ప్రయాణం అంటే చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టపడతారు. రోజు వారి చికాకులు, పని ఒత్తిళ్లు వంటి వాటిని వదిలి కొన్ని రోజులు హాయిగా అలా కుటుంబ సభ్యులతోనో, స్నేహితులతోనో అందమైన ప్రదేశాలను చుట్టేసి రావాలని కోరుకునేవారు ఎందరో. అయితే ఊరికే ఎక్కడికీ వెళ్ళిరాలేం. ఇదంతా ఖర్చుతో కూడుకున్న పని. తక్కువ బడ్జెట్లో మీ విహార యాత్ర పూర్తి కావాలంటే ఈ కింది చిట్కాలు ఫాలో అవ్వండి.
ప్లానింగ్‌లో ఆలస్యం వద్దు: టూర్‌కు వెళ్ళాలనుకున్నప్పుడు ఎక్కడకు వెళ్ళాలో, అక్కడ ఏమేమి చేయాలో వంటివి ముందుగానే ప్రణాళిక వేసుకుంటే మంచిది. వెళ్ళే ముందు చూసుకోవచ్చులే అని ఆలస్యం చేస్తే ధరలు పెరిగే ప్రమాదముంది. వేసవి సమయంలో ప్రయాణపు టిక్కెట్లు, హోటల్ ధరలు వంటివి పెరిగిపోవచ్చు. అందుకే ప్రయాణపు ప్రణాళికలు ముందుగానే వేసుకొని ధరలు ఎలా ఉన్నాయో చూసుకొని ప్రయాణాన్ని మొదలుపెడితే సరిపోతుంది.
పరిశీలించండి: విమాన ధరలు ఎప్పుడూ తగ్గుతూ, పెరుగుతూ ఉంటాయి. వాటిని నిత్యం పరిశీలిస్తే ఉండండి. ఒకవేళ మీరు ప్రయాణాలు పెట్టుకుంటే విమాన ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుంటే మంచిది. ధరల్లో తగ్గింపు ఉన్నప్పుడు వెంటనే మీ ప్రయాణాన్ని మొదలు పెట్టవచ్చు.
మీరే వండుకోండి: వేరే ప్రదేశాలకు వెళ్ళినప్పుడు అక్కడ దొరికే విభిన్న వంటకాలను రుచి చూడాలనిపించడం సహజమే. బీచ్ మార్గానికి దగ్గరగా ఉండే హౌటల్స్ అద్భుతమైన వంటకాలను వడ్డిస్తాయి. అయితే అక్కడ రుచితో పాటు ధరలు కూడా విపరీతంగా ఉంటాయి. అందుకే మీకు వీలైనంత వరకు సొంత భోజన ఏర్పాట్లు చేసుకోండి. మీకు అందుబాటులో ఉండే కిరాణా సామాన్లతో మీకు నచ్చిన భోజనాన్ని వండుకోండి. దీని వల్ల తిండి మారడం వల్ల వచ్చే సమస్యలు కూడా దరి చేరకుండా ఉండాలి.
ఫొటో తీసి భద్రపరచుకోండి: ఇతర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు అక్కడ లభ్యమయ్యే రకరకాల వస్తువులు కొనుక్కోవాలని, స్నేహితులకు, కుటుంబ సభ్యులకు గిఫ్టులు ఇవ్వాలని చాలా మంది అనుకుంటారు. అయితే అందుకోసం అనవసర ఖర్చు చేస్తే డబ్బు వృధా అవుతుంది. అంతేకాకుండా లగేజ్ కూడా పెరిగిపోతుంది. అందుకే మీ అందమైన ప్రయాణానికి గుర్తుగా మీ మొబైల్ ఫోన్లో ఓ ఫొటోని తీసుకొని భద్రంగా దాచుకుంటే సరి. ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వదలచుకుంటే తక్కువ ధరలో, ఆకర్షణీయంగా ఉండే వాటిని కొనండి.
అన్నీ చూడాలనుకోవద్దు: కొత్త ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడి ప్రతీ ప్రదేశాన్ని చూడాలని మనసు కోరుకుంటుంది. అలా అని అన్ని ప్రాంతాలు చూడాలంటే డబ్బు చాలా ఖర్చు అవుతుంది. అందుకే ఆ ప్రాంతంలో అత్యంత ప్రసిద్ధి చెందిన రెండు, మూడు ప్రాంతాలను గుర్తించి వాటిని ప్రశాంతంగా చూసి రండి. దీని వల్ల డబ్బుతో పాటు సమయం కూడా కలిసి వస్తుంది. వీలైనంత వరకు ఉద్యానవనాలు, పార్కులు, స్థానిక మ్యూజియంలను సందర్శించేందుకు ప్రాధాన్యం ఇవ్వండి.
Authorization