జూలై,14వ తేదీ రాత్రి ఒంటి గంటలకు ధారు ఎయిర్ లైన్స్ వారి విమానాన్ని రాజీవ్‌గాంధీ ఎయిర్‌పోర్టులో ఎక్కాం. డాక్టర్ల కుటుంబాలన్నీ సమూహంగా విహారం చేయాలనుకున్నాయి. మే, జూన్ నెలల్లో అందరి ఇళ్ళల్లోనూ పరీక్షల వేడి, బయట సూర్యతాపాన్ని తప్పించుకున్న తర్వాత కొంత రిలాక్సేషన్ అవసరమనిపించి అందరం ధారులాండ్ను ఎంచుకున్నాం. ఎండల బారిన పడి డీలాపడిన శరీరాలకు, పరీక్షల ఒత్తిళ్ళలో డీప్ ఫ్రై అయిన మెదళ్ళకు ఉల్లాసాన్నిచ్చే వాటర్ స్పోర్ట్స్‌ను సెలక్ట్ చేసుకున్నాం. మేము ఇంతకు మునుపు ఒకసారి ధారులాండ్ వెళ్ళి ఫెకెట్, ఫిఫి దీవులను చూసి ఉండటంతో ఈసారి పట్టాయా నగరాన్ని చూడాలని నిశ్చయించుకున్నాం. అలా నలభైమంది డాక్టర్లు బయలు దేరి బ్యాంకాక్ చేరే సరికి ఉదయం ఆరుగంటలైంది. లగేజీలు తీసుకోవడం, ఇమ్మిగ్రేషన్ అన్నీ పూర్తయినాక ఒక ఎసి కోచ్‌లో బ్యాంకాక్ నుంచి పట్టాయా బయల్దేరాం. ఇక్కడ నుంచి సుమారు రెండు గంటల ప్రయాణం పట్టాయా నగరం.
రిసార్టుల నగరం
పట్టాయా బ్యాంకాక్ నుంచి 100 కి.మీ.ల దూరంలో ఉన్నది. పట్టాయాను రిసార్టుల నగరం అని పిలుస్తారు. పది మిలియన్ల జనాభా కలిగిన ప్రాంతం. పట్టయా స్వయం పరిపాలన కలిగిన మున్సిపాలిటీ. ఇక్కడి మేయర్ సొంటాయా కున్ప్లోమ్. దీని వైశాల్యం 22.2km2 కలిగి ఉంది. ఒకప్పుడు ఇది కేవలం చేపలు పట్టే పట్టణంగానే ఉండేది. ఆ తర్వాత వాకింగ్స్ట్రీట్లో వరసగా బార్లు వెలిశాయి. వియత్నాం యుద్ధం తర్వాత అమెరికన్ మిలిటరీ క్యాంపులు ఏర్పాటు చేయడంతో రాకపోకలు మొదలయ్యాయి. పట్టాయా నగరాన్ని చుట్టుకుని ఉన్న సముద్రాన్ని 'గల్ఫ్ ఆఫ్ ధారులాండ్' అంటారు. దీన్నే 'గల్ఫ్ ఆఫ్ సియామ్' అని కూడా అంటారు. ఇది దక్షిణ చైనా సముద్రంలోని ఒక నీటిపాయ. పసిఫిక్ మహాసముద్రం యొక్క పశ్చిమ ప్రాంతానికి ఆనుకుని ఉండేదే దక్షిణ చైనా సముద్రం. గల్ఫ్ ఆఫ్ ధారులాండ్ 800 కి.మీ వెడల్పుతో ధారులాండ్ దేశాన్ని ఆవరించుకొని, కంబోడియాను, వియత్నాంను ఉత్తర దిశగా తాకుతూ ఉంటుంది.
నూంగ్ నూచ్ వీలేజ్
పట్టాయాలో నేను చూసిన అన్ని ప్రదేశాల్లోకీ అత్యంత సుందరం, కడు రమణీయం, సంభ్రమాశ్చర్యాలకు లోను చేసింది నూంగ్ నూచ్ వీలేజ్. అనటానికి బొటానికల్ గార్డెనే కానీ ఇందులో ఉన్న జంతు సంపద 'జూ' అనిపించేలా ఉన్నది. జూలో అయితే ప్రాణం ఉన్న జంతువులు కని పిస్తాయి. ఇక్కడ ప్రాణ ప్రతిష్ఠ చేయబడ్డ జంతువుల ప్రతిరూపాలు కని పిస్తాయి. ఆ జంతువుల రూపాలూ ఊరికే శిలలా నిలబడవు. రకరకాల హావభావాలు ప్రదర్శిస్తూ ఉంటాయి. గార్డెన్ మొదట్లోనే మంకీ గార్డెన్ ఉన్నది. ఇందులో కోతులు, చింపాంజీలు, ఉరాంగ్ ఉటాన్‌లు, గొరిల్లా వంటి వన్నీ నాలుగు బయట పెట్టి వెక్కిరిస్తూ, పళ్ళికిలిస్తూ, ముద్దులు పెడుతూ రకరకాల చిలిపి ఫోజుల్లో కోతి చేష్టలు అనే పదాన్ని అర్థవంతంగా నిర్వచిస్తున్నాయి.
కాక్టస్ గార్డెన్
కాక్టస్ గార్డెన్‌ను చూస్తే మతిపోయింది. బ్రహ్మాజెముడు, నాగజెముడు అంటూ ఎవరూ తిరగని ఎడారి ప్రాంతాలలో మొలిచే ముళ్ళచెట్లకు ఇంత పెద్ద పీట వేయడం ఎంతో బాగుంది. వాటికి ముళ్ళే ఉంటాయని తెలుసు గానీ పువ్వులు పూస్తాయనీ, అందులోనూ మంచి వర్ణాలలో సున్నితమైన రెక్కలున్న పూవులు పూస్తాయని తెలుసా? చుట్టూ వాడి యైన ముళ్ళ మధ్య అతి సున్నితమైన పువ్వుల్ని చూస్తే, అందమైన రాజకుమారి ఆయుధాలు ధరించిన సైనినకుల పటిష్ట భద్రత మధ్య ఉన్నట్లుగా అనిపించింది. బాతులు, కొంగలు, ఫ్లెమింగోలు, నెమళ్ళు వంటి పక్షులు, డ్రాకో వంటి ఎగిరే బల్లులు, జురాసిక్ యుగాన్ని రాజ్యమేలిన డైనోసార్లు, రైనోసిరాస్ వంటి పెద్ద మృగాలు, మొసళ్ళు, తిమింగలాల వంటి నీటి జంతువులు, డాల్ఫిన్లు, పెంగ్విన్లు ఒకటేమిటి సమస్త అడవి అక్కడే ఉన్నది. సృష్టిలో ఉన్న ప్రతి జంతువునూ అక్కడే ప్రతిష్ఠించారు. డైనోసార్ గార్డెన్‌లోకి ఒంటరిగా వెళితే భయపడటం ఖాయం. కొండలు, గడ్డితో సమా సహజమైన వాతావరనంలో వాటిని ప్రతిష్టించారు. ఈ నూంగ్ నూచ్ విలేజ్‌లో ఒక పులిని పడుకోబెట్టి మనల్ని దాని పక్కన కూర్చోబెట్టి పొటోలు తీస్తున్నారు. మేం కిందటి సారి వెళ్ళినపుడు చిన్న పులి పిల్లకు పాలు తాగించాము. కానీ ఈ సారి ఇది చాలా పెద్ద పులి. మనకు ఫొటోలు తీసుకోవడం సరాగానే ఉంది కానీ పులిని చూస్తేనే జాలలనిపించింది. ఎక్కడో అడవిలో దర్జాగా నివసించాల్సిన పులి ఇలా ఇంత మంది మనుష్యుల మధ్య జోకర్లా ఫొటోలకు ఫోజులిస్తున్నది.
వాటర్‌స్పోర్ట్స్
పట్టాయా వాటర్‌స్పోర్ట్స్‌కు ప్రసిద్ధి అనుకున్నాం కదా! మేం లాంగ్ బీచ్ హౌటల్లో టిఫిన్లు చేశాక కోరల్ ఐలాండ్‌కు వెళ్ళాం. అక్కడ చాలా మంది పారా సెయిలింగ్ చేస్తున్నారు. ఒక ప్యారాచ్యూట్కు మనల్ని కట్టేసి ఆ తాడును ఒక పడవకు కడతారు. పడవ నీళ్ళలో ఒక రౌండు తిరుగుతుంది. దానితో పాటు మనం ఆకాశంలో సముద్రపు నీళ్ళపై ఎగురుతూ తిరుగుతాం. అందరూ పారాసెయిలింగ్ అద్భుతమని అన్నారు. ఇంకొకటి 'బనానా బోట్' అని అరటిపండు ఆకారంలో ఉండి దాని మీద ముగ్గురు, నలుగుర్ని ఎక్కించుకుని నీళ్ళలో తిప్పుతారు. దాని మీద కూర్చోలేక అందరూ పడిపోతూ లేస్తూ సరదా పడ్డారు. వీటన్నింటి కన్నా కష్టమైనది, అత్యంత థ్రిల్లింగ్ కలిగించినది ఏంటంటే ''అండర్ సీ వాక్''. సముద్రపు నీళ్ళలో అడుగు భాగానికి తీసుకెళ్ళి నడవటం. అక్కడ ఉండే చేపలకు ఆహారం పెట్టడం. మన చేతిలో బ్రెడ్ ముక్కని పెట్టుకొని ఉంటే బోలెడు చేపలు చుట్టుముట్టి మన చేయి కనబడకుండా మూగి బ్రెడ్డు ముక్కను తినేస్తాయి. మా అబ్బాయి 'అండర్ సీ వాక్'కు వెళ్ళి అద్భుతమైన అనుభవం అన్నాడు. ఇలా ఎన్నో రకాల నీళ్ళ ఆటలు ఆడించారు. కోరల్ ఐలాండ్ దాకా మేము స్పీడ్ బోటులో వెళ్ళాము. కార్వేల్లో పాల్గొనే వాటిలో కూర్చుంటే ఎలా ఉంటుందో అలా అనిపించింది. ఎటు ఒరిగిపోతుందో ఎటు పడిపోతామో అన్నట్లుగా సీటు పట్టుకొని, గుండె పట్టుకునీ కూర్చున్నట్లుంది. ఇక్కడెక్కడా ఫొటోలు తీసే ప్రశాంత వాతావరణం కన్పించ లేదు. భయానక ప్రయాణం తప్ప.
అల్ కజార్ షో
'అల్ కజార్ షో' (Alchazar show)అని ఒక ప్రదర్శన చూశాము. ఇది గంటన్నర షో. అందమైన అమ్మాయిలు మంచి రంగుల కాంబినేషన్‌తో దేవతా వస్త్రాల్లా ధరించి వాటికి తగినట్లుగా బంగారు రంగు ఆభరణాలతో అందంగా ఉన్నారు. రష్యన్, జననీస్ సంగీతాలతో అమ్మాయిల అభినయాలు మతి పోగొడుతున్నాయి. వీనుల విందైన సంగీతం, ఆకర్షణీయమైన దుస్తులు, ఆభరణాలతో అమ్మాయిల డాన్సులు అందరి మనసుల్ని కొల్లగొడుతున్నాయి. చెవులు, కళ్ళూ, మనసూ ఏక కాలంలో రంజిల్లుతున్నాయనిపించింది. తీరా ప్రదర్శన అయ్యాక తెలిసిన విషయమేమిటంటేవాళ్లంతా 'ట్రాన్స్ జెండర్స్' అని వాళ్ళలో ఎంత ప్రతిభ దాగి ఉందో అని ఆశ్చర్యమనిపించింది. ఇలాంటిదే మరొక షో అదే మంటే 'ధారు కల్చరల్ షో'. సంప్రదాయ ధారు నృత్యమట. ఇది కూడా చాలా అద్భుతంగా ఉన్నది. పెద్ద పెద్ద బంగారు కిరీటాలు, బంగారు తాపడాల రెక్కలు, కనువిందైన దుస్తులు చాలా ఆహ్లాదాన్నిచ్చాయి. కోటలు, కొండలు, కోనలు, రాజ్యాలు, జైళ్ళు, యుద్దాలు, ఫిరంగులు పేలుళ్ళు, సైనికుల కవాతు, దండోరా మోగించటాలు, ప్రకృతి, విరబూసినవనాలు, గుర్రాలపై వెళ్ళే రాజులు, సిపాయిలు ఒకటేమిటి సినిమాలో ఎన్ని చూపిస్తారో ప్రత్యక్ష్యంగా అన్నీ చూపించారు. రక రకాల భారీ సెట్టింగులు పై నుంచి కిందికి దిగుతూ, నేలలో నుంచి నృత్యం చేస్తూ పైకొచ్చే అస్పరసలు ఎంతో అద్భుతమైన ప్రతిభ, వసతులు కలిగిన థియేటర్లు.
ఎలిఫెంట్ షో
మరొక షో 'ఎలిఫెంట్ షో'. ఇప్పటి వరకు చూసిన షోలు భారీ థియేటర్లలో జరిగితే ఇది ఒక మామూలు కుస్తీ పోటీల ఆడిటోరియమ్లా ఉన్నది. ఇక్కడ ఏనుగులు బాల్ ఆట ఆడటం, ప్రేక్షకులను ఆశీర్వదించటం, బొమ్మలు వేయడం వంటి రకరకాల ఫీట్లు చేయించారు. రంగులో ముంచిన బ్రష్ తొండానికి అందిస్తే నాలుగు గీతలు గీసింది ఒక ఏనుగు. తరువాత స్పాంటిని రంగుల్లో ముంచి ఇస్తే సరిగ్గా కొమ్మల మీద పువ్వుల్లా అద్దింది. తీరా చూస్తే పూలు పూసిన చెట్టు బొమ్మ అయింది. దీన్ని ఒక షర్టు మీద వేయించారు. ఆ షర్టును అక్కడే వేలం వేసి అమ్మేశారు. గ్రూపులో చిన్న గున్న ఏనుగులు చాలా ఉన్నాయి. అన్నీ ఏనుగులకూ పసుపురంగు బట్టలు వేశారు. ఈ గున్న ఏనుగులకు భలే ట్రైనింగ్ ఇచ్చారు. అవి అన్నీ ఒక దాని తోక ఒకటి తొండంతో పట్టుకొని పరుగెత్తుకుంటూ లోపలికి వచ్చాయి. ట్రైనర్ చెప్పినప్పుడు ఒక కాఆలు ఎత్తడం, తల ఊపుతూ కాళ్ళు కదపడం, ఎవరైనా దగ్గరకు వస్తే ఆశీర్వదించడం చేయాలి. కానీ ఇది చిన్నది కదా. అందులోనూ చిలిపింది. ట్రైనర్ చెప్పక ముందే డ్యాన్స్ చేసేస్తోంది. గేటు దాటి మరీ ప్రేక్షకుల దగ్గరకు వచ్చి ఆశీర్వదిస్తోంది. అరటిపండ్లు అందిస్తే త్వరగా తినేస్తోంది. ఎవరూ దగ్గరకు రాకపోతే తొండంతో రారమ్మని పిలుస్తోంది. రమ్మని పిలవగానే అన్నిటికన్నా స్పీడుగా ముందుకు పరిగెడుతున్నది. దాని బాల్యపు చేష్టలు చూసి నాకు చాలా ముచ్చటేసింది. ఏ జీవికైనా బాల్యం అపురూపమే కదా! వాటికీ సహజమైన బాల్యం అందాలి కదా!
Authorization