Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నా గుండె చప్పుడు
ఇప్పుడు అక్షరమై నీ పేరుగ మెరిస్తే
కాదంటావేం...
జ్ఞాపకాలు గతమై పోవడమంటే
ఒలికిన వెన్నెట్లో తడిచిన రాతిరి
వేకువ కాగానే మంచులా కరిగిపోవడమేనా...
కాదు...
వర్షం కురిసిన నేల
గుప్పెడు పరిమళాన్ని
ఒంటికి రాసుకుని మురిసిపోవడం...
మాటల గుసగుసలన్నీ
గాలిలో కలిసి నింగికెగసి పోయినంతగా
ఆ మరుపేంటి...
గుసగుసలన్నీ నదిలా ప్రవహిస్తే
మనసు పాడుతున్న లాహిరిలో
తనువు మైమరచి పోతూ....
వాన కురిసి వెలసిన నింగిపై
ఇంద్ర ధనుసు వేణువూదినట్లు
ఎన్ని సామీప్యాలు...ఎన్ని ఆనంద లహరులు...
నమ్మకాల పునాదులపై
నాలుగు చేతులతో అల్లుకున్న
అనుబంధపు అంతఃపురం కదా ప్రేమంటే...!
అనుకోని అతిధిలా వచ్చే కొన్ని కలలు
పాయిరాయిల్లా ఎగురుతూ
కళ్ళల్లో దోబూచులాడుతుంటే
అలసిన రెప్పలు
రచిస్తూనే ఉంటాయి
ఎప్పటికీ అంతమవని
ఓ ప్రేమకావ్యాన్ని...
ఆనాటి మన తేనె సంతకాల సాక్షిగా...!!
- శాంతి కృష్ణ
9502236670