Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అతడు అక్షరాలను ఆప్యాయంగా పలకరించి గుండెలకత్తుకుంటాడు. ఎలాంటి భావాన్ని అయినా అక్షరీకరించి అందమైన పాటగా మలిచి మన మదిలో చెరగని ముద్రవేస్తాడు..! అందుకేనేమో.. ఆయన పాట మనసుకు హాయినిస్తుంది. అందుకేనేమో.. ఆయన పాటల్లోని పదాల పొహళింపు మనల్ని గిలిగింతలు పెట్టిస్తుంది..! ఎదిగిన కొద్ది ఒదిగి ఉండే తత్వాన్ని అలవర్చుకుని ఎంతో మంది అభిమానాన్ని పొందిన కోయిలమ్మ సీరియల్ పాటల రచయిత అతడు. దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు, ప్రసిద్ధ సినీ గేయరచయితలైన సుద్దాల అశోక్ తేజ, చంద్రబోస్‌ల ప్రశంసలు అందుకొన్న గీతాచార్యుడతడు. సినీగేయ రచయితగా దశాబ్దకాలం పూర్తి చేసుకున్న మౌనశ్రీ మల్లిక్
అంతరంగ ఆవిష్కరణ ఈవారం జోష్..
మీ బాల్యం గురించి తెలుపండి?
నేను వరంగల్ రూరల్ జిల్లా వర్ధన్నపేటలో జన్మించాను. నా తల్లిదండ్రులు ఆరెల్లి వెంకటమ్మ, బక్కయ్య. వారికి మేము నలుగురు పిల్లలం. నేను మూడో సంతానం. ఇంటర్మీడియట్ వరకు వర్ధన్నపేటలో, డిగ్రీ వరంగల్‌లోని సీకేఎం కళాశాలలో చదివాను. 1997లో హైదరాబాద్ వచ్చి, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో ఎం.సి.జె పూర్తి చేశాను.
మీ కుటుంబం గురించి చెప్పండి?
నా జీవితకాల సహచర స్వప్న, తాను గొప్ప సామాజిక కార్యకర్త. సమాజాన్ని చదివిన మనిషి. మా అబ్బాయి సజన్ విప్లవ్ ఇప్పుడు పదవ తరగతి.
కవిగా మీ ప్రయాణం ఎప్పుడు మొదలైంది?
కవిగా నా ప్రయాణం చాలా ఆలస్యంగా మొదలైంది. చిన్ననాటి నుండి నాకు కథలు, నవలలు, కవిత్వం చదవడం అలవాటుగా మారిపోయింది. నేను ఒక మంచి పాఠకుడిని. డిగ్రీ చదివేటప్పటి నుండి పత్రికల్లోని వివిధ సాహిత్య శీర్షికల్లో పాల్గొనేవాడిని. నాకు విరివిగా బహుమతులు కూడా వచ్చేవి. ఆ ఉత్సాహంతో చిన్న చిన్న కవితలు రాసేవాడిని. మొదట్లో కథలను నేను బాగా ఇష్టంగా చదివే వాడిని. తర్వాత నవల వైపు దష్టి మళ్ళింది. చలం, మల్లాది వెంకట కష్ణమూర్తి, యండమూరి వీరేంద్రనాథ్ సాహిత్యాన్ని చదివే వాడిని. అప్పట్లో కవిత్వం నాకు అర్థం కాకపోయేది. కవిత్వానుభూతి రహస్యం తెలియడానికి నాకు చాలా కాలం పట్టింది. అర్థం కాకున్నా సరే అలాగే చదువుతూ ఉండేవాడిని. ముఖ్యంగా ప్రముఖ పత్రికలలో వచ్చే కవితలన్నీ చదివేవాడిని. ఆ తర్వాత కవితా సంకలనాలు, సంపుటాలు చదివేవాడిని.
మీకు నచ్చిన కవి, రచయిత, గీత రచయిత, ఎవరు?
నాకు నచ్చిన కవులు సినారె, గోపి, కె.శివారెడ్డి. నా సమకాలీన కవుల్లో నాకు నచ్చిన కవుల లిస్టు చాలా పెద్దగా ఉంటుంది. ఇక రచయితల్లో యండమూరి వీరేంద్రనాథ్ శైలి ఇష్టం. అంపశయ్య నవీన్ కథలు, నవలలు
ప్రత్యేక అనుభూతిని కలిగించి ఆలోచింపజేస్తాయి.
సినీ గేయరచయితగా మీ ప్రస్థానం?
సినీగేయ రచయితగా నా ప్రస్థానం ఇప్పుడే ప్రారంభమైందని చెప్పవచ్చు.
ఇప్పటి వరుకు ఎన్ని పాటలు రాశారు? తొలి సినిమా అవకాశం ఎలా వచ్చింది?
2010లో మిత్రుడు సింహశ్రీ మిద్దె దర్శకత్వంలో వచ్చిన 'చేతిలో చెయ్యేసి' చిత్రంలో మూడు పాటలు రాసి, సినీగేయ రచయితగా మారాను. ఇప్పటివరకు అరవై సినిమాల్లో వంద పాటలకు పైగా రాసాను. ఎక్కువ పాటలు రాయలేక పోవడానికి కారణం, నేను ఒక ప్రైవేటు ఉద్యోగిగా పని చేయడం. పని చేయకుండా బతకలేని పరిస్థితులు వెన్నంటి ఉండటం. అలా ఎక్కువగా సినిమా ప్రయత్నాలు చేయలేకపోయాను. ఇప్పుడు అవకాశాలు వస్తున్నందుకు హ్యాపీగా ఉంది.
ఒకవైపు సినిమాలకు పాటలు రాస్తూనే సడన్ గా బుల్లితెర వైపు వచ్చారు. అందుకు ఏదైనా ప్రత్యేక కారణం ఉందా?
ప్రత్యేకమైన కారణం అంటూ ఏమీ లేదు. పాట ఏదైనా పాటే. అది బుల్లితెరకు రాసినా, వెండితెరకు రాసినా. నా మటుకు రెండిటికీ తేడా లేదు. పాట కోసం పిలుపు వస్తే, రాయడమే నా పని. నేను సినిమాలు టీవీ సీరియల్స్ అని కాకుండా ప్రైవేటు గీతాలు కూడా రాస్తుంటాను. యూట్యూబ్ ఛానల్స్ కోసం చాలా పాటలు రాశాను. ఎప్పుడూ ఏదో ఒక పాట రాస్తూనే ఉంటాను. పాట రాయడాన్ని నేను ఒక తపస్సుగా భావిస్తాను.టీవీ సీరియల్స్, సినిమాలు, ప్రైవేటు గీతాలు మొత్తం కలిపి ఇప్పటి వరకు 1000 పాటలు రాశాను. వెనక్కి తిరిగి చూసుకుంటే నేను ఇన్ని పాటలు రాసానా, అని ఆశ్చర్యం కలుగుతుంది.
దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు దర్శకత్వ పరివేక్షణలో తీసిన 'కోయిలమ్మ' సీరియల్ లో 500 పాటలు రాశారు కదా ఆ అనుభవాలు చెప్పండి?
కోయిలమ్మ సీరియల్ నాకు లభించిన గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఆర్కె టెలి షో లాంటి ప్రతిష్టాత్మక సంస్థలో పని చేయడం ఏ రచయితకైనా అదష్టం. కె రాఘవేంద్రరావు గారు నిర్మిస్తూ, వారి దర్శకత్వ పర్యవేక్షణలో కోయిలమ్మ మెగా సీరియల్ విజయవంతమైంది. కె.రాఘవేంద్రరావు గారిని చూస్తేనే జన్మధన్యం అనుకునే నాకు, వారితో పనిచేసే అవకాశం రావడం జీవితంలో మర్చిపోలేని అనుభూతి. ఆయన పలు సందర్భాల్లో నా పాటలను మెచ్చుకోవడం కూడా జరిగింది. ఆయన మాటలు నాలో ఎంతో స్ఫూర్తి నింపి, ఆత్మవిశ్వాసాన్ని పెంచాయి.
ఒక సీరియల్ లో 500 పాటలు రాశారు ? అదేలా సాధ్యం?
ఇది నిస్సందేహంగా గొప్ప విషయం. ప్రపంచంలో ఎక్కడా జరగని విషయం. ఒకే సీరియల్ లో 500 పాటలతో కోయిలమ్మ సీరియల్ ప్రపంచ రికార్డు నెలకొల్పింది. దీనికి ముఖ్య కారణం దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు గారు. ఆయనకు పాటల మీద ఉన్న మమకారం.
ఇక ఎలా సాధ్యామైందో చెప్పాలంటే ఇది టీం వర్క్. కోయిలమ్మ పాటలు అద్భుతంగా రావడానికి ముఖ్య కారణం ఆ సీరియల్ బాధ్యతలు చూసుకున్న పద్మజ గారు, దర్శకత్వం వహించిన మాధవ్ గారు, సంగీత దర్శకుడు సాయి మధుకర్ గారు, స్క్రీన్ ప్లే రచయిత్రి ఉషారాణి గారు, మాటల రచయిత గంగోత్రి విశ్వనాథ్ గారు, నటీనటులు సాయికిరణ్ రామ్, శ్రీలత, హారిక, తేజస్విని, స్రవంతి, జేఎల్ శ్రీనివాస్, మానస్, అమర్, మ్యూజిక్ ఇన్చార్జ్ యాదా గౌడ్, మేనేజర్ భాస్కర్ పోకల ఇలా చాలామంది ఈ విజయంలో భాగస్వాములై ఉన్నారు. 500 పాటలు రాయడం నా ఒక్కడి విజయం కాదు. ఈ రికార్డు సమష్టి కషి ఫలితం.
నేటి యువత సినిమా పాటలో కొత్తదనం కోరుకుంటుంది కదా! ఇప్పటి పాటలలో సాహిత్య విలువలు తగ్గుతున్నాయి అంటున్నారు. దానిపై మీ అభిప్రాయం?
ఈ ప్రశ్నలో మూడు భిన్నమైన విషయాలు ఉన్నాయి. పాట కాలానుగుణంగా మారుతున్న మాట వాస్తవం. ప్రేక్షకుల నాడిని బట్టి దర్శకులు పాటలను రూపొందిస్తారు. సినిమా అనేది పూర్తిగా వాణిజ్య పరమైన విషయం. కొన్ని పాటలు మీరన్నట్టు వస్తున్నాయి. అలాగే మంచి పాటలు కూడా వస్తున్నాయి. మంచి, చెడు అనేది అన్ని రంగాల్లో ఉంటుంది. ఇక సినిమా పాటలు సాహిత్య విలువలు తగ్గుతున్నాయి అనడం సరికాదు. ఆ మాటకొస్తే, సినిమా పాటల ద్వారానే సాహిత్యం ప్రజలకు చేరువవుతుంది అంటాను. సినిమా పాటను చిన్నచూపుతో చూసి చులకనగా మాట్లాడడం విజ్ఞుల లక్షణం కాదు. ఇక్కడ ఒక్క పాట రాసి మెప్పించడం చాలా కష్టతరమైన విషయం.
మీరు గేయ రచన ఎవరి దగ్గర నేర్చుకున్నారు?
నేను ప్రత్యేకించి ఎవరి దగ్గర శిక్షణ తీసుకోలేదు. తెలుగు సినిమా పాటను సమగ్రంగా పరిశీలిస్తున్న వ్యక్తుల్లో నేను ఒకడిని. పాటలు రాయడానికి భాషాజ్ఞానం ఒక్కటే సరిపోదు. కొంత సంగీత పరిజ్ఞానం కూడా ఉండాలి. అప్పుడే స్వరాలకు పదాలని కూర్చడం తెలుస్తుంది. అలాగే సన్నివేశాన్ని నిశితంగా అర్థం చేసుకునే జ్ఞానం కూడా ఉండాలి. వీటన్నిటికంటే ముఖ్యమైంది వేగంగా పాట రాయగలగాలి. చెప్పిన టైం కు పాట రాసి ఇవ్వగలిగే క్రమశిక్షణను కలిగి ఉండాలి.
సాహిత్య, సినిమా రంగంల్లో మిమ్మల్ని ప్రోత్సహించింది ఎవరు!?
సాహిత్యరంగంలో నన్ను చాలా మంది ప్రోత్సహించారు. అందులో ప్రముఖంగా సినారె, అంపశయ్య నవీన్, అద్దేపల్లి, గోపి, శివారెడ్డి, కె.వి. రమణాచారి, బైస దేవదాస్, దాస్యం సేనాధిపతి, రమణ వెలమకన్ని, బిక్కి కష్ణ, జి.వి.ఆర్, పెద్దూరి వెంకటదాస్, అలపర్తి పిచ్చయ్య చౌదరి, ఎలవర్తి రాజేంద్ర ప్రసాద్, పోరెడ్డి రంగయ్య, వంశీ రామరాజు, సాహిత్య ప్రకాశ్, ప్రకాష్ చౌడారపు, పి. శ్రీనివాస్ గౌడ్ ర్యాలీ ప్రసాద్, పట్టాభి కళాపీఠం రాజేంద్రప్రసాద్, పొత్తూరి సుబ్బారావు, తంగిరాల చక్రవర్తి మొదలగువారు .
సినిమారంగంలో
సంగీత దర్శకులు విజరు కురాకుల, రవి కళ్యాణ్, మల్లిక్ ఎం వి కె, ఎస్పీ బాల సుబ్రమణ్యం, యశోకష్ణ, ఘనశ్యామ్, విష్ణుకిషోర్, దర్శకులు కె.రాఘవేంద్రరావు, శివ నాగేశ్వరరావు, శివనాగు రవీంద్రసూరి, మురళీ గంధర్వ, కె. రాజేంద్ర ప్రసాద్, నిర్మాత మహంకాళి, శ్రీనివాసులు, సినిమాటోగ్రాఫర్ రమణ వి. తోట, సుద్దాల ఆశోక్ తేజ, చంద్రబోస్, నాగబాల సురేష్ కుమార్, సాయినాథ్ తోటపల్లి, వెనిగళ్ళ రాంబాబు తదితరులు.
మీ రాబోయే చిత్రాల గురించి తెలియజేస్తారా?
ఒక అమ్మాయితో, అన్నపూర్ణమ్మ గారి మనవడు, దేవినేని, సంత, చేతిలో చెయ్యేసి చెప్పు బావా, బెంగళూరు 69, సెక్సీ స్టార్, శర పంజరం, ఘనశ్యామ్ సంగీత దర్శకత్వంలో వస్తున్న ఒక సినిమా, విజరు కురాకుల సంగీత దర్శకత్వంలో వస్తున్న రెండు సినిమాలు, సుమధుర్ కష్ణ దర్శకత్వంలో వస్తున్న ఒక సినిమా విడుదలకు సిద్ధమవుతున్నాయి. మరికొన్ని సినిమాలకు సంప్రదింపులు జరుగుతున్నాయి.
మీరు అందుకున్న పురస్కారాలు?
అవార్డులా చాలా పెద్ద లిస్టు ఉంటుంది (నవ్వుతూ..) సుమారు రెండు వందల కవితల పోటీలలో ప్రథమ బహుమతి సాధించాను. నేను రచించిన దిగంబర, గరళం, తప్తస్పహ కవితా సంపుటాలకు దాదాపు 30 అవార్డులు వచ్చాయి. ముఖ్యమైనవి కొన్ని చెబుతాను.
సినిమారంగంలో ప్రాంతీయ అభిమానం, కులాభిమానం ఉంటుందంటారు. నిజమేనా?
ఉంటే ఉండవచ్చు. అవి లేనిది ఎక్కడీ ఈ విషయంలో ఒక మాట చెప్పాలి. అచంచలమైన ఆత్మవిశ్వాసం, అమోఘమైన పట్టుదల, అద్భుతమైన ప్రతిభ ఉంటే మన లక్ష్యానికి ఏదీ ప్రతిబంధకం కాదు.
నవతరం గీతరచయితలకు మీరిచ్చే సలహా?
పాటలు ఎవరైనా రాయొచ్చు. కాని ఏ రంగం లోనైనా ప్రతిభ ఉన్నవారు మాత్రమే ప్రవాహ శీలంగా కొనసాగుతారు. భారతీయ సినిమాకు సంబంధించి తెలుగు సినిమా పాట చాలా ఉత్తమ స్థాయిలో ఉందని చెప్పవచ్చు.
శ్రీశ్రీ, ఆత్రేయ, వేటూరి సిరివెన్నెల, భువనచంద్ర, సుద్దాల అశోక్ తేజ, చంద్ర బోస్ వంటి గేయ రచయితలు సంఖ్యా పరంగా మాత్రమే కాకుండా తెలుగు సినిమా పాటకు సాహిత్య పరిమళాలను అద్దారు. ఆయా రచయితల పాటలను పరిశీలిస్తే వారు చేసిన ప్రయోగాలు తెలుస్తాయి. ఇవేవి తెలియకుండా పాటలు రాస్తానంటే కుదరదు.
సాహిత్య అవార్డులు
రంజని కుందుర్తి అత్యుత్తమ కవితా పురస్కారం.
రాధేయ అత్యుత్తమ కవితా పురస్కారం.
ఎక్స్ రే అవార్డు.సినారె కవితా పురస్కారం.
అఖిల భారతీయ సాహిత్య జాతీయ పరిషత్ పురస్కారం.
తెలంగాణ ప్రభుత్వ ఉత్తమ కవి పురస్కారం.
దాస్యం వెంకటస్వామి పురస్కారం.
తెలుగు టెలివిజన్ రచయితల సంఘం
కాళోజీ పురస్కారం.
గిడుగు రామ్మూర్తి పురస్కారం.
ఆసరా జాతీయ పురస్కారం.
తేజ అవార్డు.
కళా వెంకట దీక్షితులు స్మారక పురస్కారం.
తానా ప్రపంచ సాహిత్య వేదిక
అత్యుత్తమ కవి పురస్కారం.
సినిమా అవార్డులు
ఉత్తమ గీత రచయితగా కలర్స్ అవార్డు.
ఉత్తమ గీత రచయితగా
సినారె - వంశీ ఫిలిం అవార్డు.
ఉత్తమ గీత రచయితగా
తెలుగు సినీ రచయితల సంఘం
ప్రతిభా అవార్డు.
ఉత్తమ గీత రచయితగా
ఘంటసాల బంగారు తెలంగాణ సంగీత పురస్కారం.
సోమనాథ కళాపీఠం విశేష పురస్కారం.
టీవీ అవార్డు
ఉత్తమ గీత రచయితగా జివిఆర్ ఆరాధన అవార్డు
(కోయిలమ్మ సీరియల్)
కొన్ని సినిమా పాటలు...
- ఎదలో నదిలాగా (గుడ్ మార్నింగ్)
ఉత్తమ గాయనిగా గీతామాధురికి నంది అవార్డు
- చెలివరములు కురిసిన (బిలాల్ పోల్లీస్ స్టెషన్)
- ప్రేమావిరివానా (బెంబుచినసత్యం)
- చిలిపి చిలిపి (చెతిలో చేవ్యేసి)
- సుఖం అందించరా (బెంగళూర్ 69)
- నేనునేనుగా లేను (చెతిలో చేయ్యేసి చెప్పుబావా)
- వెళ్లర బాబు...వెళ్లరా (అన్నపూర్ణమ్మగారి మనవడు)