Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తెలవారని పొద్దుని,
నాలుగు గోడల బరువుని
కొంగున కట్టి ఆలిగానో, అమ్మగానో
నిత్య దర్శనం ఇస్తూ
ఒలికి పోతున్న కాలాన్ని
ఒడిసిపట్టిన మగువ
ముంగిట ముగ్గుగా రంగులద్దుకుంటూ
కంటిపాప కన్నులలో మెరిసేటి కమ్మని కలకి
సీతాకోక రెక్కల దారం కట్టిన పతంగిలా
రెప రెపలాడుతున్న జీవితాన
సూదంటు చూపుల మధ్య
శివంగిలా మెరిసేటి మగువ
అడుగు ముందుకు వేసే వేళ
అంతరాల అవరోధాలు
కాలి ముల్లై సలుపుతూవుంటే
పెదవంచు వేడి నెత్తురు ఒలికిస్తున్నా...
పంటి బిగువున చెరగని నవ్వుని అద్దుకుని
రెప్ప జారని కడలిని దాచి
సాగరం అంచున ఎగిసిపడుతున్న అలలా ముందడుగు వేస్తూనే వుంది
వెర్రి చేష్టలు వెకిలి చూపుల పరిహాసాల మధ్య
నాగలి సాగులో చిగురించిన మొక్కలా కొత్త చిగురులు అల్లుకుంటూనే..
తన ఉనికిని చాటుతోంది మగువగా
-రూప రుక్మిణి.కె,
9441133071