సెంటోసా అనేది సింగపూర్‌లోని ఓ ఎంటర్టెయిన్మెంట్ పార్కు. సింగపూర్‌లో ఉన్న పెద్ద దీవులలో సెంటోసా కూడా ఒకటి. మీరెక్కడైనా నీళ్ళు డ్యాన్స్ చేయడం చూశారా? నీళ్ళు ఆకాశం నుంచి వానగా కురవడం తెలుసు, కోపం వచ్చినప్పుడు సునామీలా ముంచెత్తడం తెలుసు, బాధ కలిగినప్పుడు సముద్రాల్లో సుళ్ళు తిరగడం తెలుసు. సరదాగా కొండల మీద నుంచి జలపాతాల్లా హైజంప్ చేయడం తెలుసు. కానీ డ్యాన్స్ చేయడం ఏమిటీ అనుకుంటున్నారా! స్కూళ్ళలో స్టేజిపై రంగురంగుల లైట్ల చక్రం తిరుగుతుంటే పిల్లలు మ్యూజిక్కు అనుగుణంగా స్టెప్పులేసినట్టు ఇక్కడ నీళ్ళు స్టెప్పులేస్తాయి. పిల్లలైతే బాగా ఎంజారు చేస్తారు. అది ఎక్కడుందో దాని వివరాలేంటో ఈ రోజు తెలుసుకుందాం!
సెంటోసా ఒక ఎంటర్ టైన్ మెంట్ పార్కు అని తెలుసుకున్నాం కదా! ఇందులో అండర్ వాటర్ వరల్డ్, మెర్లియాన్ ఇమేజి, హెర్బల్ పార్కు ఫ్లవర్స్ క్లాక్, డాల్ఫిన్స్ లాగూన్, బటర్ ఫ్లై అండ్ ఇన్ సెక్ట్స్ పార్కు మ్యూజికల్ ఫౌంటెన్ మొదలైనవి ఉన్నాయి. మీరు ఎదురు చూస్తున్న మ్యూజికల్ ఫౌంటెన్ గురించి మొదట చెప్పి, మిగతా వాటిని తరువాత వివరిస్తాను. మైసూరులోని మ్యూజికల్ ఫౌంటెన్ కన్నా, హైదరాబాద్‌లోని లేజర్ షో కన్నా వందరెట్లు అందంగా అద్భుతంగా ఉందిక్కడ.
డాన్స్ చేసే నీళ్ళు
మధ్యలో నీళ్ళు, చుట్టూ వీక్షకులు కూర్చోవడానికి కుర్చీలు వేలసంఖ్యలో ఉన్నాయి. మ్యూజిక్ బీట్లకు అనుగుణంగా నీళ్ళు పైకి చిమ్మడం, ఆ నీళ్ళు వివిధ వర్ణాల్లో కనువిందు చేయడం, ఆ వర్ణాల్లోనే బొమ్మల ఆకారాలు కన్పించడం, అవి డాన్స్ చేయడం కనిపిస్తాయి. ఈ ఫౌంటెన్‌కు బ్యాక్ గ్రౌండ్లో 'మెర్లియాన్' కనిపిస్తుంటుంది. మెర్లియాన్ అంటే తలభాగం సింహంలాగానూ, తోక భాగం చేప ఆకారంలోనూ ఉంటుంది. దాని కళ్ళలోంచి ఎరుపు, పసుపు, నీలం మొదలైన రంగుల్లో లైట్ల ఫోకస్ వస్తుంటుంది. ఈ లైట్ల ఫోకస్ నీళ్ళ మీద మన మీద పడుతూ పబ్ ల్లోని డాన్స్ ఫ్లోర్లను గుర్తుకు తెస్తుంది. నీళ్ళు పైకి ఎగచిమ్మడం అనేది వివిధ రకాల ధీమ్స్తో తయారు చేశారు. సినిమాల్లో హీరో హీరోయిన్లు పాటలు పాడుతూ నర్తించినట్లుగా అన్పిస్తుంది మనకు. ఆ నీళ్ళు పైకీ కిందకూ పక్కలకూ అలల్లా వంకర్లుగా కదులుతూ ఉంటే పక్క పక్కన ఉండే రెండు నీటి గొట్టాల నుండి వెలువడే నీరు వేరు వేరు ఎత్తులతో ఉండడం, తక్కువ ఎత్తులో ఉన్నది వంకులతో తిరగడం వల్ల, అవి రెండూ అమ్మాయీ అబ్బాయీలా వంకర్లు తిరుగుతూ ఉన్నది. నిలువుగా, వంపులుగా, అడ్డంగా, అలల్లా ఇలా రకరకాలుగా నీళ్ళు కదుల్తూ ఉంటే చేతులూ కాళ్ళూ కదిలిస్తూ నృత్యం చేసినట్లు అనిపిస్తుంది. ఎంతో సుందరమైన అతి మనోహరమైన ఈ దృశ్యం చూసి ఆనందించడమే తప్ప ఎలా వర్ణించాలో అర్థం కాదు.
అండర్ వాటర్ వరల్డ్
ఇప్పుడు అండర్ వాటర్ వరల్డ్ గురించి తెలుసుకుందాం. ఇదొక సొరంగంలా ఉండి చుట్టూరా అద్దాలు ఉంటాయి. నెత్తిమీద, కాళ్ళ కింద కూడా అద్దాలు ఉంటాయి. అద్దాల వెనక నీళ్ళు, ఆ నీళ్ళలో రకరకాల చేపలు ఉంటాయి. షార్కులు, రే చేపలు, జెల్లీ ఫిష్‌లు, సీహార్సులు, విద్యుత్ చేపలు మొదలైన అరుదైన వాటిని చూశామిక్కడ. మధ్య మధ్యలో భూమి ఏర్పడ్డ విధానం, శిలాజాలు ఎలా ఏర్పడ్డాయి? డైనోసార్లు రాజ్యమేలిన జురాసిక్ యుగం గురించి, ఆర్కియాప్టెరిక్స్ లాంటి సజీవ శిలాజాల గురించీ ఎన్నో విషయాలు రాసి ఉన్నాయి. కొన్ని కోట్ల సంవత్సరాలకు పూర్వం పెద్ద విస్ఫోటనం జరిగి ఈ భూగోళం ఏర్పడింది. అప్పుడు ఇది మండుతున్న వాయుగోళం. అది క్రమంగా చల్లారి నీటి ఆవిరి ద్రవరూపంలోకి మారి సముద్రాలు ఏర్పడి, ఆ తరువాత ఈ నీటిలో నుంచి జీవజాలం ఆవిర్భవించింది. ఇవన్నీ చదివి, ఈ సముద్ర జీవుల్ని చూస్తుంటే నేను బీయస్సీలో చదువుకున్న జువాలజీ పాఠం మొత్తం కళ్ళముందున్నట్లనిపించింది. ఇవన్నీ చదువుకునేటప్పుడే చూసి ఉంటే పరీక్షల్లో ఇంకా ఎక్కువ మార్కులు వచ్చి ఉండేవేమో!
ఫ్లవర్స్ క్లాక్
ఉప్పునీటి మడుగులో డాల్ఫిన్లు ఆడే ఆటలు ఎంతో సరదాగా ఉంటాయి. బాల్ విసిరేస్తే పరిగెత్తుకుంటూ వెళ్ళి మూతి మీద పెట్టుకొని తీసుకురావటం, చప్పట్లు కొట్టడం వంటి పనులన్నీ చేస్తాయి డాల్ఫిన్లు. హెర్బల్ పార్కులో మెడిసినల్ ప్లాంట్స్ దర్శనమిస్తాయి. బటర్ ఫ్లై అండ్ ఇన్ సెఫ్ట్ పార్కులో ప్రపంచంలో ఎన్ని రకాల సీతాకోక చిలుకలు, కీటకాలు ఉన్నాయో తెలుసుకుంటే చాలా ఆశ్చర్యమేస్తుంది. ''ప్లవర్స్ క్లాక్''లో పువ్వులతో తయారైన గడియారం ఉంటుంది. వీటన్నింటి మధ్యలో రెస్టారెంట్లు ఉన్నాయి. ఒకచోటు నుండి మరొక చోటుకు వెళ్ళడానికి బస్సులు ఎక్కి వెళ్ళాలి. అంటే వీటి మధ్య అంతదూరం ఉంటుందన్న మాట. బస్సులు ఎక్కేదగ్గర ఇనుపకడ్డీలతో లైన్లు కట్టి ఉంటాయి. బస్సెక్కాలంటే అందరూ లైనులో వెళ్ళవలసిందే. మేము ఒకచోట క్యూలో నిలబడి ఉన్నప్పుడు మా పక్కనున్నతను 'ఇదే ఇండియాలో అయితే వీటి కింద నుంచి నుంచి గెంతో ఎప్పుడో దాటేవాళ్ళు, క్యూలో మాత్రం ఉండేవాళ్ళు కాదు' అని హిందీలో ఆ పక్కనున్నతనితో అంటున్నాడు. 'మీరు ఇండియా నుంచి వచ్చారా.. మేమడిగితే 'లేదు నేను నేపాల్ నుంచి వచ్చాను. ఇండియా చాలా సార్లు చూశాను' అన్నాడు. మన డిసిప్లిన్ గురించి బయటివాళ్ళు ఇలా మాట్లాడుకుంటున్నారా! అని చాలా బాధనిపించింది.
4డీ మ్యాజిక్స్
ఇది చాలా సరదాగానూ, గమ్మత్తుగానూ ఉంటుంది. మామూలుగా చాలా చోట్ల కనిపించే 3డి సినిమాలానే ఉంటుందిలే. దీన్ని చూడ్డం ఎందుకు? అనుకుంటూ లోపలికి వెళ్ళాం. అయితే ఇది మిగిలిన వాటన్నింటికీ చాలా భిన్నంగా ఉంది. చల్లని పిల్లగాలి మన శరీరానికి తాకుతూ మనమే ప్రయాణం చేస్తున్న అనుభూతి కలిగింది. అద్దాల కింద కొన్ని వందల పురుగులు పారాడుతూ ఉంటే మన సీట్ల కింద నుంచి గాలి వస్తూ మన కాళ్ళ కిందే పురుగులు పారాడు తున్నట్లనిపించి. అందరూ కాళ్ళు సీట్లపై పెట్టుకున్నారు. సినిమాలో వర్షం వచ్చి వాళ్ళు తడిసిపోతుంటే పై నుంచి నీటి తుంపరలు పడుతూ ధియేటర్లో ఉన్న వాళ్ళంతా తడిసి పోయాం. తెరపై కందిరీగలు ఒక్కసారిగా ముసురుకుంటూ మీద మీదకు వస్తుంటే, 'ష్ష్' అంటూ చేతులతో తోలని వారు లేరు. సినిమాలో కత్తులతో పొడుచుకుంటూ కత్తుల్ని కళ్ళ దగ్గరగా పెడితే, మన కళ్ళలోకి దిగబడుతున్నట్లే అనిపించి అందరూ తలలు పక్కకి తిప్పుకున్నారు. సీట్లు ఎగిరిపడటం, సీట్ల కింద పక్కల నుంచి గాలి వచ్చేలా ఏర్పాట్లు, సీట్ల కింద భాగం ఊగటం ఇలాంటి అరేంజ్ మెంట్స్‌తో పాటు సౌండ్ ఎఫెక్ట్‌తో నిజంగా మనమే సినిమాలో నటిస్తున్నట్లని పించింది.
- డా|| కందేపి రాణీప్రసాద్
9866160378
Authorization