
కొచ్చిన్- బాక్ వాటర్స్: ఎయిర్ పోర్ట్ నుండి డైరెక్ట్ గా బాక్ వాటర్స్ హౌసింగ్ బోట్ కి వెళ్లాం. మేం వెళ్లే సమయానికి అక్కడ ఎక్కువమంది టూరిస్టులు లేరు. సంసోనెట్ వాళ్ల యాడ్‌లో చూపించినట్లు అంతా ఎదురు చూస్తున్నట్లు ఉంది. ఓ మూడు గంటలు అందులో టూర్. సాయంత్రం వేడి వేడి పకోడిలు, టీ, కాఫీలు ఇచ్చారు. సన్ సెట్ ఆశ పడినంత లేదు... మబ్బుల కారణంగా. కొచ్చిన్‌లో మేం దిగిన హోటల్ బర్టన్ బోటుయార్డు వాళ్ళు మర్నాడు సాయంత్రం ఏర్పాటు చేసిన బోట్ షికారులో సూర్యాస్తమయం చక్కగా ఎంజారు చేశాం. ఆ రోజు పగలంతా కొచ్చిన్ లోకల్ టూర్. జ్యూ టౌన్ మార్కెట్ అంతా కలియది రిగాం. ఈ మార్కెట్ పురాతన వస్తువులకు ప్రఖ్యాతి. అక్కడే యూదుల భవంతి కూడా ఉంది. మధ్యాహ్నం పన్నెండు దాటితే మూసేస్తారు. అది చూశాక నడుచుకుంటూ అన్ని దుకాణాలను చూశాం. ఎన్ని రకాల పురాతన వస్తువులు ఉన్నాయో. కొన్ని నచ్చినవి కొన్నాం. అక్కడ ఓ షాప్‌లో అమ్మాయి చెప్పింది. డిసెంబరులో బైనీయల్ ఉత్సవాలు జరుగుతాయని, ఆ వీధులు అన్నీ ఎక్కడెక్కడనుంచో వచ్చి కళాకారులు వేసే రంగు రంగుల పెయింటింగ్స్ తో నిండిపోయి, పండగలా ఉంటుందని. తర్వాత పదిహేనవ శతాబ్దం నాటి పురాతన చర్చి, సెయింట్ ఫ్రాన్సిస్ చర్చికు వెళ్లాం. వాస్కొడిగామా శరీరాన్ని మరణానంతరం అక్కడే ఖననం చేశారు కాని కొన్నాళ్ళకు అక్కడనుండి స్వదేశానికి తరలించారట. ఆ పక్కనే నేనొక పుస్తకాల షాపులో సంగం సాహిత్యం గురించి ఇంగ్లీషు ట్రాన్స్‌లేషన్స్ అడిగితే, అనుకొన్నవి దొరక లేదు కాని, ప్రేమ కవితల శిలప్పదికారం కొన్నా.
కొచ్చిన్ ఓల్డ్ టౌన్ వైపు.. నచ్చిన అంశం ఏమిటంటే, అక్కడి ఇళ్లన్నీ బాగున్నాయి. బహుళ అంతస్తులు చాలా తక్కువ. ఆకాశం, నేల ఏ అడ్డూ లేకుండా చూడొచ్చు. మూడవరోజున కొచ్చిన్ నుంచి ప్రయాణమై సాయంత్రానికి మున్నార్ చేరాం. అప్పటికే వాన, ముసురు. మా గైడ్ డైరెక్షన్ లో అక్కడ కథాకళి ప్రదర్శన, మార్షల్ ఆర్ట్స్ ప్రదర్శన చూశాం. బయటకు వచ్చాక చూస్తే వర్షం పడుతూనే ఉంది. చీకటి, వాన అలవాటు, సామర్థ్యం రెండూ ఉన్న మా డ్రైవర్ మమ్మల్ని క్షేమంగా మే ముందుగా బుక్ చేసుకొన్న టాల్ ట్రీ రిసార్టు దగ్గర దిగబెట్టాడు.
ఇక్కడ టూరిజం వాళ్ల ఏర్పాటు గా వచ్చిన డ్రైవర్ గురించి కొంత చెప్పాలి. అతడు దాదాపు ముఫ్పై ఏళ్లవాడు. అతనికి తను వెళ్లవలసిన ప్రాంతాలన్నీ క్షుణ్ణంగా తెలుసు. చక్కటి ఇంగ్లీష్‌లో మాట్లాడాడు. వాతావరణం అనుసరించి అప్పటికప్పుడు మేం చూడవలసిన వాటిని సలహాలు ఇచ్చేవాడు. ఇక తిరుగు ప్రయాణంలో బంద్ గురించి హెచ్చరించి తినడానికి కావలసినవి హోటల్ నుంచే తెచ్చుకోమని సలహా కూడా ఇచ్చాడు. మధ్యలో మంచినీళ్ళు కూడా దొరికే అవకాశం లేదు మరి. అతని పేరు 'నవ్ ఫల్' తనకిద్దరు పిల్లలు పాప పేరు అఫ్రీన్.. కొడుకు పేరు నౌఫేజ్.. అంత చక్కటి పేర్లు మరోసారి చెప్పించుకొని ఆనందించాం.
మర్నాడు నీలకురింజి పూలు చూడడానికి బ్రేక్ ఫాస్ట్ అయ్యాక వెళ్లాం. ఎర్నాకులం నేషనల్ పార్క్ ఇంతకు ముందే ఈ విషయం రాశాను.. అక్కడకు మన వెహికిల్ వెళ్లదు. టికెట్ కొనుక్కొని, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ బస్‌లో వెళ్లాక... కొంత దూరం. రమారమి ఓ రెండు కిలోమీటర్ల ట్రెకింగ్ ఉంది. పైకెళ్తున్నకొద్దీ పూలు కని పిస్తాయి. వెదురు ఫెన్సింగ్ రక్షణ.. పైగా పూలు కోయడం అఫెన్స్ అనీ, కోస్తే ఫైన్ అని కూడా చెప్పారు. మేమొక అడవి గొర్రె ను కూడా స్పాట్ చేశాం. ఇవన్నీ విపత్తులో ఉన్న జాతులు. అందుకే ఈ జాగ్రత్తలు.
ఈ నీలకురింజి పూపొదలు వెస్ట్రన్ ఘాట్స్ అంతటా ఉంటాయి. ఈ సారి కొడైకెనాల్ లో కూడా పూశాయని భోగట్టా. ఈసారి తప్పితే మళ్ళీ పన్నెండేళ్లకే! అంటే 2030 లోనే. అంతేనా, మున్నార్ లో టీ ప్లాంటేషన్స్ ఎప్పటికీ ఆకర్షణే. పచ్చని ఆ ప్లాంటేషన్స్ పైన ఆగి నిలిచిన మబ్బు తునకలు.వాళ్ల స్నేహం ఒకనాటిదా...! మున్నార్ లో చెప్పుకోదగ్గది టాటా వారి టీ ఎస్టేట్స్.. కంపెనీ. అక్కడ టీ పాకెట్స్ కొనుక్కోవచ్చు. అలాగే బయట స్పైసెస్ అంటే మిరియాలు, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క ఇలాంటివన్నీ మంచి క్వాలిటీ దొరుకుతాయి. రకరకాల పూల నర్సరీలు. సుగంధ ద్రవ్యాలు.. ఎక్కువగా యాలకులు చెట్లు, మన మెట్టతామర చెట్లలాగ మడులుకట్టి పెంచుతున్నారు. అలాగే మిరియాల క్రీపర్స్. ఇన్ని ఉన్నా, పక్షులు ఎంచేతో తక్కువే కనిపించాయి. ఈ లోయలు నిశ్శబ్ద లోయలు... పచ్చదనం నిశ్శబ్దం మనలోకి ఇంకి పోతున్న భావన తోవంతా.
అత్తిరిపల్లి వాటర్ ఫాల్స్ కు వెళ్లాం. కాకపోతే శబరిమల గొడవల కారణంగా ఆరోజు అంటే,అక్టోబర్ పద్దెనిమిదిన కేరళ అంతా బంద్. తోవంతా ఆపుతూనే ఉన్నారు.. ఓ పది నిముషాల సేపు ఆపి వదులు తారు. ఇక వాటర్ ఫాల్స్ దగ్గర నడవడం కష్టం కాని... వెళ్లాక ఎంతో బాగుంది. మరో విశేషం ఇక్కడ బాహబలి షూటింగ్ జరిగింది. తిరిగి వస్తూ, కాలడి వెళ్లాం. కాలడి కొచ్చిన్ విమానాశ్రయానికి వెళ్లే దారిలో ఉంది. శంకర భగవత్పాదులు పుట్టిన ప్రదేశం. లోపల శారదాంబ ఆలయం. ఆదిశంకరుల తల్లి అయిన ఆర్యాంబ సమాధి ఉన్నాయి. వెనుక పూర్ణా నది ( పెరియార్) ప్రవహిస్తూ ఉంటుంది. ఆది శంకరులు తమ తల్లి గారి కోసం నదీ ప్రవాహాన్ని మళ్లించినట్లు చెబుతారు. మాకు అక్కడ ఎక్కువ సమయం దొరకలేదు. ఫ్లైట్ కి టైమ్ అవుతోంది. త్వరత్వరగా ఆలయం లో అమ్మవారి ని దర్శించుకొని, శంకరులకు నమస్కరించి ఎయిర్ పోర్ట్ కు వస్తుంటే ఫ్లైట్ ఓ గంట ఆలస్యం అని సమాచారం. అదే గదా డివైన్ అరేంజ్మెంట్ అంటే!
- సునీత పోతురి
Authorization