Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అన్నంమెతుకులేం
ఆకాసం నుండి రాలిపడవు
పంచభక్ష పరమన్నాలేం
ఉన్నోళ్ళింట్లోకి ఊడిపడవు
జానెడిపొట్టకోసం
పోరాటం చేసే రైతులపైన
జాదు చట్టాలెందుకు?
రైతు నెత్తురుతో వ్యాపారమా?
కర్షకుడి చెమటచుక్కలు
అహర్నిశల ఆశల రెక్కలన్ని
కార్పోరేట్ కబంధహస్తాల్లోకి
నెట్టేసి
దోపిడి సామ్రాజ్య ఆధిపత్యం
నాయకుల కుతంత్రాల్లో
నలిగిపోతున్న బతుకులు
పాలనెవరిదైనా కాలమేదైనా
రైతుల కష్టాలు పట్టవెవ్వరికి
వారి శ్రమపై పెత్తనం
దళారులకే దారదత్తం
పేదరికం రైతులకు నేస్తం
ఆకలి తీర్చే రైతుకు ఆవేదన
అప్పులు ఆందోళన
ఆత్మహత్యలు
మన భారతదేశ చిత్రం
బాధలెన్నున్న
తన బాధ్యత మరవనిమనిషి
ఒళ్లు దాచుకోకుండా
సేద్యం చేసే అలుపెరుగని యోధుడు
రాజ్యం ఉన్నోడి చుట్టం
ఏ చట్టమైనా వారికే అనుకూలం
తలరాతలు మరని సేద్యం
బురదకు తనువంతా తాకట్టుపెట్టినా
అప్పుల్జేసి పంటను సింగారించినా
కన్నబిడ్డల్లా పంటచేలను పెంచిపోషించినా
అష్టకష్టాలతో పంటను దీస్తే మిగిలేవన్ని అప్పులే
మారని ఆకలి బతుకుల చావుకేకలు కారణం
లొసుగులతో నేతలచేసిన చవకబారుచట్టం
నోరు తెరిచి న్యాయమడిగితే చావును రుచిచూపుతరు ఎంతకాలం
తరతరాల చరిత్ర చూసిన ఏమున్నది
దళారుల మోసమే నేడేమో
పెట్టుబడిదారుల చేతుల్లో
ఒదిగిపోయిన ప్రభుత్వం ప్రలోభాల చట్టాలు చేస్తూ
ఆకలిని సైతం ఆమ్ముకుంటుంది
జై కిసాన్ నినాదం
వెన్నుముక విరిగిన దేశంలో
నేరమై కటకటాల్లోకి నెడ్తోంది
అందలం శాశ్వతం కాదు
అన్నమే అందరికవసరం
- సి. శేఖర్(సియస్సార్),
9010480557.