Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కొన్నింటిని గుర్తు పెట్టుకోవాలి
మరికొన్నింటిని మరచిపోవాలి
ఒక పక్క దీపం ఆరిపోతుంది
మరోపక్క కొత్తగా ఒక నేల పుడుతుంది
నేలలో నుండి
రాళ్లు, రత్నాలు, గింజలు
అదిగో
ఒక తీగ అటువైపుగా సాగిపోతుంది
తీగకు వేలాడుతున్న ప్రాణాలు
దిక్కుల్లో మునిగి
స్వతంత్రాన్ని ప్రకటించుకుంటాయి
శరీరం వేడిగా పగులుతుంది
పగిలిన ముక్కల్లో
అనాథలైన జ్ఞాపకాలు
కొత్తగా ఉరి పోసుకుంటాయి
నువ్వూ, నేను
కలిసి నడిచినంత మాత్రాన
కొత్తగా మరో అడుగు వేయాలంటే,
మరో కాలంలోకి జొరబడాలంటే,
అతలాకుతలం అవ్వాలంటే
చేదు పువ్వులను మింగాల్సిందే
బలవంతంగానో, బలహీనంగానో
నావ ముందుకు సాగాలి
ఇష్టంగానో, అయిష్టంగానో
కొత్త వాతావరణంలోకి, తేదిలలోకి పరిగెత్తాలి
ఎందుకో
ముఖాన్ని అటు, ఇటు తిప్పి చూశాను
కొందరి అదృశ్యం
అనివార్యం అశాశ్వతం
- జె.బి చరణ్,
7259511956