జర్మనీ దేశంలో తమకంటూ ఎన్నో ప్రత్యేకతలను సొంతం చేసుకున్న రాజసౌధాలెన్నో ఉన్నాయి. నిర్మాణంలోనే కాదు, చారిత్రాత్మకంగా చోటు చేసుకున్న ఎన్నో ఆసక్తికరమైన సంఘటనలకు సైతం సాక్ష్యంగా నిలిచిన కట్టడాలలో ''ఎల్ట్జ్'' రాజసౌధం సుప్రసిద్ధం. ఒకప్పటి జర్మనీ దేశపు రాజధాని 'బాన్' నగరానికి 90 కి.మీ.ల దూరంలో మొసెల్లే పర్వతాల మీద 1050 అడుగుల ఎత్తులో 'కొబ్లెన్ట్జ్', 'ట్రైయర్' నదుల మధ్య దట్టమైన అడవి ప్రాంతంలో 12వ శతాబ్దంలో నిర్మించిన కట్టడమిది. ఈ పర్వతాల మీద వేసవిలో 12 సెంటీగ్రెడ్ ఉష్ణోగ్రత ఉంటుంది. చలికాలంలో ఈ ఉష్ణోగ్రత మైనస్‌కు చేరుకుంటుంది.
క్రీ.శ. 1157లో దీని నిర్మాణం ప్రారంభమయింది. దాదాపు 15 మిలియన్ యూరోస్ ఖర్చుచేసి నిర్మించారు. దీని నిర్మాణం పూర్తయి 8 శతాబ్దాలు దాటినా ఏమాత్రం చెక్కుచెదరలేదు. 9వ శతాబ్దంలో ఒక చిన్న కట్టడంగా ప్రారంభమైన ఈ రాజసౌధం 12వ శతాబ్దానికి అద్భుతమైన కట్టడంగా రూపుదిద్దుకుంది. ప్రతి అంతస్తులోను విశాలమైన భోజనశాల, అందులో నగిషీలు చెక్కిన డైనింగ్ టేబుల్స్, కుర్చీలు అందంగా అమర్చబడి ఉంటాయి. వంటగదులన్నీ చాలా ఆధునికంగా ఉంటాయి. వంట చేసుకొనే పొయ్యిలలో మంటను నియంత్రించుకొనే పరికరాలు ఉన్నాయి. అల్మారాల్లో ఆహార పదార్థాలను చల్లదనంలో ఉంచుకొనే ఏర్పాట్లు ఆకాలంలోనే ఉన్నాయి. ఎనిమిది అంతస్తుల భవంతిలో 'లిప్ట్' సౌకర్యం ఉండటం ఆశ్చర్యం కలిగించింది.
ఈ రాజసౌధంలో మొత్తం వంద కుటుంబాలు నివసించడానికి అన్ని హంగులతో కూడిన గదులున్నాయి. పిల్లల కోసం, వంట కోసం, సమావేశాల కోసం, వినోదాల కోసం, సందర్శకుల కోసం, పడక కోసం, సేద తీర్చుకోవడం కోసం, సేవకుల కోసం, రాజ దర్భారు కోసం, ఖజాన కోసం, ఆయుధాల భద్రత కోసం, కళాఖండాల అలంకరణ కోసం.. ఇలా ఎన్నో రకాల అవసరాల కోసం తగిన గదులు ఏర్పాట్లు ఈ రాజసౌధంలో చేయబడి ఉన్నాయి. ఇక్కడ ప్రతి గది ఒక అపురూపమైన నిర్మాణమే. ఇప్పటి ఆధునిక నిర్మాణాలకు సవాలుగా ఈ భవనాల శిఖరాలు కనిపిస్తాయి. వివిధ దేశాల నుండి దిగుమతి చేసుకున్న విలువైన కళాత్మక వస్తు సామాగ్రి, వాటి పొందికైన అమరిక, ఆ ప్రణాళిక, ఆ ఆలోచన చెప్పడానికి ఏ భాష చాలదనిపిస్తుంది.
గదులన్నీ విశాలంగా చాలా ఎత్తులో ఉంటాయి. గాలి, వెలుతురు పుష్కలంగా లభిస్తుంది. ప్రతి కిటికీలోంచి విస్తారమైన పచ్చటి ప్రకృతి అందాలు ప్రతినిత్యం పలకరిస్తూనే ఉంటాయి. చల్లగాలులను మోసుకొస్తున్న మేఘాల చుట్టపు చూపుల్లా హాజరవుతూనే ఉంటాయి. తెల్లారడానికి ముందు ఉదయకిరణాలకు స్వాగతం పలుకుతూ పక్షుల కిల, కిలరావాలు వినసొంపుగా వినిపిస్తూ ఉంటాయి. మంచుకాలంలో ముత్యాలన్నీ చెట్లమీదే కాపురముంటాయి. కొండల నిండా పచ్చదనం ఆభరణాల్లా మెరిసిపోతూ ఉంటుంది. ఒళ్లు విరుచుకొని నిద్రలేచే సూర్యుడు, ఆ తరవాత సాయంకాలం అలసిపోయి పడమటి కొండల పరుపుల్లోకి జారుకొనే సంధ్యా సమయపు దృశ్యాలు ఎత్తయిన భవనసముదాయాల నుండి వీక్షించిన రాజకుంటుంబాల భాగ్యం వర్ణింపలేనిది. అన్ని తరగతుల ఉద్యోగులు నివసించడానికి వీలుగా ఎన్నో గదుల సముదాయాలు ఇందులో ఉన్నాయి.
అనేక దేశాల నుండి తెప్పించిన కళాఖండాలు ఇప్పటికీ కళ ఏ మాత్రం తగ్గకుండా తమ సౌందర్యాన్ని ప్రదర్శిస్తూ ఉంటాయి. రాజసౌధంలో మొత్తం 24 గాజు అల్మారాలు స్వాగతం చెప్తున్నాయి. గాజు అల్మారా నెంబరు 6లో ఉన్న 1585లో తయారు చేసిన పాకెట్ వాచ్, 1650 చెందిన ఫిగర్ క్లాక్, 1670లోని అర్నమెంటల్ క్లాక్, 1700లోని టేబుల్ క్లాక్, 1720కి చెందిన డైమండ్స్ క్లాక్ తప్పనిసరిగా చూడవలసిన అపురూపమైన వస్తు సంపదలు. ప్రతి అంతస్తు లోనూ పాలకుల పాలన చిహ్నాల చిత్రాలు కనువిందు చేస్తాయి. 14వ శతాబ్దం నుండి 19వ శతాబ్దం దాకా అప్పటి రాజులు వాడిన వస్తు సంపద అప్పటి రాజుల వైభవోపేతమైన జీవితానికి ఆనవాలుగా నిలుస్తున్నాయి. ముఖ్యంగా 'ఫ్రిన్స్ ఎలెక్టర్ ఫిలిప్స్ కార్ల్, కార్చ్డుకె జోహన్నా' కాలాలలో వాడిన అత్యంత ఆధునిక వస్తుసంపద సమ్మోహితుల్ని చేస్తాయి. ఆయుధ కారాగా రంలో ఏర్పా టు చేసిన రక, రకాల తుపాల వరుసలు దర్శకుల్ని ముందుకు కదలనివ్వవు.
అనేక శతాబ్దాల చరిత్ర కలిగిన ఈ రాజసౌధంలో అడుగడుగున గతించిన చరిత్రకు సంబంధించిన ఆనవాలులు మనల్ని పలకరిస్తాయి, మనతో కరచాలనం చేస్తాయి. మిత్రుల్లా భావించి ఇన్నాళ్లుగా మోస్తున్న విషాదాన్ని కన్నీళ్ల రూపంలో మన అరచేతుల్లో కుమ్మరిస్తాయి. అనేక కుట్రలకు, కుతం త్రాలకు, అనేక యుద్ధ వ్యూహాలకు సాక్షిగా నిలిచిన ఈ భవంతి గత చరిత్రలో జరిగిన అనేక బలవన్మరణాలను సైతం చిరునామగా మిలిగి పోయింది. ఈ రాజసౌధం చరిత్ర ఆధారంగా ఆసక్తికరమైన సినిమాలు వచ్చాయి. గేయనాటికలు వచ్చాయి. ఎన్నో జానపదగీతాలు ప్రచారంలో ఉన్నాయి. సందర్శకులు తప్పనిసరిగా చూడదగ్గ కట్టడాలలో ఈ రాజ సౌధం ఒకటి.
- డా|| కె.జి. వేణు
98480 70084