Authorization
Mon Jan 19, 2015 06:51 pm
షణ్ముక ప్రియా..షణ్ముక ప్రియా.. ఇదే పేరు ఇప్పుడు సోషల్ మీడియాలో మారుమ్రోగుతున్నది. దాదాపు పదేళ్ల క్రితం 'జీ తెలుగు'లో వచ్చిన లిటిల్ చాంప్స్‌లో ఆలరించిన ఆ చిన్నారి నేడు ప్రఖాత్య సంగీత దర్శకులు ఎ.ఆర్ రహమాన్ నుండి 'బాజ్ స్టార్ ఆఫ్ ఇండియా' గా ప్రశంసలు అందుకున్న తెలుగు అమ్మాయి. పిట్ట కొంచెం కూత ఘనం అనే సామెత సరిగ్గా సరిపోయే గాయకురాలు షణ్ముక ప్రియ. నాలుగేండ్ల వయసు నుండే సంగీతాన్ని తన శ్వాసగా మార్చుకొని తన పాటతో అందరిని ఆశ్చర్య పరిచింది. రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో జరిగిన పాటల పోటీల్లో తన సత్తా చాటి ఇండియా లెవెల్ లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకుంది. ఆమెకు లక్షల్లో ఫాన్స్ ఉన్నారు.. ఆమె గొంతు చిన్నారులనే కాదు పెద్దలను హుషార్ చేస్తున్న ఇండియన్ ఐడల్ సింగర్ 'షణ్ముఖ ప్రియ' పరిచయ కథనమే ఈ వారం జోష్.
తల్లిదండ్రులే తొలి గురువులు
షణ్ముఖ ప్రియ పుట్టింది విజయనగరం జిల్లాలో పార్వతీపురం. పెరిగింది శ్రీకాకుళం జిల్లా పాలకొండల. విశాఖపట్నంలో చదివింది. అమ్మ రత్నమాల శాస్త్రీయ సంగీతంలో ఎమ్ఏ పట్టాలు పొందారు. నాన్న శ్రీనివాసు కుమార్ వయోలిన్, వీణ విద్వాంసులు. అందుకే వీళ్లిద్దరి వారసత్వంగా షణ్ముఖ కూడా అతి చిన్న వయసులోనే కూని రాగాలు తీస్తూ ఉండేదట. మూడేళ్ల వయసులోనే అలారం రింగ్ టోన్ హమ్ చేస్తున్న షణ్ముఖ విధానాన్ని గమనించిన ఆమె తల్లిదండ్రులు తనకి సంగీతంలో మెళుకువలు నేర్పించారు. అలా అమ్మానాన్నలే తొలి గురువులయ్యారు. అదే ఆమెని ది గ్రేట్ సింగర్ గా నిలబెట్టాయి. అలా సంగీతంలో ఎంతో ప్రావిణ్యం సంపాదించిన షణ్ముఖ జీ తెలుగు చానల్ 2008లో నిర్వహించిన జీ సరిగమ లిటిల్ ఛాంప్‌లో విన్నర్‌గా నిలవడంతో ఆమె సత్తా ఏమిటో అందరికి తెలిసిపోయింది.
కర్ణాటక, కేరళ, తమిళనాడు చిన్నారులకు నిర్వహించిన 'సూపర్‌స్టార్ సింగర్' పోటీలో టైటిల్ అందుకుంది. జీ తెలుగు సరిగమ లిటిల్ ఛాంప్స్ 2008 విజేతగా నిలిచింది. మా టీవీ సూపర్ సింగర్ 2009లో ఫైనల్ వరకు వెళ్లింది. స్టార్ విజరు తమిళ జూనియర్ సూపర్ స్టార్స్ 2010పోటీల్లో విన్నర్‌గా... 2013లో ఈటీవీ పాడుతా తీయగా పోటీలో ఫైనల్స్ కు.. 2015లో మాటీవీ సూపర్ సింగర్ పోటీల్లో విజేత. జీ టీవీ హిందీ సరిగమప లిటిల్ ఛాంప్స్ 2017లో రన్నర్‌గా నిలిచాను. తమిళ సూపర్ సింగర్ జూనియర్ 3, స్టార్ ఆఫ్ ఏపీ, సరిగమప నువ్వానేనా పోటీల్లో మంచి ప్రతిభ కనబరిచింది. ఇక మా టీవీలో ప్రసారమయ్యే సూపర్‌సింగర్ 4లో ఫైనలిస్ట్ గా కూడా నిలిచింది. అన్ని భాషల్లోనూ అలవోకగా పాటలు పాడటంలో ఆమె ప్రత్యేకత ఉంది. అసలు ఎలాంటి రాగమైన ఎలాంటి బాషలోనైనా ఒక్కసారి తెలుసుకుంటే అలవోకగా పాడగలగడం షణ్ముఖకే సొంతం. అయితే షణ్ముఖ పాటల్లో పడిపోయి తన చదవును మాత్రం ఎప్పుడు పక్కన పెట్టలేదు. ఆమె సింగర్ గా రాణిస్తూనే బాగా చదవుకుంటుంది.
ఉర్దూ గజల్స్
షణ్ముఖ కేవలం సినిమా పాటలు ఎంత అద్భుతంగా పాడుతుందో అంతే అద్భుతంగా జానపద గీతాలు, ఉర్దూ గజల్స్ కూడా అదిరిపోయేలా పాడుతుంది. దీంతో ఆమె ఘనత కేవలం దక్షణ భారతదేశానికే పరిమితం కాలేదు. టీవీలో ది వాయిస్ అఫ్ కిడ్స్ లో పాల్గొని దేశవ్యాప్తంగా అందరికి సుపరిచితురాలైంది. హిందీలో జీటీవీ సరిగమప లిటిల్ చాంప్స్ లో కూడా పాడి దేశవ్యాప్తంగా పేరు సంపాదించింది. అయితే అలా విజయమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న షణ్ముక ఇప్పుడు ఇండియన్ ఐడల్‌పై కన్నేసింది. ఇప్పుడు అక్కడ కూడా విజయం సాధిస్తే ఆమె పేరు దేశవ్యాప్తంగా మారుమోగటం ఖాయం.
ఇండియన్ ఐడల్
చిన్నప్పటి నుంచి ఇండియన్ ఐడల్ షోలో పాల్గొనాలని కోరికే నేడు ఈ స్థాయికి తీసుకువచ్చింది. ఈ సీజన్ సెలక్షన్లకు ఆన్లైన్ ద్వారా కొన్ని వేల మంది హాజరయ్యారు. వారిలో 350మంది ఎంపిక చేసి వారి నుండి టాప్ 14లో చోటు సంపాదించిన ఒకైక తెలుగు అమ్మాయి. ఏకంగా ఇండియన్ ఐడల్ సీజన్ 12 లో గోల్డెన్ మైక్ సాధించి థియేటర్ రౌండ్‌కు చేరుకుంది. ప్రఖ్యాత సంగీత దర్శకులు ఏఆర్ రెహమాన్ స్వయంగా ఆమెను 'జాజ్ స్టార్ ఆఫ్ ఇండియా' అని ప్రశంసించారంటే ఆమె పాటలోని మాధుర్యం తెలుస్తుంది.
ప్రముఖ గాయకుల ప్రశంసలు
ప్రముఖ గాయకులు ఎస్.జానకీ,ఆశాబోస్లే, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, చిత్ర, మాల్గాడి శుభ, రమణ గోగుల, ఆర్పీ పట్నాయక్ ఆమె గాత్రాన్ని ప్రశంసించారు. ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం ముందు 'పాడుతా తీయగా'తో ప్రస్థానం ప్రారంభించిన ఆమెకు ఆయనెన్నో సలహాలు ఇచ్చారు. మరాఠీలో సోను నిగమ్‌తో కలిసి ఒక డ్యూయట్ కూడా పాడింది.