ప్రకృతి తన అందాలను ఆరబోసిన ప్రదేశం డార్జిలింగ్. నిర్మలమైన మేఘాలు, చుట్టూ పచ్చదనం, కనుచూపుమేర తెల్లటి మంచు పర్వత శిఖరాలు ఇలా ఒక్కటేమిటి ఇక్కడి ప్రతి దృశ్యం ఓ సుందరమే. అంతే కాకుండా సాహసక్రీడలను ఇష్టపడేవారిని సైతం డార్జిలింగ్ రారమ్మని ఆహ్వానం పలుకుతోంది. అటువంటి అందమైన డార్జిలింగ్‌లో పర్యాటక ప్రాంతాల గురించి ఈ వారం జరదేఖోలో...
పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఉత్తర భాగాన 7004 అడుగుల ఎత్తున తూర్పు హిమాలయాల్లో నేపాల్, భూటాన్ దేశాలకు సమీపంలో డార్జిలింగ్ కేంద్రీకృతమైవుంది. ఈ ప్రాంతానికి సిలిగురి నుంచి చేరుకోవచ్చు. ఇది కాంచనగంగ పర్వత శ్రేణులలో ఉంది.
రమణీయమైన ప్రకృతి
డార్జిలింగ్ అంటే పిడుగుల ప్రదేశమని అర్థం. ఈ ప్రాంతంలో అనేక చోట్ల చిన్న చిన్న జలపాతాలున్నాయి. ఇక్కడ రైలు ప్రయాణం పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ట్రెక్కింగ్ లాంటి సాహసక్రీడలకు అనువైన ప్రాంతంగా డార్జిలింగ్ ఉంది. కొండ శిఖరాల అందాలు, ఎన్నో రమణీయ ప్రకృతి దృశ్యాలు కనువిందు చేస్తున్నాయి. పొగమంచు దుప్పటి, ప్రకాశవంతమైన సూర్యాస్తమయం అంతకంటే ఎక్కువగా ఆకట్టుకుంటున్నాయి.
హస్త కళలకు ప్రసిద్ధి
డార్జిలింగ్‌లో ఉన్న ఎన్నో దర్శనీయ స్థలాల్లో సెంచాల్ లేక్ ఒకటి. ఈ నది నుంచి డార్జిలింగ్ ప్రాంత ప్రజలకు తాగునీటిని సరఫరా చేస్తారు. ఇది 8031 అడుగుల ఎత్తున ఉంది. డార్జిలింగ్‌లోని కాళీమాత ఆలయం హిందువులకు, బౌద్ధులకు పవిత్ర పుణ్యక్షేత్రం. బౌద్ధుల గ్రంథాలయం కూడా ఇక్కడ ఉంది. హిమాలయన్ మౌంటనీరింగ్ ఇనిస్టిట్యూట్ ఇక్కడే వెలసి వుంది. డార్జిలింగ్ అందాలను రోప్ వే ప్రయాణంలో ఆకాశమార్గంలో ఇక్కడి అందాలను తిలకించవచ్చు. టీ తోటలను కూడా చూడవచ్చు. బుద్ధుడి 14 అడుగుల కాంస్య విగ్రహం ఇక్కడ ఉంది. ఇక్కడ ఉన్న లాయిడ్ బొటానికల్ గార్డెన్లో హిమాలయ పర్వత వృక్షజాతులను చూడవచ్చు. బెంగాల్ నేచురల్ హిస్టరీ మ్యూజియంలో రకరకాల వన్యప్రాణులను చూడవచ్చు. పద్మజానాయుడు జూలాజికల్ పార్క్‌లో సైబీరియన్ టైగర్ స్నో లిపర్డ్ బ్రీడింగ్ సెంటర్ ఉంది. హస్తకళలకు ఈ ప్రాంతం ఎంతగానో ప్రసిద్ధి చెందింది.
మౌంటనీరింగ్ ఇన్స్టిట్యూట్
మొదటిసారి ఎవరెస్ట్ శిఖారాన్ని అధిరోహించిన తెంగ్సింగ్ నార్కే, ఎడ్మండ్ హిల్లరీల సంస్మరణార్థం ఈ ఇన్ స్టిట్యూట్‌ను ఏర్పాటు చేశారు. ఇక్కడ మౌంటనీరింగ్, రాక్ క్లైంబింగ్ వంటి సాహసయాత్రలు చేసే సమయంలో వినియోగించే వస్తువులకు సంబంధించిన మ్యూజియం ఉంది. ఈ ఇన్ స్టిట్యూట్ ప్రాంగణంలోనే ఉన్న జూలో అంతరించే స్థితికి చేరుకొన్న అత్యంత అరుదైన మంచుచిరుత, రెడ్ పాండ, గోరల్ గా పిలిచే పర్వతపు మేక, సైబేరియన్ టైగర్, టిబేటియన్ నక్క తదితర జంతువులనెన్నింటినో చూడవచ్చు.
మేఘాల్లో తేలిపోవచ్చు
డార్జిలింగ్‌లో చూడదగిన పర్యాటక కేంద్రాల్లో టైగర్ హిల్స్ మొదటి స్థానంలో ఉంటాయి. సముద్ర మట్టానికి దాదాపు 2,590 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ టైగర్ హిల్స్ చేరుకుంటే దూదెపింజెల్లాంటి మేఘాల్లో తేలిపోతున్న అనుభూతి కలుగుతుంది. పర్యావరణ ప్రేమికులు ఎక్కువగా ట్రెక్కింగ్ ద్వారా ఇక్కడికి చేరుకొంటారు. ఇక్కడి నుంచి దూరంగా కనిపించే కాంచన్ జంగా శిఖరం వద్ద సూర్యోదయం, సూర్యాస్తమయాలను చూడటం చాలా అద్భుతంగా ఉంటుంది. డార్జిలింగ్ నగరం నుంచి 40 నుంచి 45 నిమిషాల ప్రయాణ దూరంలో ఉన్న ఈ టైగర్ హిల్స్ ప్రాంతానికి చేరుకోవడానికి ప్రభుత్వ, ప్రైవేటు, బస్సు సౌకర్యాలు నిత్యం ఉంటాయి.
రాక్ గార్డెన్
వాతావరణంలో జరిగిన మార్పుల వల్ల ఇక్కడ పెద్ద బడ్డరాళ్లు వివిధ ఆకారాలకు మారి పర్యాటకులను ఎంతో అకట్టుకొంటున్నాయి. ఇందులో కొన్ని జంతువులను పోలి ఉంటే మరికొన్ని దేవతలను పోలి ఉంటాయి. ఇక ఇదే ఆవరణంలో ఉన్న మయా పార్క్‌లో వివిధ రకాల ఔషద గుణాలున్న మొక్కలను చూడవచ్చు. అదే విధంగా విభిన్న రూపాల్లో ఉన్న పుష్పాలు కూడా ఈ ఉద్యానవనంలో పర్యాటకులను ఆకర్షిస్తాయి.
రోప్ వే చక్కని వేదిక
డార్జిలింగ్‌లో ఉన్న ప్రకృతి అందాలన్నింటినీ ఒకేసారి చూడాలనుకునేవారికి ఈ డార్జిలింగ్ రోప్ వే చక్కటి వేదిక. దీనిని రంగీత్ వ్యాలీ ప్యాసింజర్ కేబుల్ కార్ సర్వీస్ అని కూడా అంటారు. భూమికి అంతెత్తులో ప్రయాణం చేస్తూ కింద ఉన్న టీ తోటలను చూడటం జీవితంలో మరిచిపోలేని అనుభూతిని కలిగిస్తుంది. అదే విధంగా నదీ లోయలు, తెల్లటి దూదె పింజల్లాంటి మేఘాలతో కూడిన హిమాలయ పర్వత శ్రేణులు కూడా ఈ రోప్ వే మార్గంలో కనువిందును చేస్తాయి.
సెంచాల్ అభయారణ్యం
భారత దేశంలోని అత్యంత ప్రాచీన అభయారణ్యాల్లో సెంచాల్ అభయారణ్యం కూడా ఒకటి. దీనిని 1915లో ఏర్పాటు చేశారు. డార్జిలింగ్ పట్టణం నుంచి కేవలం 11 కిలోమీటర్ల దూరంలో ఈ పర్యాటక కేంద్రం ఉంది. ఈ సెంచాల్ అభయారణ్యంలో అత్యంత అరుదైన జంతువులు, చెట్లను చూడవచ్చు. ముఖ్యంగా హిమాలయన్ ఎగిరే ఉడత, హిమాలయన్ ఎలుగుబంటి వంటివి ఇక్కడ ప్రధాన ఆకర్షణ. ఫొటోగ్రఫీని ఎక్కువగా ఇష్టపడే వారు ఇక్కడికి వెళుతుంటారు.
Authorization