Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అప్పుడప్పుడూ
ఈ ప్రపంచాన్ని సైలెంట్లో పెట్టి
నీతో నడిచిన దారుల్ని
నీ చేతిపై రాసిన మాటల్ని
మనసుని తియ్యగ జేసే నీ నవ్వుల్ని
ముందరేసుకుని మురిసిపోతుంటాను
నిండుగా ఎదురున్న బొమ్మల్ని
నిండైన మనసుతో చూసే పిల్లాడిలా
అవును అచ్చం అలానే
అప్పుడప్పుడూ నాకే తెలియకుండా
నువ్వు నా ఆలోచనల్లోకి వస్తావు
నా పెదాలపై అమాయకమైన ఓ నవ్వులా పూస్తావు
మరకల్లేని ఆనందాన్ని నా మనసులో వెలిగించి నన్ను బొంగరంలా తిప్పుతావు
అప్పుడు నన్నీ ప్రపంచం వింతగా చూస్తుంది
నాకీ ప్రపంచమేమో వింతగా కనిపిస్తుంది
అప్పుడప్పుడూ నా రాత్రులు
నీ ఊహల వెలుతురులో కరిగిపోతాయి
ఆకులు రాలిన చెట్టుకి
పువ్వులు పూసినట్టుగా ఉంటాయి నీజ్ఞాపకాలు
అప్పుడప్పుడూ నాలో ఉన్న నీతో మాట్లాడుతుంటాను
నేను నీపై రాసుకున్న కవితల్ని
భుజాలెగరేసుకుంటూ చెబుతుంటాను
కాని ఏంటో నీకు ఒక్కటీ నచ్చదు
అయినా నీ గురించి రాయడానికి
నా అక్షరాలు సరిపోతాయా చెప్పూ?
ఏదో మాటవరసకి అప్పుడప్పుడూ
అంటున్నా కాని
ప్రతి క్షణం నిన్ను నా గుండెల్లో మోస్తూనే ఉన్నాను
ప్రాణానికి ఊపిరి ఎంత ముఖ్యమో
నిన్ను గుండెల్లో దాచుకోవడం
నాకంతే ముఖ్యం
- రవీంద్ర రావెళ్ళ
8790674370