Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దినామూ కష్టం జేసినాక
కల్లుపాక దగ్గర కలిసూక్తులు
వాళ్ళిచ్చిన సిల్లరతో పిల్లాడికి
పొకాడ పొట్లామో సమోసాలో..
ఎత్తుకొని..
అల్సినా గూడా అదుపులో
ఉండి.. ప్రభువుల ఉప్పుతిన్న
పాదాలు చేర్చే కోట..
ఒంటి నిట్రాడి గుడిసె!!
కొన్ని ఎండా వానలు చూసి తట్టుకోలేక
పోతున్న తాటాకులూ,కాకిరెల్లూ.
కల్సి మాట్లాడుకోని..
అటెనుక కొన్నాళ్ళకి
ఆయమ్మి, నేను లాగా..
గొడవలు బెట్టుకోని..
యెడ మొగం పెడముగాలైతే..
ఇయ్యాల.. సూరీడూ పగలు,
ఆయబ్బి తమ్ముడు రేత్రిళ్ళు..
కొంపలోనే కొచ్చెన్లు ఏస్తారు!
ఇంటిగుట్టు పరాయోల్లకి
పరాసికవే... గదా !
వానకైతే గుడ్డలుగిడ్డలు
తడిసి ముద్దయినాక..
ఉన్న సత్తుగిన్నెలు నాలుగు..
తావు తావున తలో మూల..
వాన ఎల్సినాక గూడ
సిటుక్ సిటుక్కని సప్పుడు..
అదేందో సీన్మల.. పాటల్లే..
సూరట్టుకు జారద్ధి వానసుక్క..
ప్రీగా గట్టిచ్చే ఇల్ల కోసమే ఈడీకొస్తిమి..
ఈనాటికి నాలుగేళ్లు.. గదమే !
ఈ తాటి నిట్రాడి మన వాకిట్ల సెట్టుది..
మకా తల్లీ తాటిసెట్టు !
బచ్చాలాడిందీ..బడిపాటం రాసింది
దీనికిందనే!
ఇంతోటి బతుక్కి..
ఇంగలాండ్ కొంపలెట్టోస్తారు?
బంగారం లాంటి సెట్టు కొట్టేస్తిని
నిట్టాడి కోసం !
ఎన్ని ఎండాకాలాలు ఇల్లు గప్పిందో..
ఈతల్లి.. ఎన్నిముంజెలు
కొన్ని తరాలకిచ్చి,
సాయింత్రాలు దాలిగుంటలో
కమ్మటి ఆసనతో కాలిందో
తాటి పండు రుసి సొర్గానగూడా
ఉండదు!
తిని ఇసిరేయబాకోరే..అనేది మాయమ్మ!
పనిలేని యాల ఒక సిటం
ఓపిక దెచ్చుకోని బెమ్మం గారి
పాట బాడుకుంట గుంటదీసి
సీకెసిన ముట్టిలు బడేసి..
కసింత సవిటి మన్నయిన ఏస్తే..
పండగ నెల బెట్టే తలికి..
బొటన యేలు సయిజు త్యాగలు...
ఆత్రం బట్టలేని పిల్లకాయలు
ఓ పుంజీడు తవ్వేసి..
ఉడకేసుకోని.. సందమావ నాకంటే నాకని.. ఇష్టింగా తింటా ఉంటే
అది గదా సెట్టు తల్లిగ్గావల్ల!
ఏందో..
ఇసవాసం లేని బతుకులు
పిల్లకి గెడ్డిమింద పచ్చి తాటాకేసి మూల కూసోబెడితే
పచ్చని పసుపు కుంకాలుతో
అచ్చం లచ్చిందేవీ.. ఆకుపచ్చ తామరపువ్వుమిందా..
అనుకున్న గదా!
సేలల్ల వరికోతకి బోతే
మద్దేలకి ఉడుకుడుకు వణ్ణం
కోడిగుడ్డు తీగూరా,
తెల్లగోగాకు పచ్చిమిరక్కారు పచ్చడీ..
తాటాకు రేకల్లో బెట్టి రెడ్డమ్మ
ఆపేచ్చగ అందిస్తే..
ఆవురావురని గొంతుదాకా
తిని బ్రేవుమంటిమీ గదా.. !
లేతాకులతో పువ్వాకేసుకునే బుట్ట
అల్లి ఆరబెడితే మురిసిపోయే అమ్మ !
ఆకు మొదట ఉండే తాటిమట్ట
అది నాలికా తాటిమట్టా...?
అనేసెరోరే !
అంత పదును ఆ పక్కా ఈ పక్కా!
ఎందుకులే తల్సుకుంటే గుబులు!
ప్పది రూపాయల కారుబొమ్మ
జాతరలో కొనిస్తిని
నాల్రోజులకే ఇరగ్గొట్టేసి..
తాటి బుర్రల బండ్లు..
తాతతోటి జెపిచ్చికోని నాలుగీదులు తిరిగేరు బుడ్డోళ్లు
సంబరంగా!
- ఎం. వి. ఉమాదేవి
నెల్లూరు