ఆహ్లాదకరమైన సముద్ర తీరాలు, అందులో కొలువై ఉన్న వేలాది అద్భుత దీవులు.. ఆకర్షణీయమైన పర్వత పంక్తులు. చుట్టూ ఎన్నో వింతైన జీవరాసులు. ఒక్కటేమిటీ ఎటువైపు చూసినా కనుచూపుమేర అందాలతో ఒక కొత్త లోకంలో విహరించే అనుభూతిని కలిగిస్తుంది ఫిలిప్పీన్స్.
''ఒక వ్యక్తి ఫిలిప్పీన్స్ అందాలు వీక్షించేందుకు 30 సార్లు వెళ్లి వచ్చాను'' అని చెబుతుంటే వినడానికి కాస్త అతిశయోక్తిగా అనిపించింది. కానీ తీరా ఆ దేశాన్ని పర్యటించి వచ్చాక అనిపించింది నాకు 30 ఏంటీ మూడు వందల సార్లు వెళ్లివచ్చినా తనివి తీరదేమో అని. ఇటీవల ఆ దేశాన్ని పర్యటించినప్పుడు మాకు కలిగిన అనుభూతుల సమాహారమే ఈ ఫిలిప్పీన్స్ యాత్ర. మేం హైదరాబాదు నుండి మలేషియాకు, మలేషియా నుండి మనీలాకు టికెట్స్ బుక్ చేసుకున్నాం. మనీలాకు హైదరాబాద్ నుండి రాత్రి 8.30 కు బయలుదేరి ఉదయం 7.30 కి మలేషియాలో ఉన్నాం. అక్కడి నుండి మనీలాకు చేరుకునే వరకూ రాత్రి ఎనిమిది గంటలు అయ్యింది. అంటే మొత్తంగా 24 గంటల ప్రయాణం. వాస్తవానికి ఇండియా నుండి మనీలాకు చేరుకోవడానికి అంత సమయం పట్టదు కానీ మా ఫ్లైట్ ఒక గంట ఆలస్యంగా బయలుదేరడంతో మలేషియా నుండి మనీలాకు వెళ్లాల్సిన ఫ్లైట్ మిస్ అయ్యాం. దీంతో ఆరు గంటలు మలేషియా ఎయిర్ పోర్టులోనే ఉండిపోవాల్సి వచ్చింది.
'మనీలా' అనేది ఫిలిప్పీన్స్ రాజధాని నగరం. ఈ దేశంలో అతి పెద్ద నగరం. ఇది చాలా రద్దీగా ఉంటుంది కూడా. అత్యంత జనసాంద్రత కలిగిన నగరాల్లో ఇదొకటి. మనీలాలో ఫ్లైట్ దిగిన వెంటనే అక్కడ ఒక వాహనం మాట్లాడుకొని 'తగతై' అనే ప్లేస్‌కు బయలు దేరాం. ఇది మనీలాకు కేవలం 60 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. సాధారణంగా అయితే ఒక గంట, గంటన్నరలో ఈ ప్రాంతానికి చేరుకోవచ్చు కానీ మేం అక్కడికి చేరుకోవడానికి మూడు గంటల సమయం పట్టిందంటే అర్థం చేసుకోండి. ఎంత రద్దీ ఉందో అక్కడ.
తగతై ఊటీలాగే చల్లని ప్రదేశం...
తగతై అనే ప్లేస్ మన ఊటీ, కొడై కెనాల్ లాగా చల్లని ప్రదేశం. చాలా ఎత్తయిన కొండల మీద ఉంటుంది. అక్కడ మేం బుక్ చేసుకున్న రిసార్ట్‌కు చేరుకున్నాం. ఆ రాత్రి అక్కడే విశ్రాంతి తీసుకున్నాం. అయితే మనీలా నుండి తగతైకు ప్రయాణంలో గమనించిన ఒక ముఖ్య విషయం ఏమిటంటే. మేం ప్రయాణం చేసిన సమయం క్రిస్మస్ సీజన్ కావడంతో ఎక్కడ చూసినా క్రిస్మస్ వాతావరణ కనిపించింది. దారి పొడవునా ఇరువైపుల సీతాకోక చిలుకల్లాగా అలంకరించారు. అలా కొన్ని కిలో మీటర్లు అలంకరించి ఉంటారు. ఒక చోట సీతకోకచిలుకలు, మరో చోట పువ్వుల తోటి, ఇంకొంత దూరం పోయాక వేరే విధంగా అలంకరించారు. ఇలా అలంకరించడం ఎక్కడా చూడలేదు నేను. ఈ అలంకరాన్ని చూస్తే చాలా ఆశ్చర్యమేసింది.
మేరిలాండ్స్లో...
మేరిలాండ్స్లో ఒక ఆవిడ పరిచమైంది. ఆవిడతో మాట్లాడుతున్న సందర్భంలో ఫిలిప్పీన్స్‌లో 'డైవర్స్ రేట్' ఎంత ఉందని అడిగాను. ఫిలిప్పీన్స్‌లో క్యాథలిక్స్ జనాభా (క్రైస్తవుల్లో సంప్రదాయ వాదులు) ఎక్కువగా ఉన్నారు కాబట్టి డైవర్స్ అనేది చాలా తక్కువగా జరుగుతుందని చెప్పింది. వివిధ దేశాలలో లాగా ఇక్కడ విడాకుల సంఖ్య ఉండదని చెప్పింది. కుటుంబ వ్యవస్థ, ఆచార వ్యవహారాలు, స్థానిక సంప్రదాయాలు ఇలా కొన్ని పోలికలు మన ఇండియాను పోలి ఉంటాయనుకోవచ్చు.
గంటకు.. నాలుగు వేలట...
మేం ఉన్న హోటల్‌కు దగ్గర్లోనే రెండు పబ్లిక్ పార్కులు ఉన్నాయి. వాస్తవానికి ఫిలిప్పీన్స్ అంటే స్వచ్ఛమైన సముద్రం, అద్భుతమైన దీవులు, అగ్ని పర్వతాలకు నెలవు. అటువంటప్పుడు అగ్ని పర్వతాలను చూడకుండా వెళితే ఎలా! ఎందుకైన మంచిదని రిసెప్షన్‌కు వెళ్లి కనుక్కుందామని అటువైపు అడుగులు వేశాను. రిసెప్షన్‌కు వెళ్లి అడిగితే వాళ్లు ఒక నాలుగు వేలు కడితే ఆ ప్రాంతాలు చూడటానికి ఒక కారు మాట్లాడతామని చెప్పారు. నాలుగు గంటల్లో ఆ ప్రాంతాలు చూపిస్తామని చెప్పారు. నాలుగు గంటల ప్రయాణానికి నాలుగు వేల రూపాయలు అంటే కాస్త ఎక్కువే అనిపించింది.
స్కై రాంచ్లో పిల్లలతో...!
మేం వెళుతున్న దారిలో 'స్కై రాంచ్' అనే ప్రదేశంలో ఒక పార్కు ఉంటే అక్కడ ఆగాం. పార్కు లోపలికి వెళ్లేటప్పుడు రెండు చేతులు జోడించి నమస్కరిస్తున్నట్లు ఒక పెద్ద 'హ్యాండ్ స్టాచ్చ్యూ' ఉంది. అది వంద ఫీట్ల ఎత్త్తు ఉండొచ్చు. అక్కడ మేం కొన్ని ఫొటోలు దిగి పార్కులోకి వెళాం. ఆ పార్కు చిన్న పిల్లలు ఆడుకోవటానికి అనువైన ప్రదేశం. పెద్ద పార్కుల్లో ఉండేలా అన్నీ ఆట వస్తువులు ఉన్నప్పటికీ ఈ ప్రాంతానికి సంబంధించిన కొన్ని ప్రత్యేకతలు ఇక్కడ పొందు పరిచారు. ఉదాహరణకు హాట్ బెలూన్ వంటివి విహరించాలంటే ఎక్కడో ప్రాంతానికి వెళ్ళేకంటే ఇక్కడే ఉండే ఒక వీల్లాంటి దాంట్లో కూర్చుంటే అది ఎత్తయిన ప్రదేశానికి తీసుకెళ్లి అటువంటి అనుభూతిని కలిగిస్తుంది. అలాగే హార్స్ రైడింగ్ వంటిది కూడా ఏర్పాటు చేశారు.
జింజర్ బ్రెడ్ ఒక ఫేరి ల్యాండ్...
పార్కు అంతా తిరిగిన తర్వాత బయటకు వచ్చి 'జింజల్ బ్రెడ్' అనే ప్రదేశానికి వెళ్లాం. ఇది ఒక పది ఎకరాలలో ఉంది. దాంట్లో ఒక పెద్ద ఇల్లు కూడా ఉంది. అది ఎలా ఉందంటే ఫేరి ల్యాండ్ లాగా ఉంది. చాలా చక్కగా కట్టారు. లోపల చిన్న చిన్న బొమ్మలను ఎంతో అందంగా అలంకరించారు. ఒక బొమ్మ దగ్గర మేం ఫొటో దిగి రెప్టేల్ పార్కుకు వెళ్లాం. రెప్టేల్ పార్కులో పెద్ద తాబేలు, డైనోసార్సు, రాక్షస బల్లులు, అరుదుగా కనిపించే జంతువులను బొమ్మలుగా చేసి పెట్టారు. అక్కడ మేం ఒక 300 అడుగుల కిందకు దిగి పార్కు అంతా చూసి మళ్లీ పైకి వచ్చాం. అక్కడి నుండి మేం ఇంకాస్త పైకి వెళ్లాం. అక్కడ వెదురు కట్టలతో ఊగుతూ కనిపించే బ్రిడ్జిని చూశాం. అది చాలా అద్భుతంగా అనిపించింది.
పజిల్ మ్యూజియం...
తర్వాత పజిల్ మ్యూజియంకు వెళ్లాం. ఆ మ్యూజియం ప్రత్యేకత ఏంటంటే ఒక ఆవిడ ఆట విడుపు కోసం పజిల్స్ తయారు చేసేదట. అట్టముక్కల్ని, చిన్న చిన్న వస్తువులతో ఆవిడ చేసిన పజిల్స్ ఆసక్తిగా అనిపించడంతో తన కుమారుడితో కలిపి వాటిని తయారు చేసేది. దాన్ని ఒక హాబీలాగా తీసుకుంది. క్రమంగా ఆసక్తి పెరగడంతో వందలు వేలు తయారు చేసే స్థాయికి చేరుకుంది. ఆవిడ చేసిన ఈ అరుదైన గుర్తింపునకుగాను గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్‌ను కూడా సాధించింది. ఇవాళ ఒక టూరిస్ట్ అట్రాక్షన్‌గా ఉన్న ఆమె ఇల్లు వందల, వేల పజిల్స్‌తో నిండి ఉంది. అందులో మోనాలిసా, ఈపిల్ టవర్, ఏడు ప్రపంచ వింతలు, ఒక్కటేమిటీ ఎన్నో అక్కడ కొలువుతీరి ఉన్నాయి. వాటినన్నింటిని తిరిగి చూస్తున్నప్పుడు ఒక చిన్న హాబీ ఒక మనిషిని ఎంత ఎత్తుకు తీసుకెళుతుందో కదా అనిపించింది వాటిని చూశాక.
ఒకప్పటి యుద్ధ వాహనాలే నేటి జీప్నీస్..!
మన దేశాల్లో అయితే రవాణాకు చాలా వరకూ జీపులను వాడుతుంటారు. అలాగే ఫిలిప్పీన్స్‌లో కూడా జీపులు చాలా ఉన్నాయి. అయితే అవి మన దగ్గరిలాంటివి కాదు. అక్కడి ప్రజా రవాణాలో జీప్నీస్ అనే వాహనాలు విరివిగా కనబడతాయి. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో 1940లో అమెరికా సైనికులు తిరిగేందుకు ఇక్కడికి వాటిని తీసుకొచ్చారు. ఆ తర్వాత ఇతర దేశస్తులందరూ ఇలాంటి వాటినే ఉపయోగించేవారట. అయితే యుద్ధం ముగిశాక, ఫిలిప్పీన్స్ స్వాతంత్య్రం పొందాక ఆ దేశస్తులు వదిలి వెళ్లిన జీవులన్నింటినీ కూడా అక్కడి ప్రజలు రవాణాకు అనుగుణంగా మార్చుకున్నారు. వాటిని మినీ బస్సుల్లా కూడా తయారు చేసుకున్నారు. ఈ దేశంలో ఎక్కడ చూసినా అవే కనిపిస్తాయి. మనం ఏ ప్రదేశానికి వెళ్లాలన్నా పది పేసోలు అంటే మన రూపాయాల్లో 15 రూపాయలు పెడితే ఒక నాలుగు స్టాప్‌లు దూరం వరకూ వెళ్లొచ్చు.
అగ్ని పర్వతపు అంచుల్లో...
అక్కడి నుండి మేం వాల్కోనా చూడటానికి బయలు దేరాం. ఫిలిప్పీన్స్ అందమైన దీవులకు, సుందరమైన సముద్రతీరాలకు ప్రత్యేకమో! అగ్ని పర్వతాలకు కూడా అలాగే ఫేమస్. 14 మైళ్లున్న ఓ దీవిలో టౌన్లు ఐదుంటే అగ్ని పర్వతాలు మాత్రం ఏడున్నాయంటేనే అర్థం చేసుకోవచ్చు. ఈ ప్రాంతం ఎటువంటిదో. ఈ ప్రాంతంలోని మౌంట్ పినాటుబో, టాల్, మేయాన్ అనే అగ్నిపర్వతాలు ఎప్పుడు విరుచుకుపడతాయో ఎవరూ చెప్పలేరు. అయినప్పటికీ ఈ ప్రాంతాలు టూరిస్టు ప్రదేశాలుగా ఇప్పటికీ ప్రజల్ని ఆకర్షిస్తూనే ఉన్నాయి. అయితే ఇక్కడ ఓ విషయం చెప్పాలి. అదేంటంటే మేం దిగిన హోటల్లో వాల్కనో చూడటానికి 25 వేల రూపాయలు అవుతాయని రాసి ఉంచారు. ఒక వాల్కోనాకు వెళడానికే 25 వేలు పెట్టి ఏం వెళతాం అనుకున్నాం. అట్లాంటిది పబ్లిక్ ట్రాన్స్‌పోర్టు వాళ్లను కనుక్కొని ఒక వేయి రూపాయలతో వెళ్లొచ్చాం. మాతో పాటు ఒక గైడ్‌కు 500 రూపాయలు, తర్వాత పడవలో వెళుతున్నందుకు అతనికి 200, ఒక ఆటోకు 300 ఇలా మొత్తం వేయి రూపాయల్లో ఆ వాల్కోనాను చూసి వచ్చాం. పబ్లిక్ ట్రాన్స్‌పోర్టును నమ్ముకుంటే ఎంత చౌక అనిపించింది మా ట్రిప్‌లో.
సెవన్ వండర్స్ ఆఫ్ ది వరల్డ్...
ప్లయిట్లో పలవన్కు వచ్చాం. ఇక్కడికి ఒక గంట జర్నీ. అక్కడ దిగగానే ఒక ఏజెంట్ వచ్చి మిమ్మల్ని వరల్డ్ హెరిటేజ్ సైట్ అయిన 'సెవన్ వండర్స్ ఆఫ్ ది వరల్డ్' అన్న ప్రదేశానికి తీసుకెళతానని చెప్పాడు. అది భూగర్భంలో 7-8 కిలోమీటర్లు లోపలికి వెళ్లొచ్చు. పలవన్ నుండి ఎల్నీడో అనే ప్లేస్‌కు వెళ్లే దారిలో ఈ భూగర్భ గుహలను చూడటానికి తీసుకెళ్లారు. దీనికి రెండు గంటల ప్రయాణం చేసి మధ్యలో ఆగి టీ, కాఫీ తాగటానికి దించారు. అక్కడ అందరూ టీ తాగి గుహవైపునకు వెళ్లాం. ఆ గుహ అంతా అడవి ప్రాంతం. ఆ రెండు కిలోమీటర్లు పడవలో తీసుకెళ్లి అవన్నీ చూపించారు. ఒక్కొక్కటి ఒక్కో ఆకారంలో ఉన్నాయి. అవి కొన్ని ఏండ్ల నుండి నీటి చుక్క ధార ధారగా పడి అలా సాలమైట్సుగా అయ్యాయట. మేం అవన్నీ చూసి బయటకు వచ్చాం.
సీక్రెట్ ఐలాండ్...
ప్రపంచంలో చాలా చోట్ల సముద్రంలో దీవులుంటాయి. మరి కొన్ని చోట్ల సరస్సుల్లో దీవులుంటాయి. కానీ విచిత్రంగా ఫిలిప్పీన్స్‌లో మాత్రం కొండల మధ్యన దీవులున్నాయి. అందుకే దీన్ని సీక్రెట్ ఐలాండ్ అంటారు. అది ఎంత బాగుంది అంటే ఒక పెద్ద కొండకు చిన్న రంధ్రం ఉంది. దాని మీద ఎక్కి అక్కడి నుండి లోపలికి దిగితే అక్కడ చక్కని సరస్సు, మళ్లీ ఆ సరస్సు చుట్టూ కొండలే. ప్రకృతి ఒడిలో అద్భుత లోకంగా ఉన్న ఈ ఫిలిప్పీన్స్ యాత్ర ఒక మరుపురాని అనుభూతినే మిగిల్చిందని చెప్పవచ్చు. ఆ అందాలను కళ్లనిండా నింపుకొని మనీలాకు అక్కడి నుండి ఇంటికి వచ్చాం.
Authorization