Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అలకపూనిన ఆలి అనాదరణకు గురిఅయి
మనముందుకు వచ్చిన ఆదివైష్ణవుడు
ముడతలు మేనికి చింకిపాతలు చుట్టుకుని
కలిసిరాని కాలానికి భాష్యం చెబుతున్నాడు
జీవిత నాటకంలో వైరాగ్యాన్ని ,దారిద్యాన్ని
పూసుకుని నటిస్తున్న మహా నటుడు
అన్నపూర్ణను తలుచుకుంటూ అందరి
ఇళ్లల్లో వెతుక్కునే మాదాకోళం వాడు
అన్నార్తుడిగా అందరినీ దేహీ అంటూ
అమ్మా అని అన్నంకోసం ఆర్తిగా అర్థిస్తూ
కాలానికి, ఖర్మానికి బంధాల ముడి చూపిస్తూ
పుణ్యానికి, పాపానికి ఫలితాల గుట్టు విప్పేస్తూ
చేతుల్లో బరువు దించుకోమని
చేతనయిన సాయం చేయమని,
గుప్పెడు విడవకపోతే,
గుప్పెడు మెతుకులకు
దారులు వెతకాలని
పుట్టెడు పాపపు జీవితంలో
చిటికెడు పుణ్యం చేసుకోమని
మౌనంగా సౌజ్ఞ చేస్తున్నాడు,
జాలిగా దిశ చూపుతున్నాడు.
కాలం చేసే గారడీలో చేతుల
స్థానమార్పిడి జరగొచ్చని
హెచ్చరికలు చేస్తూ మరో వీధికి
మరలి పోతున్నాడు
- ఉషారం
9553875577