Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నాన్న పంచిన
స్ఫూర్తి వెలుగులోనే
నడకలు సాగుతున్నాయి
వడిదుడుకుల్లో కూడా
వెనకడుగు తగదని
వెన్ను తట్టిన మాటలే
నన్ను నడిపిస్తున్నాయి
నమ్మకానికి నిలువుటద్దమై
నమ్మిన ముఖాలపై
వెలుగుల్ని చూడాలనే
సహదయత కలిగిన
నాన్న ఆశయాలే
నన్ను గెలిపిస్తున్నాయి
మడమ తిప్పని ధర్మానికై
కుడి ఎడమైనా తలొగ్గక
సమసమాజ నిర్మాణం దిశగా
కదిలి పొమ్మన్న నాన్న గుర్తులే
కొండంత అండగా కదిలిస్తున్నాయి
నాన్న దిద్దిన
నడవడికల గమ్యంలో
అలుపెరుగని పయణంగా
పాదాలు సవ్యంగా సాగుతున్నాయి
ఒకే మాట ఒకే బాట అనే
సమాంతర రేఖపై
దూసుకెళ్ళమన్న నాన్న పద్ధతులే
సహాయం చేసే చేతులుగా
నేటికీ బాసిల్లుతున్నాయి
అక్కాచెల్లెలైనా అన్నా తమ్ముల్లైనా
సకల ప్రజానీకాన్ని
అక్కున చేర్చుకునే నాన్న లక్షణాలే
నాకు ఊతమై కదిలిస్తున్నాయి
నాన్న ఎక్కడున్నా
జ్ఞాపకాల చిహ్నంగా
నిరంతరం గుండెల్లో ఒదిగే వుంటాడు
నాన్న ఆశయాలెప్పుడూ
నాలో బతికే వుంటాయి
- నరెద్దుల రాజారెడ్డి
ఫోన్ : 9666016636