Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సాగరతీరాన
సౌందర్యానికి నిర్వచనం చెబుతున్న తీరున
వయ్యారంగా నిలబడి
ఆ సాగర కెరటాలతో పోటీపడుతూ
ఎగిరిపడుతూన్న
నీ ఉంగరాల ముంగురులను
నీ వామహస్తాంగుళులతో
వెనక్కు సుతారంగా దువ్వుకుంటూన్న
ఓ వామలోచనీ...!
నా కోసం అభిసారికవై వచ్చిన నీవు
పదిక్షణాల నా ఆలస్యానికి
అలుకల సత్యభామవై
చిరు అలుకతో ముఖం త్రిప్పుకుని
సాగరం వైపుకు చూడకు...
ఎందుకంటే నీ కళ్ళను చూసి
రెండు పౌర్ణమి చంద్రబింబా లని భ్రమపడి
ఆ సాగరం-పగలే రెట్టింపు ఉత్సాహంతో
ఉప్పొంగుతుంది సుమా!
చిరుకోపానలంతో ఉడికిపోతూన్న నీవు
వేడినిట్టూర్పులూ విడవకు మరి...
ఎందుకంటే నీ ఆ చిట్టి నిట్టూర్పులకే
సాగరం ఆటుపోట్లతో అల్లకల్లోలం
అవగలదు సుమా!
నీ కళ్ళ సూర్యుళ్ళ ప్రళయ కోపతాపాలనూ
నీ కళ్ళ చంద్రుళ్ళ ప్రణయప్రసన్నచంద్రికలనూ
నా పైనే కురిపించు కువలయనేత్రీ...
ఎందుకంటే వాటిపై హక్కులన్నీ నా వేననీ
నా ఎదకాగితంపై నీ వలపుల
తొలి సంతకం చేసివున్నావనీ
మరిచిపోకు హేమసుందరగాత్రీ!!!
రఘువర్మ
జగిత్యాల, 9290093933