Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సఖీ!
చూపుల విరితూపులతో
నాహదివీణలోజి
వలపురాగాలు పలికించిన
నీ వాలుచూపుల కలువల్లో
తుమ్మెదనై నే వాలనా!
బ్రహ్మ రాసిన రాతతో ఎదురుపడ్డ
నీ పాదాలకు పరుపునై
మనసునిండా నిన్నేమోసే
గడ్డిపూవు నే కానా
పాలనురుగుతో నీ పాదాలు తాకే
సాగరకెరటం నే కానా!
నీలిమేఘాలు మురిసి
నునులేతగాలులు వింజామరలై
నీ ముంగురులు సవరించగ
పులకరించి పురివిప్పిన
నీ అధర దరహాసంలో
వెన్నెలకిరణమై తళుకులీననా!
నా ఎద సవ్వడిలో నీ ధ్యానమే
నా భావపరంపరలో నీ నామమే
నీవు నాచెంతనుంటే
నా చింతలన్నీ దూరమే
అందుకే చిగురాకు నీవై
నీపై వాలిన తుషార బిందువు
నే కానా!
వెన్నెలను మించిన అందంతో
పున్నమిని మరిచేలా చేస్తున్న నీకై
కిరణస్పర్శకోసం తపిస్తూ
ప్రతీఉదయం ఆకాశంవంక
ఆశగా ఎదురుచూసే సరోజంలా
ఎదురుచూస్తూనేఉంటా
నేనో చీకటిశకలమై
నీ ఎడబాటు నింగినుంచి
రాలిపోకముందే
శిశిరాలు చిగిర్చే నీ పాదముద్రల్ని
నా మదిమన్నుపై
గాఢంగా అద్దుతావుకదూ!
- వేమూరి శ్రీనివాస్
9912128967