శ్రీలంక సముద్రం మధ్యలో ఉండే చిన్న ద్వీపం కాబట్టి, లంక అంతటా విస్తారంగా వర్షాలు కురుస్తుంటాయి. కాబట్టి, ఇక్కడ ఎటు చూసినా ప్రకృతి పచ్చదనంతో మనకు దర్శనమిస్తుంది. మేం మొదటిసారి చెన్నై నుండి కొలంబోకు విమానంలో వెళితే, రెండోసారి
హైదరాబాద్ నుండి కొలంబోకు వెళ్ళాం. రెండు సార్లు మిత్రులతోపాటే వెళ్ళాం. కొలంబోలో విమానం దిగిన వెంటనే దగ్గర్లో ఉన్న ఒక హోటల్లో దిగి అక్కడ ఒక వ్యాన్ మాట్లాడుకొని ముందే ప్లాన్ చేసుకున్న ప్రదేశాల్లో పర్యటించాం.
శ్రీలంక అనగానే మనకు చిన్నప్పటి నుంచి ఉన్న ఒక బండ గుర్తు. మన దేశ మ్యాప్‌నకు కింద చిన్నగా ఉన్న ఒక దీవి అని. వాస్తవానికి ఇది మన రాయలసీమ కంటే కూడా తక్కువ విస్తీర్ణంలో ఉంది. ఉత్తరం నుంచి దక్షిణం దాకా 425 కిలో మీటర్లు కాగా తూర్పు నుండి పడమరదాకా దాదాపు 220 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది. ఆ దేశ జనాభా దాదాపు రెండుకోట్ల పదిలక్షల మంది మాత్రమే. ఆ దేశ నిబంధనలో మనల్ని ఆశ్చర్యానికి గురిచేసేది ఏంటో తెలుసా..? వారు పెట్టుకున్న నిబంధనల ప్రకారం ఏ వాహనమైనా 40 కిలోమీటర్లకు మించి వేగంగా ప్రయాణిం చేందుకు వీల్లేదట. రోడ్లు ఖాళీగా ఉన్నాసరే. డ్రైవర్లందరూ ఈ నిబంధనను తప్పకుండా పాటిస్తారు. ఎంతో అవసరమైతే తప్ప ఏ డ్రైవరూ హారన్ కొట్టడు. మా యాత్ర పొడవునా దీన్ని గమనించాం.
కొలంబో చేరగానే మధ్యాహ్నం 12 అయ్యింది. అక్కడ భోంచేసి మధ్యాహ్నం లోకల్ బస్ ఎక్కి సిటీ అంతా తిరిగాం. ఒక షాపింగ్ సెంటర్లో మా స్నేహితులు షాపింగ్ చేశారు. అక్కడ రెడిమేడ్ దుస్తులు చాలా చౌకగా వున్నాయి. అన్నీ కొని రూమ్‌కు వచ్చి పడుకున్నాం. ఆ రోజంతా సిటీ టూర్‌కే పరిమితమయ్యాం. రెండో రోజు మా ప్రయాణమంతా బౌద్ధ క్షేత్రాలు, ఆహ్లాదకరమైన ప్రకృతిని చూడటానికి కేటాయించాం. కొలంబోకు కొంత దూరంలో ఉన్న 'హబరానా' అనే అటవీ ప్రదేశానికి వెళ్ళాం. ప్రకృతిని ఆస్వాదించాల నుకునేవారు తప్పకుండా వెళ్లాల్సిన చూడచక్కని ప్రాంతం. అనురాధపుర నుంచి కొలొంబో వచ్చేదారిలో సిగిరియా అనే ప్రదేశం ఉన్నది. ఈ ప్రదేశాన్ని చక్కని పర్యాటక ప్రదేశంగా మలిచారు. ఊరు అంతా అరణ్యంలానే ఉన్న రోడ్డు సౌకర్యం బాగానే ఉంది. ఐదో శతాబ్దంలో ఈ ప్రాంతాన్ని పాలించే కశ్యప అనే రాజు సిగిరియా కొండపై రాజ ప్రసాదం, కోటలు కట్టించాడట. 14 వ శతాబ్దంలో ఈ నిర్మాణాన్ని బౌద్ధ ఆరామాలుగా మార్చారు. శ్రీలంకలో బుద్ధ వైభవం బాగా కనబడుతుంది. ఎక్కడ చూసిన ప్రాచీన బౌద్ధ శిల్పాలు, నిర్మాణాల వైనం కళ్ళకి కట్టినట్లు కనిపిస్తాయి.
సిగిరియా అందాలు...
ఇంత చిన్న భూభాగంలో పాతిక వేలపై చిలుకు అవశేషాలు తవ్వినప్పుడల్లా బయటపడ్డాయట. ఇంకా తవ్వుతుంటే అవి బయటపడుతూనే ఉన్నాయి. ఈ చుట్టుపక్కల ఉన్న జనాలకు కూడా ఎంతో కొంత చరిత్ర తెలుసు. కోటకు వెళ్లే దారివెంట నీటి కొలనులు, ఉద్యానవనాలు కనిపిస్తాయి. పైగా కొలనుల్లో ఫౌంటెయిన్లు ఉండటం, అవి నేటికీ పని చేస్తుండటం విశేషం. ఈ కోట అందాన్ని చూసేందుకు రెండుకళ్లు చాలవనిపిస్తుంది. దాదాపు 1350 మెట్లు ఎక్కితే పైకి చేరుకుంటాం. మూడున్నర ఎకరాలకు పైనే ఆ రాజప్రసాదం విస్తరించి ఉండగా శిథిలమైనవి పోగా రాజు, రాణి భవనాలు, సభా మందిరాల మొండి గోడలు, స్మిమ్మింగ్ ఫూల్, రాతి సింహాసనం లాంటివి మిగిలి ఉన్నాయి. రాజభ వనం నుండి చూస్తే కొన్ని కిలోమీటర్ల దూరం వరకూ ఏం జరుగుతుందో నిశితంగా పరిశీలించ వచ్చు. రాయిమీద ఆనాటి పెయింటింగ్స్ ఇప్పటికీ ఉండటం ఆశ్చర్యం కలిగించక మానదు. పశ్చిక బయళ్లు, భారీ వృక్షాలతో కొండ పైభాగం ఆహ్లాద కరంగా ఉంటుంది. ఎన్నో వైవిధ్యాలకు నెలవైన సిగిరియా యునెస్కో వారసత్వ సంపదగా గుర్తింపు పొందింది.
ఆడమ్స్ పీక్...
తర్వాత రోజు మేం శ్రీపాదకు బయలుదేరాం. దీన్నే ఆడమ్స్ పీక్ అని కూడా అంటారు. ఇక్కడ బుద్ధుని పాద ముద్రలు కనిపిస్తాయి. వాటి ఎత్తు ఏడు వేల అడుగులు. బుద్ధుడు మూడో సారి శ్రీలంక వచ్చినప్పుడు ఈ కొండ మీద పాదం మోపాడని ఆ పాదముద్రలే పడ్డవని బౌద్ధ మతస్తుల నమ్మకం. క్రైస్తవం వచ్చిన తరువాత దాని పేరు ఆడమ్స్ పీక్ అయ్యింది. ఆ పాదం బైబిల్ ప్రకారం మొదటి మానవుడు ఆడమ్ ఈ ప్రాంతానికి వచ్చి ఇక్కడ తిరిగాడని వాళ్ళ నమ్మకం. ఈ కొండను ఎక్కడానికి డల్హౌసీ అనే ఊరు నించి మెట్ల దారి మొదలవుతుంది. ఈ మెట్లు ఆరు వేల పైనే ఉంటాయి. ఈ దారిపొడవునా దారికి రెండు వైపులా కిరాణా షాపులు ఉంటాయి. తినడానికి, సాఫ్ట్ డ్రింక్స్, స్వెట్టర్లు, టోపీలు, మఫ్లర్లు, గొడుగులు, బొమ్మలు ఉంటాయి.
మిన్నేలియా నేషనల్ పార్క్...
జంతు ప్రేమికులకు లంక పర్యటన మధురానుభూతిని అందిస్తుంది. దట్టమైన అడవులు, నదీనదాలు ఈ ద్వీపాన్ని పర్యావరణ కేంద్రంగా నిలబెట్టాయి. దంబుల్లాకు 30 కిలోమీటర్ల దూరంలో మిన్నేరియా నేషనల్ పార్క్‌లో ఏనుగులు మందలు మందలుగా సంచరి స్తుంటాయి గుంపులు గుంపులుగా ఉన్న ఏనుగుల సమూహాన్ని చూసి మేం పరవశించిపోయాం. మన దేశంలో అయితే ఎక్కడో ఒకటి అర ఏనుగులు కనిపిస్తాయి కానీ ఇన్నీ ఏనుగులను ఒక్కసారి చూడటం గొప్ప అనుభూతి. ఏనుగులకు వాటి కాపలాదారులు స్నానాలు చేయిస్తుంటే, చిన్న చిన్న ఏనుగులు ఆ నీటిలో జలకాలాడుతుంటే వాటిని చూసి మురిసిపోయాం. ఈ పార్క్ జీవ వైవిధ్యానికి పట్టుగొమ్మ. ఏనుగులు, ఎలుగుబట్లు, చిరుతలు, జడల బర్రెలు ఇక్కడ ఎక్కువగా కనిపిస్తాయి. వాటిని చూసి చాలా ఎంజారు చేశాం.
రావణ ఎల్లా ...
ఎల్లా అంటే సింహళ భాషలో వాటర్ ఫాల్స్ అని అర్థం. ఈ పేరు రావటానికి ముఖ్య కారణం ఈ వాటర్ ఫాల్స్ పైనున్న కొండమీదున్న గుహ. దాని పేరు రావణ ఎల్లా గుహ. రావణుడు సీతని ఎత్తుకొచ్చిన తరువాత అశోక వనంలో ఉంచే ముందు మూడు ప్రదేశాలు మార్చాడట. వాటిలో ఒకటి ఈ గుహ. గుహ చూడాలంటే చాలా మెట్లు ఎక్కాలి. నాలుగైదు మెట్లు చూసినా అమ్మో ఇన్ని మెట్లే అని గుండె దడ దడా కొట్టుకోవటం మొదలు పెట్టింది. అసలే సీతను పెట్టిన గుహ. ఈ గుహ కోసం మళ్ళీ శ్రీలంక రాలేం. ఎలా అయినా చూడాలి అనే సంకల్పంతో ఆ మెట్లన్నీ ఎక్కి గుహలోకి వెళ్ళి చూశాం.
కొలంబోలో క్రికెట్ మ్యాచ్...
మేం వెళ్ళినప్పుడు కొలంబోలో ఇండియా - పాకిస్థాన్ మధ్య క్రికెట్ మ్యాచ్ జరుగుతుంది. అసలు ఈ మ్యాచ్ చూడటానికే మా ఫ్రెండ్ కిరణ్మయి ఈ టూర్‌కి రమ్మని పిలిచింది. మన దేశం ఇతర దేశాలతో క్రికెట్ మ్యాచ్ ఆడినప్పుడు ఒడిపోతుంది కానీ ఎందుకో పాకిస్థాన్‌తో ఆడినప్పుడు మాత్రం తప్పకుండా గెలుస్తుంది. ఇక్కడ కూడా అదే జరిగింది. ఆ మ్యాచ్ గెలిచాక మా ఆనందానికి అవధులు లేవనే చెప్పవచ్చు. పొరుగు దేశంలో మన దేశానికి చెందిన జెండాలను పట్టుకొని ఎగురుతూ, సెలబ్రేట్ చేసుకోవడం కొంత వింతే కదా.. అయితే ఈ మ్యాచ్ ముగిసిన తర్వాత మాకు అనుకోని అవకాశం వచ్చింది. మేం బస చేసిన హోటల్లోనే క్రికెటర్లు కూడా స్టే చేస్తుండటంతో వాళ్ళను దగ్గరి నుండి చూసే అవకాశం వచ్చింది. కానీ అప్పటికి నాకున్న అమాయకత్వం వల్ల వాళ్లదగ్గర ఫొటోలు దిగడం మర్చిపోయాను.
సునామీ మ్యూజీయంలో షాపింగ్...
సునామీ సముద్ర తీరంలోని చాలా దేశాలను చిన్నాభిన్నం చేసినట్లు మనం చూశాం. ఆ ధాటికి శ్రీలంక కూడా చాలా దెబ్బతింది. సునామీకి విపరీతంగా నష్టపోయిన గాల్ (గాలె) ప్రాంతం కూడా చూడదగ్గదే. చాలా వ్యాపార సంస్థలు, భవనాలు సునామీ కి దెబ్బతిన్నాయి. అలా దెబ్బతిన్నవాటినే ఒక మ్యూజియంగా ఏర్పాటు చేసి కారుచౌకగా అమ్ముతున్నారు. అక్కడికి వెళ్ళిన మేం చాలా బ్రాండెడ్ బట్టలను అతి తక్కువ ధరకే కొనుకొన్నాం. మా ఫ్రెండ్స్ అయితే శ్రీలంకకు వెళ్లేటప్పుడు ఏడు కిలోల బ్యాగ్‌తో వెళ్ళి 25 కిలోల లగేజీతో వచ్చారంటే అర్థం చేసుకోండి ఏ రేంజ్లో షాపింగ్ చేశారో. యుద్ధ గాయాలు, వాటి చేదు జ్ఞాపకాలే కాదు. శ్రీలంకలోని పక్షుల కిలకిలా రావాలు, ఎటువైపు చూసినా కనువిందు చేసే పచ్చదనం. పూల సుగంధ పరిమళాలు కలగలిపిన స్వచ్ఛమైన గాలి, సముద్ర తీరం హొయలు. వీటన్నింటినీ కలగలిపి చెప్పాలంటే కాస్త కష్టం. దాన్ని ఆస్వాదించాలంటే, అనుభూతి చెందాలంటే మాత్రం పర్యటనే చక్కటి మార్గం.
Authorization