ఉద్యోగరీత్యా స్విట్జర్లాండ్లోని జ్యూరిక్ నగరానికి రెండుసార్లు వెళ్లాను. ఈ ప్రయాణంలో ఓ సారి స్పెయిన్లోని బార్సిలోనా నగరానికి, మరోసారి పోర్చుగల్లోని లిస్బన్ నగరానికి వెళ్లే అవకాశం దొరికింది. ఈ సందర్భంగా బార్సిలోనా పర్యటనలోని కొన్ని విశేషాలు మీతో.. వివిధ దేశాల్లో మనకు కనిపించే సంస్కృతులు అంతకు ముందు శతాబ్దాలుగ అక్కడ పెరిగి పెనవేసుకు పోయిన విభిన్న సంస్కృతుల పరిణామాలే. అవి విడదీయలేనివిగా కలిసిపోయాయి. వివిధ సంస్కృతులు కొన్నిచోట్ల అలాగే కలిసిపోయాయి. ఆ సమ్మేళనం వెనుక నిప్పుల కొలుములు, సమ్మెట పోట్లు ఉన్నాయి. వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు, గతించిన శతాబ్దాల సంఘర్షణలను నవ సమాజపు పుట్టుకలోని ప్రసవవేదనగా గుర్తిస్తే అది పురోగమనానికి దారిచూపుతుంది.
బార్సిలోనాలో ఎన్నెన్నో విశేషాలున్నా, ఉన్న మూడు రోజుల్లో నన్ను అమితంగా ఆకర్షించినవి ప్రఖ్యాత భవనశిల్పి ఆంటొని గౌడి కట్టడాలు. బార్సిలోనా దగ్గరలో మాంట్సెరాట్ పర్వతశ్రేణులు ఉన్నాయి. ఆంటొని గౌడి ప్రకృతిలోని అందాలు, సహజమైన ఆకారాలతో స్ఫూర్తి పొందిన మహాభవన శిల్పి. ఆయన కట్టడాల్లో ఆ స్ఫూÛర్తి కొట్టొచ్చినట్టు కనబడుతుంది. కొన్ని చోట్ల మనిషి పుర్రెలో కళ్లను పోలిన గవాక్షాలు, కాలి ఎముకలను పోలిన ఆధారాలు కనిపించి వింత గొలుపుతాయి. ఆయన కట్టడాలలో అపూర్వమైనది ''సెగ్రాడా ఫెమీలియ''. సెగ్రాడా ఫెమీలియ ఆంటొని గౌడి ప్రధాన శిల్పిగా దాదాపు 140 సంవత్సరాల కింద మొదలైన కాథలిక్ చర్చి. ఈ భవన నిర్మాణం ఇప్పటికీ పూర్తి కాలేదు. ఇందులో ఉన్న చిత్ర విచిత్రా లెన్నెన్నో! గౌడి మరణించే సమయానికి (1926) ఈ భవనం కేవలం పావు భాగమే పూర్తయ్యింది. ఎన్నెన్నో అంతరాయాలతో గత 140 సంవత్సరాలుగా ఈ భవన నిర్మాణం సాగుతూనే ఉంది. ప్రస్తుతం అంచనాల ప్రకారం ఈ భవన నిర్మాణం 2026లో పూర్తయ్యే అవకాశం ఉంది. సెగ్రాడా ఫెమీలియ భవన నిర్మాణం ఒక ఆంధ్ర మహభారతమైతే, దానికి ఆదికవి నన్నయ లాంటివాడు గౌడి. బార్సెలోనాలో నేను చూసిన మరో రెండు ఆంటొని గౌడి భవనాలలో ఒకటి కాసా బాల్యో, రెండవది కాసా మిల. గౌడి నిర్మించిన భవనాలలో ఊహకందని చిత్ర, విచిత్రాలు మనకు కనిపిస్తాయి. శిల్ప కళ, ప్రకృతి, మత విశ్వాసం ఆయనకు స్ఫూర్తినిచ్చాయి. ఒక మహా కవి రచనలలో తరతరాలకు కొత్త అర్థాలు స్ఫుÛరించినట్లే, గౌడి కట్టడాల్లో మాత్రం కొత్త అర్థాలు స్ఫురిస్తూనే ఉన్నాయి.
మాంట్సెరాట్ పర్వతశ్రేణులు : బార్సెలోనాలో నన్ను ఆకర్షించిన మరో ప్రదేశం మాంట్సెరాట్ పర్వతశ్రేణులు, పరిసర ప్రాంతంలోని శాంటా మరియ చర్చి మొదలైనవి. ఈ పర్వతశ్రేణుల పైకి వెళుతున్నప్పుడే ఎన్నో చోట్ల పర్వతం చిత్ర విచిత్ర ఆకారాలతో వింత గొలుపుతుంది. కొన్ని కోట్ల సంవత్సరాలకింద సముద్రగర్భంలో ఉన్న ఈ ప్రదేశం, భూమి పొరల కదలికతో పైకి తేలి, ఆ తరువాత గాలి, వాన, పోట్లతో వింత వింత రూపాలను సంతరించుకొంది. ఎన్నోచోట్ల పర్వతశ్రేణులు రంపపు అంచులలా, పదునైన అంచులతో కనబడితే, కొన్నిచోట్ల శిలలు మానవాకారాలను, వింత వింత జంతు ఆకారాలను తలపిస్తాయి. ఇంతకు ముందు ప్రస్తావించిన ఆంటొని గౌడి ఈ పర్వతశ్రేణులతో ఎంతగానో ప్రభావితమయ్యాడని చెబుతారు. గౌడి ''నాకు అతి ముఖ్యమైన స్ఫూర్తి ప్రకృతి'' అని తరచుగా చెప్పేవాడు. నిజానికి గౌడి ఈ పర్వతశ్రేణులకు ఒక ఆరాధకుడని చెబుతారు. అక్కడి శాంటా మరియ చర్చి కట్టడాలు కొన్నింటిలో అప్పుడప్పుడే భవనశిల్ప కళని అభ్యసిస్తున్న లేతప్రాయపు ఆంటొని గౌడి చెయ్యికూడా ఉంది.
ఈ పర్వతశ్రేణులను చూడాలనే ఆలోచన ముందుగా నాకు లేదు (నాకున్న వ్యవధి తక్కువ, పైగా బార్సెలోనా నుండి గంటన్నర ప్రయాణం). అక్కడ నాకు పరిచయ మైన ఓ పాకిస్థానీ టాక్సీ డ్రైవర్, ఈ పర్వతశ్రేణులు తప్పకుండా చూడాల్సిన ప్రదేశమని మరీ మరీ చెప్పడంతో వెళ్లాను. వెళ్లకపోయి ఉంటే ఒక అద్భుతమైన ప్రదేశాన్ని చూడలేకపోవడమే కాక, గౌడిలాంటి మహాశిల్పికి ప్రకృతినుండి లభిం చిన స్ఫూర్తిని తెలుసుకునే అవకాశం ఉండేది కాదు. ప్రకృతిలోనే ప్రాణం పోసు కుని, అందులోనే కలిసిపోయే మనిషికి, ఆ ప్రకృతినుంచే చైతన్యానికి అత్యంత ఉత్క ష్టమైన ప్రతీకగా నిలిచే సృజనాత్మకశక్తికి స్ఫూÛర్తి దొరకడంలో ఆశ్చర్యం లేదేమో!
చెడు-మంచి (చౌర్యం-స్నేహం) : ఆ పాకిస్థాని టాక్సీ డ్రైవరుతో నా పరిచయం ఓ చేదు అనుభవంతో మొదలయ్యింది. అతని మంచితనం, సంస్కారం రెండు మూడు రోజుల్లో మమ్ములను స్నేహితులుగా చేసింది. బార్సిలోనా విమానాశ్రయం లో దిగి నా సామాను సర్దుకుని వసతికి (హౌటల్) వెళ్లేలోపే నా పాస్-పోర్ట్, నా ఐడెంటిటీ కార్డుతో సహా అన్ని క్రెడిట్ కార్డులని, నా కోటుతో సహ అక్కడి చోర శిఖామణులెవ్వరో దొంగిలించారు. బార్సిలోనా జేబుదొంగలకి పెట్టింది పేరు. నిజానికి ''బార్సిలోనా ప్రపంచ జేబుదొంగల ముఖ్య పట్టణం అంటారు. ఒక్క క్షణం ఏమరుపాటుగా ఉండడం వల్ల దేశం కాని దేశంలో పాస్-పోర్ట్, ఐడెంటిటీ కార్డు, క్రెడిట్ కార్డ్లు ఏమీ లేని పరిస్థితిలో, నాకు అండగా నిలిచిన ఎంతో మందిలో ఈ ట్యాక్సీ డ్రైవర్ (అహమ్మద్) మొదటి వాడు. డబ్బులు వీలున్న ప్పుడు ఇవ్వమని నన్ను హౌటలుకి, పోలీస్ స్టేషనుకి, పాస్-పోర్ట్ ఆఫీసుకి తీసుకెళ్లడమే కాక, ఊరంతా తిప్పి అందమైన ప్రదేశాలన్నీ చూపించినవాడు తనే.
మంచితనాన్ని చవిచూశాను : దాదాపు నలభై సంవత్సరాల కింద నాతో ఇంజనీరింగ్ చదివిన సహ విద్యార్థుల వాట్సాప్ బంధంలో నా పరిస్థితిని వివరిస్తూ ఒక సందేశం పెట్టడం, వెనువెంటనే అందులో కొందరు దేశ విదేశాలలో ఉన్న తమ మిత్రులకి, వారు తమ మిత్రులకి సందేశాలు పంపడం జరిగింది. నా స్నేహితుడి, స్నేహితుడి, స్నేహితుడొకరు తెల్లవారుతూనే, హౌరున కురుస్తున్న వర్షంలో, నన్ను వెదుక్కుంటూ వచ్చి డబ్బు అందించి వెళ్లడం ఎన్నటికీ మరువలేను. అతనెవరో అప్పటివరకు నాకు గాని, నా స్నేహితుడికి గాని తెలియదు. అది కేవలం సాటి మనిషి ఇబ్బందుల్లో ఉంటే స్పందించిన మానవత్వం. అదే విధంగా, మరో వ్యక్తి మన దేశం కాని, భాష రాని స్పానిష్ దేశస్థుడు నా పేరుతో అత్యవసరంగా డబ్బుని ఏటీవీలో తీసుకునే ఏర్పాటు చేశాడు. ఇక హౌటల్ సిబ్బంది సరే సరి, నా ఫోన్లో ఉన్న క్రేడిట్ కార్డుతో వసతికి సంబంధించిన ఖర్చులే కాక, కొంత నగదును కూడా సర్దుబాటు చేశారు. రాత్రనకా, పగలనకా ఎన్ని సార్లు ఏమడిగినా కాదనకుండా, ఓపికగా సహాయం అందించారు. ఏవరో చేసిన మోసం, ఇంత మంది మంచి మనుషులతో పరిచయానికి, వారి మంచితనాన్ని చవిచూసి మానవత్వం మీద నమ్మకం పెంచుకోవడానికి దోహదపడింది.
- వేణు ఆసూరి
Authorization