కనులకు విందు చేసే పచ్చని ప్రదేశాలు, ఒంపు సొంపులతో సాగే ఎత్తైన జలపాతాలు కెమ్మనగుండి హిల్ స్టేషన్ ప్రత్యేకతలు. కర్నాటక రాష్ట్రంలోని చిక్మంగళూరు జిల్లాలో తరికెరి తాలూకాలో ఉన్న ఈ హిల్ స్టేషన్ చూడచక్కని ప్రదేశం! చుట్టూ బాబా బూదాన్ గిరి కొండలు, జలపాతాలు, దట్టమైన అడవులు, పచ్చటి మైదానాలు ఈ ప్రాంతాన్ని గొప్ప పర్యాటక ప్రదేశంగా మార్చాయి.
కె.ఆర్ కొండలు, బాబా బుడాన్ కొండల మధ్య చిక్మంగళూరు పట్టణానికి 55 కిలోమీటర్ల దూరంలో కెమ్మనగుండి పర్వత ప్రాంతం ఉంది. కెమ్మనగుండి పర్వత ప్రాంతంలో వాడేయార్ రాజు కృష్ణ రాజ వాడేయార్ వేసవి విడిది చేసేవాడు. అందుకే ఈ పర్వత శ్రేణులను కె.ఆర్ కొండలు అని కూడా పిలుస్తారు.సెలయేళ్ళతో ఈ పర్వతం సముద్రమట్టానికి 1434మీటర్ల ఎత్తులో దట్టమైన అరణ్యాల మధ్య సంవత్సరం పొడవునా సెలయేళ్ళతో హరితహారంలా కనిపిస్తుంది. పూలతోటలతో కొండలోయలతో ఉండే ఈ హిల్ స్టేషన్ సౌందర్యం వర్ణణాతీతం.
ఆకట్టుకునే సూర్యాస్తమయం: సూర్యాస్తమయానికి అరణ్యాలు అన్వేషణ జరిపేవారికి ఈ పర్వత కేంద్రం నుండి అనేక మార్గాలున్నాయి. ఈ కొండ ప్రాంతంలో వివిధ ప్రదేశాల నుండి సూర్యాస్తమయాన్ని తిలకించవచ్చు. సూర్యస్తమయం ఇక్కడ అత్యంత అద్భుతంగా ఉంటుంది.
గులాబీ తోటలు: ఈ పర్వత శిఖరంపై అనేక గులాబీ తోటలున్నాయి. ఈ ప్రాంతంలో ఉండే రకరకాల గులాబీ తోటలు చూసి తీరాల్సిందే. పర్వతం నడిబొడ్డు నుండి పది నిముషాల నడకలో వచ్చే జెడ్ పాయింట్ నుండి చూస్తే రమణీయంగా ఉండే పశ్చిమ కనుమలలోని శొల గడ్డి భూములు కనిపిస్తాయి. శోలగడ్డి భూములు భలే ఆకట్టుకుంటాయి. పూల తోటలతో వంపులు తిరిగిన దారులతో కొండ లోయలతో ఉండే ఈ హిల్‌స్టేషన్ గురించి ఎంత చెప్పినా తక్కువే.
రాక్ గార్డెన్: కెమ్మనగుండి వెళ్లాలనుకునేవారు కచ్చితంగా చూడాల్సిన అందమైన ప్రదేశం రాక్ గార్డెన్. రాళ్లతో మలచబడిన రాక్ గార్డెన్లో కేవలం రాళ్లే కాదు...అందమైన పూల మొక్కలు కూడా దర్శనమిస్తాయి.
జీ పాయింట్: ఎత్తైన కొండపై నుండి జీ పాయింట్ చేరాలంటే నడకే ఉత్తమం. ఈ కొడపైకి చేరటానికి 30నిముషాలకు మించి సమయం పట్టదు. ఈ కొండ మీద నుండి ప్రకృతి అందాలను దగ్గరలో ఉండే జలపాతాన్ని చూసి ఒక్కక్షణం మైమరచిపోతారు.
హెబ్బే జలపాతం: ఈ జలపాతానికి వెళ్లే దారి కాస్త కష్టంగా ఉంటుంది. నడిచి వెళ్లాలి లేదా జీపులో వెళ్లాలి. 13కిలోమీటర్ల దూరమే అయినా నడుస్తుంటే మాత్రం ఒక ఊరికి వెళ్లినంత దూరం అనిపిస్తుంది. 168 మీటర్ల ఎత్తు నుండి ఈ జలపాతం అందాలు ఒలకబోస్తుంది. ఈ ప్రకృతి అందాలు చూడగానే ప్రయాస, అలసట అంతా మర్చిపోతాం. ప్రశాంత వాతావరణం ఆనందించాలనుకునే వారికి హెబ్బే జలపాతాలు, చుట్టు ప్రక్కల ప్రదేశాలు అనువుగా ఉంటాయి.
కాళపట్టి జలపాతం: కెమ్మనగుండి పర్యాటకులు తప్పక వీక్షించాల్సినది కాళపట్టి జలపాతం. దీన్ని కాళ హస్తి జలపాతాలని కూడా పిలుస్తుంటారు. ఇవి 122 కి.మీ ఎత్తు నుండి జాలువారతాయి. ఈ జలపాతాల దగ్గరలో వీరభద్రుడి గుడి ఉంది. ఇది విజయనగర కాలం నాటిది. దేవాలయ ప్రవేశంలో ఏనుగుల విగ్రహాలు అందంగా కనిపిస్తాయి.
శాంతి జలపాతం: అందమైన ఒక లోయ, దానికి ఇరుపక్కలా కొండలు, పడమటి కనుమల మైదానాలు కనపడతాయి. ఏమాత్రం అవకాశం ఉన్నా..సీజన్‌తో సంబంధం లేకుండా ఈ ప్రాంతాలన్నీ చూసిరావచ్చు. వర్షాకాలం కంటే వేసవి, శీతాకాలాలు ఈ ప్రాంతంలో ప్రయాణిస్తే ఆహ్లాదంగా ఉంటుంది.
Authorization