స్వచ్ఛమైన గాలి, తాజాగా ఉండే నీలిరంగు నీళ్ళతో, అందంగా ప్రవహించే నది వెల్లాయని కాయల్. దీన్నే వెల్లాయని సరస్సు అంటారు. తిరువనంతపురం జిల్లా గుండా ప్రవహించే అతి పెద్ద మంచి నీటి సరస్సు. స్థానికులు దీన్ని వెల్లాయని కాయల్ అని పిలుస్తారు. తిరువనంతపురం ప్రధాన బస్సు కూడలి నుండి కేవలం తొమ్మిది కిలో మీటర్ల దూరంలో ఉంటుంది.స్థానికులు, పర్యాటకులు ఎక్కువగా సందర్శించే విహార కేంద్రాల్లో వెల్లాయని సరస్సు ఒకటి. కోవళం వెళ్తే ఒక్కసారైనా ఈ సరస్సును చూడాల్సిందే. తాజాగా ఉండే స్వచ్ఛమైన నీలిరంగు నీళ్ళతో ఈ సరస్సు చాలా అందంగా కనపడుతుంది. ఈ సరస్సు మీద వెన్నెల పడగానే ఈ ప్రాంతం అంతా మనోహరంగా మారిపోతుంది. ఈ దృశ్యాన్ని చూడడానికి పర్యాటకులు రాత్రిదాకా వేచి ఉంటారు. ఈ సరస్సులో ప్రతి ఏటా ఓనం పండుగ సందర్భంగా పడవ పందాలు జరుగుతాయి. వీటిని చూడడానికి చాలామంది వస్తారు. ఓనం పండుగ రోజులలో కోవళంలో గానీ చుట్టుపక్కల గానీ జరిగే పడవ పందాలను తప్పకుండా చూడవలసిందే.