Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జీవితాశయ సాధనకోసం అడుగులు వేయాల్సిన తరుణం... కొత్త ఆలోచనలు... సరికొత్త ఆశక్తులు మనసును ఆవరించే వయసు.. అది ఒక సరికొత్త ఉత్తేజం. కోరుకున్న బాటలో పయనించాలనేది సాధారణంగా ప్రతి యువకుడికి ఉండే ఆలోచన. కానీ అన్నీ అనుకున్నట్లు జరగవు. జరుగుతున్న పరిణామాలను తన విజయ సోపానాలుగా మలుచుకున్నే వారు కొందరే ఉంటారు. వారే శ్రీశ్రీ చెప్పిన పావన నవజీవన బృదావన నిర్మాతలు. అలాంటి కోవకు చెందిన యువకుడు సంతోష్ నారాయణన్. సినిమా మాధ్యమం ద్వారా యువతరం ఆలోచనలలో మార్పునకు నేను సైతం అంటూ 'కంచు' ఢంకా మోగించి ముందుకు వచ్చిన యువ దర్శకుడి పరిచయమే ఈ వారం జోష్...
మీ నేపథ్యం గురించి చెప్పండి?
మాది వరంగల్. మధ్యతరగతి రైతు కుటుంబం. నాన్న నారాయణ రైతు. అమ్మ వీరమ్మా. ఒక తమ్ముడు, ఒక చెల్లి వున్నారు. నాలుగో తరగతి వరకూ మా ఊర్లో చదువుకున్నాను. తరువాత అంతా హాస్టల్ జీవితమే. స్కూల్లో, ఇంటర్మీడియట్లో టాపర్‌ని. ఇంటర్ లో 950 మర్క్స్ వచ్చాయి. తరువాత గ్రాడ్యుయేషన్ మద్రాస్ ఇన్స్టిట్యూట్ అఫ్ టెక్నాలజీ(MIT-Anna University, chennai). నేను బి.ఈ 3వ సంవత్సరం వరకు సివిల్స్ అనుకున్న అది నా చిన్నపటి నుండి కల... ఢిల్లీ వెళ్ళాలి అని కలలు కన్నాను.
సివిల్స్ వెళ్లకుండా సినీ రంగం వైపు ఎలా వచ్చారు?
ప్రిపరషన్కి ఢిల్లీ వెళ్ళాలి అనుకున్నా. కానీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అవ్వడం వల్ల నాన్న ఒక సంవత్సరం అయ్యాక చూద్దాం అన్నారు. దానితో నేను హైదరాబాద్ వచ్చి అప్పటి వరకూ బ్యాంక్ ఎగ్జామ్స్ రాద్దాం అని అనుకున్నాను. ఇలా ప్రిపేర్ అవుతున్న టైంలో ఎందుకో తెలియదు కానీ 2017 లో సినిమాల పిచ్చి మొదలైంది... అప్పటి నుంచి మూవీస్ సైడ్ ట్రయల్స్ వేయడం మొదలు పెట్టాను. సివిల్స్‌పై మెల్లమెల్లగా ఆసక్తి తగ్గి... సినిమాలపై పెరిగింది. ఎగ్జామ్స్ లేనప్పుడు షార్ట్ ఫిలీం చేయడం ఎగ్జామ్స్ ఉన్నప్పుడు బ్యాంక్ ఎగ్జామ్స్ రాయడం చేస్తున్నాను.
ఏమైనా అవకాశాలు వచ్చాయా?
అంతే అలాంటి ఒక సిట్యుయేషన్ లో 2017 డిసెంబర్ 13 నా అసలైన సినిమా ప్రయాణం మొదలైంది. 'కనబడుటలేదు' మూవీ డైరెక్టర్ బాలరాజు 'ఆచూకీ' అనే సినిమా చేస్తున్నారు. దానికి అసిస్టెంట్ డైరెక్టర్ గా ఛాన్స్ వచ్చింది. దానితో నా మకాం వైజాగ్ కి మారిపోయింది.
ఈ అవకాశాలు రావడంతో ఉద్యోగ ప్రయత్నాలకు స్వస్తి పలికారా?
లేదు. షూటింగ్ లేనప్పుడు బ్యాంక్ ఎగ్జిమ్స్కు చదువుకోవడం. షూటింగ్ ఉన్నప్పుడు షూటింగ్‌కి వెళ్లిపోవడం ఇలా రెండేండ్లు చేశాను. తరువాత ఒక మూడు నెలలు బాగా చదివాను. దానితో ఏకంగా ఒకేసారి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ 5, 6 వచ్చాయి.(RRB ALP, SBI clerk, LIC assistant, RRB PO, RRB clerk, IBPS PO, Railway group-D) కానీ వాటన్నిటిని వదులుకొని సినిమాలు ట్రై చేస్తున్నాను.
ప్రభుత్వ ఉద్యోగాలు రావడమే గగనం అవుతున్న రోజుల్లో మీరు వచ్చిన ఉద్యోగాలను వదిలేశారు. అప్పుడు మీ కుటుంబం సభ్యులు ఎలా స్పందించారు?
ఏ ఫ్యామిలీ అయినా ఫస్ట్ లో సినిమాలు వద్దనే అంటారు. అలాగే మా వాళ్ళు కూడా ఫస్ట్ లో వద్దనే చెప్పారు. జాబ్ కి ప్రిపేర్ అవ్వు సినిమాలు మనకి వద్దు అనేవాళ్ళు. నేను కూడా అలాగే అని వాళ్ళ కోసం జాబ్ ప్రేపరషన్ స్టార్ట్ చేశాను. కానీ వాళ్ళకి తెలియకుండానే ఇటు సినిమా ప్రయత్నాలు కూడా చేశాను. అలా కొంచెం కొంచెం పేరు వస్తుంటే వాళ్ళు కూడా సరే నీ ఇష్టం అని చెప్పేశారు. అంతే కాకుండా చిన్నప్పటి నుంచి ఏదైనా మంచి డెసిషన్ తీసుకుంటాడు అని అమ్మ నాన్నలకి నా మీద వున్న నమ్మకమే వాళ్లు నా నిర్ణయాన్ని కాదనలేకపోయారు. అమ్మ నాన్నల సహకారమే లేకపోతే ఈ రోజు నేను లేను.
ఇటీవల మీరు తీసిన షార్ట్ ఫిలిం 'కంచు' గురించి ?
ఒక అమ్మాయి తాను ప్రేమించిన వ్యక్తితో పెళ్లి అయ్యి వాడి మోజు తీరాక వదిలేసి వెళ్ళిపోతాడు. ఇటు ఫ్యామిలీ దూరం అయ్యి అటు ప్రేమించిన వాడు వదిలేసినా అమ్మాయి ఒంటరిగా బతుకుతు తనకి వచ్చే సవాళ్లు, సెక్సువల్ హర్రస్మెంట్ లని ఎలా ఎదురుకొని ముందుకు సాగింది అనేది కథ.
కంచు short film women empowerment (మహిళా సాధికారత) పై తీశారు. ఈ కథ సమాజంలో జరుగుతున్న పరిస్థితులను గమనిస్తూ తీశారా? లేక ఏదైనా ఒక సంఘటన ఆధారంగా తీశారా?
ఇలాంటివి సమాజంలో చాలా జరుగుతూ ఉంటాయి. వాటి నుంచి కొన్ని తీసుకున్నాను. దిల్ సుఖ్ నగర్ లో ఉంటున్నప్పుడు ఇలాంటి కొన్ని సంఘటనలను బాగా దగ్గర నుండి గమనించాను. వాటి ఆధారంగా తీసిన చిత్రమే కంచు.
మీది మధ్యతరగతి కుటుంబం... షార్ట్ ఫిలింస్ అనేది ఖర్చుతో కూడుకున్నది. అందుకు మీకు ఏవరైనా సహకరించారా?
దానికి ప్రొడ్యూసర్ ఎలా అని థింక్ చేస్తుంటే నా కాలేజీ ఫ్రెండ్స్ ఒకరు జపాన్ లో జాబ్ చేస్తున్నాడు. అతడికి కూడా సినిమా మీద ఆసక్తి ఉండటంతో అతనితో చెప్పాను. ఈ స్టోరీ తనకి కూడా నచ్చడంతో వెంటనే చేసేద్దాం అన్నాడు. తరువాత రవి కిషోర్ అని ఇంకో ప్రొడ్యూసర్ మాతో జాయిన్ అయ్యారు అలా ఆ ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యింది. నాకు ఏది అడిగిన చేసే ప్రొడ్యూసర్స్ మంచివాళ్ళు దొరికారు. అలాగే మంచి టాలెంటెడ్ పర్సన్ మా కెమెరామెన్ శివ చరణ్ సహకారంతో కంచు తీశాను.
మీరు ఇక ముందు తీయబోయే చిత్రాలు సామాజిక కోణంలో ఉంటాయా? లేక లవ్ స్టోరీస్ చేస్తారా?
నాకు లవ్ స్టోరీస్ చేయడం అంటే చాలా ఇష్టం. కాబట్టి నా తరువాతి ప్రాజెక్ట్ కచ్చితంగా లవ్ స్టోరీనే. ఇప్పటికే స్క్రిప్ట్ రెడీ గా ఉంది. 40నిమిషాల నిడివిలో వచ్చేలా కథను సిద్ధం చేసుకున్నాను. లవ్, థ్రిల్లర్ చేయాలని ఉంది. తమిళ హీరో కార్తీ కోసం ఒక మంచి లవ్, థ్రిల్లర్ స్క్రిప్ట్ రాసుకున్నాను. అలాగే మన తెలుగు హీరోల కోసం 4 మంచి కథలు కూడా రాసుకున్నాను.
ఇష్టమైన నటినటులు?
హెబాపటేల్, ప్రభాస్
ఇష్టమైన దర్శకులు?
మణిరత్నం
ఇష్టమైన సంగీత దర్శకులు?
మణిశర్మ, దేవిశ్రీ ప్రసాద్
కొత్తగా ఈ రంగంవైపు వచ్చే వారికి మీ సూచన?
నా సూచన యువతకు కాదు. వారి తల్లిదండ్రులకు... ఎవరైనా సినిమా సైడ్ రావాలి అనుకుంటే వాళ్ళని ఏ పేరెంట్స్ అయినా సపోర్ట్ చేయండి వాళ్ళు కచ్చితంగా ఏదో ఒక రోజు మీ పేరు నిలబెడతారు.''సినిమా ఒక అద్దం లాంటిది అది సమాజాన్ని ప్రతిబింబిస్తుంది''. సో మీ కొడుకో కూతురో సినిమా ద్వారా సమాజానికి తోడు పడతాడు కావున ప్రతి పేరెంట్స్ సపోర్ట్ చేయండి.
అవార్డులు...
కంచు షార్ట్ ఫిలింకు ఆరు అవార్డులు వచ్చాయి.
1. ఉత్తమ సినిమాటోగ్రాఫర్
2. ఉత్తమ నటి
3. ఉత్తమ 3వ షార్ట్ ఫిలిం
4. హనరబుల్ డైరెక్టర్ జ్యూరీ
5. హనరబుల్ యాక్టర్ జ్యూరీ
6. హనరబుల్ ఎడిటర్ జ్యూరీ