విహారయాత్రకు వెళ్తుంటే లగేజీ సర్దుకునే విషయంలో కొన్ని మెలకువలు పాటిస్తే మంచిది. దానివల్ల తెలియని ప్రాంతానికి వెళ్లినా కూడా ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు.
కుటుంబ సభ్యులందరూ కలిసి వెళ్తుంటే అందరి దుస్తులూ ఒకే బ్యాగులో కాకుండా రెండు మూడు చిన్న బ్యాగుల్లో సర్దాలి. దీనివల్ల మోయడం తేలికవుతుంది. అలాగే సర్దేటప్పుడే మీరొక్కరే కాకుండా ఎక్కడెక్కడ ఏ వస్తువులున్నాయో అందరికీ చెబితే ఎలాంటి గందరగోళం ఉండదు.
- డబ్బు విషయంలోనూ జాగ్రత్త అవసరమే. డబ్బంతా ఒకే దగ్గర సర్దకుండా రెండు మూడు చోట్ల పెట్టి ఉంచండి. ఒక బ్యాగు పోయినా ఇంకో దగ్గరున్న డబ్బు మనల్ని కాపాడుతుంది. అలాగే వేరే ప్రాంతాలకు వెళ్తున్నప్పుడు పూర్తిగా క్రెడిట్, డెబిట్ కార్డుల మీద ఆధారపడకపోవడమే మేలు. అదనంగా కొంచెం నగదు కూడా పెట్టుకోవడం మంచిది.
- ఎండాకాలంలో చెమట గురించి చెప్పక్కర్లేదు. అందుకే టిష్యూలూ, ఫేస్‌వాష్ తప్పకుండా వెంట ఉంచుకోవాలి. ఎక్కడైనా సులువుగా ముఖం, చేతులూ కడుక్కునే అవకాశం ఉంటుంది. అలాగే అక్కడున్న వాతావరణం వల్ల చిన్న చిన్న అనారోగ్య సమస్యలు రావొచ్చు. అందుకే తలనొప్పీ, జలుబూ, జ్వరం... లాంటి వాటికి సంబంధించిన మాత్రలు దగ్గరుంచుకోవాలి. సమస్య ఎదురైనప్పుడు కంగారు లేకుండా ఉంటుంది.
- అన్ని ప్రాంతాల్లో భోజనం దొరుకుతుందన్న నమ్మకం లేదు. కొన్నిసార్లు దొరికినా కూడా అక్కడి ఆహారం మనం తినలేకపోవచ్చు. అందుకే ఇంటినుంచే ఏవైనా చిరుతిళ్లు తీసుకెళ్తే అవసరానికి ఉపయోగపడతాయి. మనకూ నిశ్చింతగా ఏ కంగారూ లేకుండా ఉంటుంది.
ఎంత తక్కువ లగేజీ ఉంటే అంత హాయిగా ప్రయాణం చేయొచ్చు. వీలైనంత వరకు అనవసరమైన వస్తువులు ఎట్టి పరిస్థితుల్లో వెంట తీసుకెళ్లకూడదు. దుస్తులూ, ఆభరణాలూ, మేకప్ వస్తువులు... ఇలా ఏవైనా సరే లెక్కలేసుకునే సర్దుకోండి.
Authorization