చుట్టూ పచ్చని పర్వతాలు... మధ్యలో ఓ వెచ్చని సరస్సు... చూడటానికి ఎప్పుడూ పొగలు కక్కుతూ ఉంటుంది... దాని పేరే ఫ్రయింగ్ పాన్. ఇది న్యూజిలాండ్‌లోని వైమాంగూలో ఉంది. అగ్ని పర్వతం పేలుడు వల్ల ఏర్పడ్డ రిఫ్ట్ లోయలో ఉన్న వెచ్చని సరస్సు. 1886లో మౌంట్ తారావెరా అగ్ని పర్వతం బద్ధలు కావడం వల్ల ఏర్పడింది. 200 మీటర్ల విస్తీర్ణంలో ఉండే ఈ సరస్సు దాదాపుగా ఆరు మీటర్ల లోతు ఉంటుంది. ప్రపంచంలో ఉన్న అతి పెద్ద వేడి నీటి సరస్సుల్లో ఇదొకటి. అలాగని చక్కగా ఆ నీళ్లలోకి దిగి మనం వెచ్చగా స్నానం చేయవచ్చనుకోకండి. ఎందుకంటే సంవత్సరం పొడవునా దీనిలో నీరు 50 నుంచి 60 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలో ఉంటుంది. ఒకోసారి ఏకంగా 74 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతకు కూడా చేరుకుంటుంది. అగ్ని పర్వతం పేలినప్పుడు ఆ ప్రాంతంలో 17 కిలోమీటర్ల మేర అక్కడక్కడా చిన్న చిన్న బిలాలు ఏర్పడ్డాయి. వేడిగా ఉన్న ఆ బిలాల్లోకి వర్షపు నీరు చేరింది. అక్కడ భూగర్భ జలం కూడా వేడిగా ఉన్నందువల్ల వేడినీటి బుగ్గలు పుట్టుకొచ్చాయి. కార్బన్‌డైఆక్సైడ్, హైడ్రోజన్ సల్ఫైడ్ వాయువులు అక్కడ ఏర్పడిన రంధ్రాల నుంచి పైకి ఎగజిమ్ముతూ ఉంటాయి. అందువల్ల దీనిలో నీరు ఎప్పుడూ వేడిగానే ఉంటుంది.
Authorization