గ్రేటర్ హైదరాబాద్‌లో దాదాపు రూ. 2.51 కోట్ల వ్యయంతో మీర్ ఆలం ట్యాంక్‌కు చింతల్మెట్ వైపు సర్వాంగ సుందరంగా రూపొందించిన మీర్ ఆలం పార్కు నెహ్రు జూలాజికల్ పార్క్‌కి అత్యంత సమీపంలో ఉంది. పాతబస్తీలో ఇమ్లీబన్ పార్కు అనంతరం రెండో అతిపెద్ద పార్కుగా దీనిని నిర్మించారు.
హైదరాబాద్ రాష్ట్రానికి అప్పటి ప్రధాన మంత్రిగా వ్యవహరించిన మీర్ ఆలం బహదూర్ చేత 1804లో ఈ సరస్సు నిర్మించబడింది. హైదరాబాద్ మూడవ నిజాం అయిన మీర్ అక్బర్ అలీ ఖాన్ సికందర్ జాహ్ ఆసిఫ్ జాహ్ హయాంలో అతని చేత ఈ సరస్సు నిర్మాణమయింది.
చార్మినార్ జోన్లో రెండో అతిపెద్ద పార్కు
చార్మినార్ జోన్లో ఇమ్లీబన్ పార్కు తర్వాత మీర్ ఆలం పార్కు రెండో అతిపెద్ద పార్కుగా నిర్మించబడింది. 6.5 ఎకరాల విస్తీర్ణంలో రూపొందించిన ఈ పార్కులో అర్బన్ బయోడైవర్సిటీ విభాగం ద్వారా లైటింగ్, దక్కన్ శైలి పెయింటింగ్‌లు, ఓపెన్ జిమ్, పిల్లల ఆట వస్తువులు, ఫౌంటెన్లు, మినీ సైన్స్ పార్కు, దక్కన్ శైలి శిల్పాలను, చిత్రాలను ఏర్పాటు చేశారు. పార్కు ప్రవేశ ద్వారంలోనే అందమైన శిల్పాలు, చిత్రాలతో కూడిన ఎంట్రీ ప్లాజా ప్రతిఒక్కరిని ఆకట్టుకునేవిధంగా ఉంది.
వాకింగ్ ట్రాక్
ఈ చెరువులో 6.8 కిలోమీటర్ల వాకింగ్ ట్రాక్‌ను 8మీటర్ల వెడల్పుతో ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. పచ్చీసు, చెస్ క్రీడల నమూనాలు ఈ మీర్ ఆలం ట్యాంక్‌లో చిన్నపిల్లల కోసం ప్రత్యేకంగా ఆట వస్తువులు ఏర్పాటు చేయడంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో అత్యంత ఆదరణ ఉన్న పచ్చీసు ఆట మాదిరి, చెస్ ఆట మాదిరి నమూనాలను ఈ పార్కులో రూపొందించారు. పంచతత్వ వాకింగ్ ట్రాక్ మరో ఆకర్షణీయంగా ఉంది. మీర్ ఆలం ట్యాంక్ జూపార్కు వైపు ఉన్న ప్రధాన గేట్ వద్ద పెద్ద ఎత్తున పేరుకుపోయిన నిర్మాణ వ్యర్థాలు, చెత్తను పూర్తిగా తొలగించి పార్కు చుట్టూ మొక్కలు నాటడంతో పాటు పార్కులో ప్రత్యేకంగా ఓపెన్ జిమ్‌ను కూడా ఏర్పాటు చేశారు. జీహెచ్ఎంసీ లేక్స్ విభాగం ద్వారా మిరాలం చెరువు కట్ట పటిష్టత, పెన్సింగ్ ఏర్పాటు, పాత్-వే, లైటింగ్, గ్రీనరి, బ్యూటిఫికేషన్ పనులను చేపట్టారు.
ఈ అందమైన పార్కును వీలు చూసుకొని మీరూ ఓసారి వీక్షించి రండి.
Authorization