'ప్రయాణాలంటే వింతలూ విశేషాలే కాదు. ప్రకృతి పరవశం మాత్రమే కాదు. మనుషులు, మనుషులు, మనలాంటి మనుషులు' అన్న ఎరుక. నిజానికి యాత్రికులు రచయితలైతే తమ కలలు, ఆశలు, అనుభవాలు, అనుభూతులతో అక్షరయాత్ర చేస్తారు. వాటిని చదువరులతో పంచుకుంటారు. ఆ రీతిన సాగిన యాత్రా కథనాల సమాహారం.
భ్రమణ కాంక్ష
''లోకసంచారి ఒంటరిగా తిరుగుతాడు, ప్రపంచాన్ని ప్రేమిస్తాడు. తనకి పరిచయం అయిన ప్రతివారి మీదా అనంతమైన స్నేహభావాన్ని కురిపిస్తుంటాడు. లోక సంచారి హృదయంలోని ఈ స్నేహభావమే అతనికి నిత్యం మధురస్మతుల్ని కలిగిస్తుంటుంది.'' అని చెప్పిన రాహుల్జీని మనస్సుగురువుగా ఆరాధించి చేసిన తపస్సే ఆదినారాయణ కొనసాగించిన పాదయాత్రల ప్రభంజనం. ఒక సంవత్సరంలో చేసిన మూడు యాత్రల్లోని 4000 కిలోమీటర్ల కాలినడక అనుభవాల పూలమొగ్గలు ఈ భ్రమణ కాంక్షలో పుష్పించాయి. ఈ పుస్తకాన్ని ఎన్నిసార్లు చదివినా మళ్ళీ చదవబుద్ధేస్తుంది. అనుభూతీ చెక్కుచెదరదు. మళ్ళీ మళ్ళీ వెంటాడుతూనే వుంటుంది. మనసులో మెదులుతూనే వుంటుంది.
అడవి నుండి అడవికి
అడవులు, అడవుల్లో మనుషులు, పల్లెలు, పంటలు, కాలువలు, నదులు, చెరువులు, కొండలు, గుళ్ళూ చూస్తూ వస్తున్నామన్నాను. గుండెలపైన చేతులేసుకుంది. ఆమె కళ్ళు మెరిశాయి. ఇన్ని చూసొచ్చిన మిమ్మల్ని చూస్తుంటే ప్రకృతిని చూసినట్టుంది. నా అదృష్టం మీరు నా ఇంటికొచ్చారు అంటున్నప్పుడు ఆమె కళ్ళు వెలుగుల్ని నింపుకున్నాయి. బెంచీమీది నుండి లేచి సైకిళ్ళు వైపు నడవబోతున్న మమ్మల్ని ఆమె మళ్ళీ ఆపింది. మీ ఇద్దరినీ ఒక్కసారి తాకాలని ఉందన్నది. నా చేతుల్ని తన చేతుల్లోకి తీసుకుంది. ఇద్దరు యాత్రా ప్రేమికులు సహచరులైన అపూర్వ జీవనశైలి నేపథ్యంగా జయతి లోహితాక్షన్ తెలుగు సాహిత్యానికి అందించిన అపురూపమైన కానుక ఈ యాత్రానుభవాల సంపుటి.
కొన్ని కలలు ఒక స్వప్నం
మనుషులకు ఆశలుంటాయి... కోరికలుంటాయి... వాటిని నెరవేర్చుకోడానికి ప్రయత్నించిన వాళ్లందరూ విజయం సాధించలేరు. అవి నెరవేరకపోవడానికి పెద్దగా కారణాలేమీ ఉండకపోవచ్చు... ఒకటో రెండో కారణాలున్నా ఒక్కోసారి అవి సహేతుకంగా అనిపించకపోవచ్చు. బాధ్యతల బరువు ముందుకు సాగనివ్వకపోవచ్చు. చివరికి కొన్ని కలలు తీరకుండానే, జీవితం గడిచిపోతుంది. కొందరు మాత్రం బాధ్యతల బరువులు మోస్తూనే, తమ ఆశల మొలకలు వాడిపోకుండా జాగ్రత్త పడతారు. బరువులు మోస్తూనే తమ కలల్ని నెర వేర్చుకునే మార్గాలు వెతుక్కుంటారు. ఆ మార్గంలో నడిచి తమ కలలను నిజం చేసుకుంటారు. ఓ స్వప్నం సాకారమైతే కలిగే అనుభూతి వర్ణనాతీతం. ఆ వ్యక్తి యాత్రికుడైతే... అతను కనే కల ఎప్పటినుంచో చేయాలనుకుంటున్న ఓ యాత్ర అయితే... ఆ కల సాకారమైతే ఇక చెప్పేదేముంది? యాత్రికుడు భావుకుడవుతాడు, తన్మయుడవుతాడు. తన ఆనందాన్ని జ్ఞాపకాలలో దాచుకుంటాడు. నలభై ఏళ్లుగా వెంటాడిన ఓ కలని నెరవేర్చుకుని... సాకారమైన స్వప్నాన్ని అక్షరబద్దం చేసి పాఠకులకు అందించారు దాసరి అమరేంద్ర.! స్కూటర్‌పై దక్షిణ భారతదేశ యాత్ర చేయాలన్న చిరకాలపు కోరికను 2015 జనవరిలో తీర్చుకున్న విధానాన్ని ''కొన్ని కలలు ఒక స్వప్నం' అనే యాత్రా రచనలో వివరించారు.
నేను తిరిగిన దారులు
తెలుగులో యాత్రాచరిత్రలు కొత్తకాదు. ఏనుగుల వీరాస్వామయ్య కాశీయాత్రా చరిత్ర నుండి ఆదినారాయణ భ్రమణకాంక్ష దాకా రాహుల్ సాంకృత్యాయన్ లోకసంచారి నుంచి బి.వి.రమణ ట్రెక్కింగ్ అనుభవాలదాకా తెలుగు సాహిత్య ప్రపంచాన్ని సుసంపన్నం చేసిన యాత్రాచరిత్రలెన్నో ఉన్నాయి. ఆ కోవలోనే వాడ్రేవు చినవీరభద్రుడు రాస్తూ వచ్చిన యాత్రారచనల సంకలనం ఇది. ఇందులో 1997లో ఇంగ్లాండ్ సందర్శించినపుడు రాసిన యాత్రానుభవాలతో పాటు ఇండియాటుడే తెలుగుపత్రిక కోసం అరకులోయ, నల్లమల దారులు, పాపికొండల నడుమ సంచరించిన యాత్రాకథనాలు కూడా ఉన్నాయి. ఆధ్యాత్మిక స్థలాలైన అరుణాచలం, బృందావనం, త్రయంబకంలతో పాటు, జైన, బౌద్ధ క్షేత్రాలయిన శ్రావణ బెళగొళ, సాంచిల సందర్శనానుభవాలూ, ఆదిమానవుడి గుహచిత్రాలతో పాటు అద్భుతమైన శిల్పరామణీయకత వెల్లివిరిసే హళెబీడు, బేలూరుల దాకా ఎన్నో చారిత్రకస్థలాల పర్యటన వివరాలు ఇందులో ఉన్నాయి. ఢిల్లీ నుంచి రాసిన ఉత్తరాలు ఈ సంపుటికొక ప్రత్యేక ఆకర్షణ.
ప్రయాణానికే జీవితం
భారతదేశంలోని విభిన్న సంస్కృతులను వాటిలో నిక్షిప్తమై ఉన్న విశ్వాసాలూ, ఆచారవ్యవహారాలతో సహా తెలుసుకోడానికి మన దేశం ఈ చివర నుండి ఆ చివర వరకు మోటార్ సైకిల్‌పై ప్రయాణించడం అనేది ఆత్మీయమైన పద్ధతి. దుమ్మూ ధూళీ, ఎండా వేడీ ఉండే దేశంలోని మైదానాల గుండా ఈ పుస్తకం మిమ్మల్ని నడిపిస్తుంది. మిమ్మల్ని ప్రపంచంలోనే ఎత్తయిన మోటరబుల్ రోడ్ లడఖ్‌లోని ''ఖర్దుంగ్లా'' కి తీసుకువెళ్తుంది. దారిలో మీకు ఓ సూఫీ సాధువు కనిపిస్తాడు, నకిలీ బాబాలు, ఇంటి బెంగతో ఉన్న సైనికులు కనబడతారు. ''నడిరోడ్దు నది'' లాంటి దారిలో మీరు ఇరుక్కుపోతారు, కానీ అద్భుతమైన రీతిలో రక్షించబడతారు. కాశ్మీర్లో సగటు మనిషి రోజూ అనుభవించే మానసిక ఒత్తిడిని మీరూ అనుభవిస్తారు. ఆచారాలను, తర్క రహితమైన విశ్వాసాలను ఆలోచించకుండా పాటిస్తే - మతం ఎంత గుడ్డిగా, ఎంత ప్రమాదకరంగా మారుతుందో గ్రహిస్తారు. భారతదేశపు రహదారులపై అందరూ ఎంత స్నేహంగా ఉంటారో, ఎంత చక్కని ఆతిథ్యమిస్తారో మీకు తెలుస్తుంది. ఈ పుస్తకం మీకు ఉల్లాసాన్నీ, ఉత్సాహాన్ని కలిగిస్తుంది. ప్రయాసతో కూడిన బైక్ ప్రయాణం కాస్తోకూస్తో అలసటని కూడా కలిగిస్తుంది. ఓ అద్భుతమైన నిజ జీవిత సాహస యాత్ర గురించి హాస్య చతురతతోను, నిశితాలోచనతోను, నిజాయితీతోను రాసిన ఈ పుస్తకం చివరి దాకా ఆసక్తిగా చదివిస్తుంది. ఈ మొత్తం ప్రయాణంలో మీరు కూడా బైక్ వెనుక సీట్లో కూర్చుని ప్రయాణించిన అనుభూతిని మిగుల్చుతుంది.
కొలంబస్ అడుగుజాడల్లో
కుటుంబం నుండి, సంపాదన నుండి కొంతకాలం దూరమై యాత్రలు చేసేవాళ్లున్నారు. యాత్రల కోసమే ఒంటరి జీవితాన్ని ఎన్నుకున్న యాత్రికులు కూడా ఉన్నారు. ఎలాంటి బంధనాల్లో ఇరుక్కోకుండా హాయిగా దేశాలు తిరిగే మహిళా యాత్రికులు కూడా కొంతమంది కనిపిస్తారు. అందరికంటే భిన్నంగా, జంటగా అనగా భార్యభర్తలు కలిసి దేశాలు చుట్టేయడం చాలా అరుదుగా కనిపిస్తుంది. అలాంటి అరుదైన వాళ్ళే నర్మదరెడ్డి, ఇంద్రా రెడ్డి దంపతులు. వారి యాత్రా విశేషాలన్నింటిని అత్యంత ఆసక్తికరంగా తెలియజేయడం నర్మదరెడ్డికే చెల్లింది. నిజానికి వారు ప్రపంచమంతా చుట్టి వచ్చారనే చెప్పాలి. అన్ని ఖండాలు ఉన్న ఎంపిక చేసుకున్న దేశాలను సందర్శించడం, అక్కడి వింతలు, విశేషాలను తమ ప్రయాణానుభవాలతో కలిసి చెప్పడం వారి ప్రత్యేకం. ''కొలంబస్ అడుగుజాడల్లో'' అనే రెండవ అధ్యాయనం. వివిధ దీవులు, దేశాలన్నీ తిరిగి అక్కడివారి చరిత్ర-సంస్కృతి, వింతలు, విశేషాలను తమ ప్రయాణ అనుభవాల నుండి వివరించారు. ఆద్యంతం ఆసక్తికరంగా రూపొందిన ఈ యాత్రాకథనాలను చదువుతుంటే మనం కూడా రెడ్డి దంపతుల వెంట తిరుగుతున్న అనుభూతికి లోనవుతాం.
Authorization