తెల్లారితే చాలు ఉరుకులు పరుగులు. గంటల కొద్దీ ట్రాఫిక్ తిప్పలు.. ఆఫీసులో సమస్యలు.. ఇంట్లో ఇబ్బందులు.. మానసిక బాధలు.. ఇవన్నీ వదిలి ప్రశాంతంగా ఎక్కడికైనా వెళ్లాలనే కోరిక. అంతలోనే ఖర్చులకు భయపడి విరమణ. అయినా ఏదో పోగొట్టుకుంటున్నామనే వేదన. కాస్త సేదతీరి మనసుని ఆహ్లాదపరుచుకోవాలనే ఆలోచన. ఇది సగటు మనిషి తపన.. వాస్తవమే... యాంత్రిక జీవనానికి అలవాటు పడ్డ ప్రజలకు విశ్రాంతి కావాలంటే ఏదైనా టూర్‌కు వెళ్లాలి మరి. అది ఎక్కడో దూరాన ఉన్న ఊటి, కోడైకెనాల్, వైజాగ్, అరకు వెళ్తేనే దొరుకుతుందనేది పాత మాట. ఇప్పుడు సహజ సిద్ధమైన ప్రకృతి అందాలతో మనల్ని కనువిందు చేసే ప్రాంతం హైదరాబాద్‌కు అతి దగ్గర్లోనే ఉందన్న సంగతి చాలా మందికి తెలియదు.
అదే అనంతగిరి హిల్స్.
ఇటీవల అనంతగిరి పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. అక్కడి పక్షుల కిలకిల రావాలు, దూరం నుంచే హత్తుకునే కొండలు, గలగలా ప్రవహించే సేలయేటిధారలు, పురి విప్పిన నెమళ్ల నాట్యాలు, రమ్మని పిలిచేలా రాతి కట్టడాలు,సేద తీర్చుకొమ్మనే గుహలు ప్రకృతి ప్రేమికుల మనసును నిలువునా దోచేస్తున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే అక్కడ ఉదయించే బాలభానుని, అస్తమించే సూర్యచంద్రుని వాడియైన కిరణాలతో ఆ ప్రాంతం మనల్ని మంత్ర ముగ్ధుల్ని చేస్తోంది. అక్కడికెళ్తే మనసుకెంతో హాయి. హైదరాబాద్‌కి సుమారు 70 కిలో మీటర్ల దూరంలో మనల్ని కనువిందు చేస్తూ తెలంగాణ ఊటీగా పేరుగాంచిన పర్యాటక కేంద్రం అనంతగిరి.
అబ్బుర పరిచే అడవి అందాలు
రంగారెడ్డి జిల్లా వికారాబాద్ నుంచి కేవలం 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న అనంతగిరి క్షేత్రంగా, పర్యాటక కేంద్రంగా విలసిల్లుతోంది. 3,763 ఎకరాల 15 గుంటల విస్తీర్ణంలో విస్తరించిన ఈ అడవి అందాలతో అబ్బుర పరుస్తోంది. ప్రకృతి రమణీయత ఉట్టిపడే ఈ ప్రాంతంలోని కొండలు, అడవి అందాల మధ్య అనంత పద్మనాభస్వామి ఆలయం అందరినీ ఆకర్షిస్తోంది. ప్రకృతి ఒడిలో సేద తీరాలనుకునే వాళ్లు ఇక్కడికి వస్తే శరీరం ఉత్తేజకరంగా మారుతుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఎత్తయిన కొండలు, పచ్చటి హరిత వనాలు, ఇరుకైన లోయలు, అలరించే మయూరాలు, స్వచ్ఛమైన గాలి, సహజ సిద్ధంగా ఏర్పడిన మంచినీటి బుగ్గలు ఇలా ఎన్నో ప్రకృతి అందాలు మనకు ఇక్కడ కనిపిస్తాయి.
అనంత పద్మనాభస్వామి ఆలయం
కేరళలోని అనంత పద్మనాభ స్వామి ఆలయం గురించి మనం వినే ఉంటాం. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రంలో అనంతగిరినే చెప్పుకోవచ్చు. ఆలయ సమీపంలో ప్రాచీనమైన గుండాలు ఉంటాయి. కొన్ని చోట్ల గుహలూ కనిపిస్తాయి. మహావృక్షాలతో నిండిన దట్టమైన అనంతగిరి అభయారణ్యంలోని ఈ ఆలయం ఉంది. సహజసిద్ధంగా ఏర్పడిన రాతి గుహల్లో ఆలయం ఉంటుంది. ఆలయానికి కిలోమీటరున్నర దూరంలో బుగ్గరామ లింగేశ్వర ఆలయం ఉంది. అక్కడ అందమైన జలపాతాన్ని చూసేందుకు ప్రత్యేకంగా వర్షాకాలంలో సందర్శకులు వస్తుంటారు. ఇంకో విషయేమంటే తాండూరు వాసులు ఈ అడవిని దాటుకుంటూ వారి గ్రామాలకు వెళ్తుంటారు. అడవిని అభివృద్ధి చేసేందుకు ఈ ప్రాంతంలోనే 10 ఎకరాల్లో రీ ప్లాంటేషన్ కింద యూకలిప్టస్ చెట్లను ప్రభుత్వం పెంచుతోంది.
వ్యూ పాయింట్
అనంతగిరి కొండల పైన వ్యూ పాయింట్ ఒకటి ఉంది. అక్కడి నుంచి చూస్తే దగ్గర గ్రామాలతో పాటు చుట్టూ ప్రాంతం ఆహ్లాదకరంగా కనిపిస్తుంది. 50 ఏండ్ల కిందట ఉన్న అనంతగిరికి ఇప్పటికీ చాలా వ్యత్యాసం ఉంది. ఒకప్పుడు రాజీవ్ నగర్‌కాలనీ సమీపంలోని రెండు రోడ్ల వద్దనే అడవి జంతువులు దర్శనమిచ్చేవి. జన సంచారం కూడా ఎక్కువగా ఉండేది కాదు. ఒక్కరు వెళ్లలేని పరిస్థితి ఉండేది. కానీ ప్రస్తుతం జనం తాకిడి ఎక్కువైంది. అడవిలో అణువణువు తిరిగే వీలుంది. అందుకే ప్రస్తుతం జంతువులు ఎక్కువగా కనిపించడం లేదు.
ఏడాదికి రెండు జాతరలు
ప్రస్తుతం ఈ అడవిలో సుమారు 100 రకాల పక్షులు ఉన్నాయి. నెమలి, అడవి పంది, కొన్ని రకాల పాములు, కుందేళ్లు మాత్రమే ఉన్నాయి. అటవీశాఖ ఆధ్వర్యంలో జింకలను పెంచుతున్నారు. అనంతగిరిలో ఏడాదిలో రెండు పర్యాయాలు జాతర జరుగుతుంది. కార్తీక మాసంలో పదకొండు రోజుల పాటు పెద్ద ఎత్తున జాతర నిర్వహిస్తారు. ఆషాఢమాసంలో ఐదు రోజుల పాటు జరుగుతుంది. ఈ జాతరకు జిల్లా ప్రజలతో పాటు, హైదరాబాద్, మెదక్, మహబూబ్‌నగర్ జిల్లాల నుంచి అలాగే కర్ణాటక, మహారాష్ట్ర నుంచి పర్యాటకులు అధిక సంఖ్యలో వస్తుంటారు. వారాంతాలలో సుదూర ప్రాంతాల నుంచి కుటుంబ సభ్యులతో వచ్చి అందమైన ప్రకృతి మధ్య ఆనందగా గడపడానికి అనువైన ప్రాంతమిది. ఇక్కడే పుట్టిన మూసీ నది హైదరాబాద్ మీదుగా నల్ల గొండ జిల్లా వాడపల్లి వద్ద కృష్ణానదిలో కలుస్తోంది. అనంతగిరికే మకుటాయమానంగా కనిపించే పద్మనాభ స్వామి ఆలయం దిగువ భాగంలోని ఓ నీటి బుగ్గ నుంచి ముచికుందా నది ప్రవహిస్తోంది.
ఆకర్షణీయం పర్యాటక భవనం
పర్యాటకుల తాకిడిని గమనించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఓ భవనాన్ని నిర్మించింది. రిసెప్షన్ రెస్టారెంట్ పేరుతో ఉన్న ఈ భవనంలో వెజ్, నాన్ వెజ్‌తో పాటు ఇతర ఆహార పదార్థాలు లభిస్తాయి. తందూరి రోటీని ఇక్కడ బాగా ఇష్టపడుతారు. చిన్నారుల కోసం ఈతకొలను, రెస్టారెంట్, పిల్లలు ఆడుకునేందుకు ఆట వస్తువులున్నాయి. సెమినార్ హాల్ అందుబాటులో ఉంది. ఇక్కడ సమావేశాలు జరుపుకుంటే ప్రశాంతంగా ఉంటుంది.
సినిమా షూటింగ్ లకు ప్రసిద్ధి
అనంతగిరిలో సినిమా షూటింగ్ లు బాగా జరుగుతుంటాయి. అందమైన రోడ్డు మలుపులు, రోడ్డుకిరువైపులా అల్లుకున్న వృక్షాలు, కోనేరు దగ్గర ఆహ్లాదకరమైన వాతావరణం ఉండటంతో దర్శకులు చిత్రీకరించేందుకు ఎక్కువగా ఇష్టపడుతుంటారు. సినీ తారలు, కథానాయకులు, దర్శక, నిర్మాతలు హైదరాబాద్‌కు సమీపంలో ఉన్న మంచి ప్రదేశం ఇదేనని ఆసక్తి చూపుతున్నారు. ఈ ప్రాంతాన్ని ఎంచుకుని సినిమాల్లోని సన్నివేశాలను ఇక్కడ చిత్రీకరిస్తున్నారు. పద్మనాభ స్వామి ఆలయం కింది భాగాన ఉన్న మెట్లు చాలా ఆకర్షించే విధంగా ఉంటాయి. చుట్టూ అడవి విస్తరించి అందమైన చెట్లతో ఆకర్షిస్తుంటే ఔరా అనిపిస్తుంది. ఇక్కడున్న కొలను ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది. చాలా మంది విహారయాత్రకు వచ్చి ఇక్కడ ఆనందంగా గడుపుతారు. వారి వెంట తెచ్చుకున్న తినుబండారాలు ఇక్కడే తింటుంటారు.
ఆహ్లాదకరం.. 'దామగుండం'...
అనంతగిరికి వెళ్ళేవారు దామగుండం కూడా చూసి తీరాలి. చుట్టూరా చూడ ముచ్చటైన కొండలు, ఆహ్లాదకరమైన వాతావరణంలో కనువిందు చేసే దామగుండంలో రామలింగేశ్వర ఆలయం ఉంది. ఇక్కడ పర్యాటకుల తాకిడి బాగా ఉంటుంది. శని, ఆదివారాల్లో చాలా మంది విక్‌ఎండ్ ఎంజారు చేసేందుకు వస్తుంటారు. వికారాబాద్ వెళ్లే దారిలో పూడూర్ ఎక్స్‌రోడ్, మండల కేంద్రానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ దామగుండం 400 ఏండ్ల చరిత్ర కలిగి వుంది. ఇక్కడికి పర్యాటకులు ఎక్కువగా ద్విచక్రవాహనాలు, కార్లు, సుమోల్లో వస్తుంటారు. అక్కడ ఉగాది పర్వదినాల్లో జాతర మహోత్సవాలు నిర్వహిస్తారు. ఈ మహోత్సవాలకు వేల సంఖ్యలో భక్తులు విచ్చేసి కోనేటిలో స్నానాలు చేస్తారు. ఇక్కడ టీవీ సీరియల్స్ షూటింగ్‌లు కూడా జరుగుతుంటాయి. ఇక్కడ కొనేరు మండు వేసవిలో సైతం ఎన్నడూ ఎండిపోదు.
సాహసికులకు ట్రెక్కింగ్
మొదటి సారి ట్రెక్కింగ్ అనుభవాన్ని సొంతం చేసుకోవాలనుకునే వారికి అనువైన ప్రదేశం ఇది. ట్రెక్కింగ్‌లో అందమైన ప్రకృతి పర్యాటకుల మనసు దోచుకుంటుంది. అనంతగిరి ప్రాంతంలో ఎన్నో చిన్న చిన్న కొండలు ఉన్నాయి. ఇవి అన్నీ ట్రెక్కింగ్‌లో సందర్శించే అవకాశం కలదు. అనంతగిరి మరీ దట్టమైన అడవి కాకపోవడం వల్ల అడవిలో దారి తప్పి పోయే అవకాశాలు తక్కువ. చాలా మంది ఈ ప్రాంతానికి ట్రెక్కింగ్ కోసమే ప్రత్యేకంగా వస్తారు. అయితే, అడవి లోపలకి వెళ్ళాలని అనుకునే వారు ఒక పెద్ద గ్రూప్‌గా వెళ్తే మంచిది. ఈ అటవీ ప్రాంతంలో రెండు ట్రెక్కింగ్ ట్రైల్స్ ఉన్నాయి. ఒకటి అనంత పద్మనాభ స్వామి టెంపుల్ వద్ద మరొకటి ఈ ఆలయం నుండి అర కిలోమీటరు దూరంలో కెరెల్లి వద్ద ప్రారంభం అవుతుంది. అనంతగిరి హిల్స్‌లో ఉన్న కామ్పింగ్ సైట్‌ని 'డెక్కన్ హిల్స్' అని అంటారు. ఇక్కడ అటవీ ప్రాంతంలో విహారం చాలా బాగుంటుంది.
వీటితో పాటు, పర్యాటకులు ఇక్కడ 'రాక్ క్లైమ్బింగ్', 'బర్మా బ్రిడ్జి', 'స్పైడర్స్ వెబ్', టార్జాన్ స్వింగ్ వంటి ఎన్నో ఆక్టివిటీస్ లో పాల్గొని ఆనందించవచ్చు.
కోటిపల్లి రిజర్వాయర్
నాగసముద్రం లేక్ లేదా కోటిపల్లి రిజర్వాయర్ అనంతగిరి హిల్స్ నుండి దాదాపు 20 కిలోమీటర్ల దూరంలో కోటిపల్లి రిజర్వాయర్ లేదా నాగసముద్రం లేక్ ఉంది. ఈ సరస్సు చాలా పెద్దది. వర్షాకాలంలో ఈ సరస్సు, నీళ్ళు సమృద్దిగా కలిగి ఉండటం వల్ల ఎంతో ఆకట్టుకుంటుంది.
అనంతగిరికి ఇలా వెళ్లాలి..
హైదరాబాద్ మహాత్మాగాంధీ బస్‌స్టేషన్ నుండి ప్రతి అరగంటకు వికారాబాద్ వెళ్లే బస్సులుంటాయి. వాటితో పాటు తాండూరు, కర్ణాటక వెళ్లే సర్వీసులు సైతం అక్కడి నుంచే వెళ్తాయి. రైలు సదుపాయం ఉన్న వాళ్లు వికారాబాద్‌కు రైళ్లో రావచ్చు. ముంబై వెళ్లే ప్రతి రైలు ఈ స్టేషన్లో ఆగుతుంది. బస్టాండ్, రైెల్వే స్టేషన్ పక్కపక్కనే ఉంటాయి. అక్కడి నుంచి అనంతగిరి 6 కిలోమీటర్లు ఉంటుంది. ఆటోలు, జీపుల్లో లేదంటే తాండూరు ధారుర్ వెళ్లే లోకల్ బస్సుల్లో వెళ్లొచ్చు. లేదంటే ప్రత్యేకంగా బైకులు, వాహనాల్లో వెళ్తే ఆనందంగా, సౌకర్యంగానూ ఉంటుంది. వికారాబాద్ నుంచి అనంతగిరికి వెళ్తుంటే రోడ్డు పొడవునా ఇరువైపులా పచ్చని చెట్లతో అలరారుతుంది. అనంతగిరుల్లో శాంతిభద్రతల దృష్ట్యా పోలీస్ ఔట్‌పోస్టును ఏర్పాటు చేశారు. దీంతో పర్యాటకులు స్వేచ్ఛగా ఆనందంగా గడిపే అవకాశం లభించింది. పోలీసులు అడవిలో మొబైల్ వాహనంలో తిరుగుతుంటారు.
Authorization