Authorization
Mon Jan 19, 2015 06:51 pm
విజయమనేది ఏ ఒక్కరి సొత్తు కాదు. సాధించాలన్న తపన ఉంటే అది ఎవరినైనా వరిస్తుంది. అందుకు పోటీ పడటం తప్పనిసరి. అయితే.. అది ఆరోగ్యకరంగా ఉండాలి. ఇతరులను ఇబ్బంది పెట్టేలా ఉండొద్దు. విజయం సాధించుకోవాలనుకున్న వారికి ఆత్మనూన్యతా భావం ఏమాత్రం ఉండొద్దు. అభివృద్ధికి అది అవరోధంగా మారుతుంది. ఇతరులతో పోల్చుచుని మనల్ని మనం తక్కువ చేసుకోవడమంటే మన విజయాన్ని మనం అడ్డుకున్నట్టే. పరీక్షల్లో అనుకున్న ర్యాంకు వస్తుందా?, ఉద్యోగ ప్రయత్నం ఫలిస్తుందా? ఇలా అనేక భయాలు కొందరికి చుట్టుముడుతుంటాయి. పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూల్లో ఇవి మరింత ఎక్కువవుతాయి. మనకంటే ఇతరుల్లో ఎక్కువ జ్ఞానం ఉందని భావించడమే ఇందుకు కారణం. ఇలాంటివి మన అంతరంగంలో ప్రారంభమై పరాజయానికి దారితీస్తాయి. మనకు తెలిసిన విషయాలను కూడా మరచిపోయేలా చేస్తాయి. మనకంటే ఇతరులపైనే మన అంచనాలు ఎక్కువగా పెంచుకోవడం, మనల్ని మనం తక్కువ చేసుకోవడం దీనంతటికీ కారణం. ఒక మనిషి అందాన్ని, ఆహార్యాన్ని, భాషను చూసి గొప్పగా అంచనా వేయలేం. పైకి అంత గొప్పగా కనిపించినా విషయం దగ్గరకు వచ్చేసరికి వారిలో అవసరమైన జ్ఞానం ఉండకపోవచ్చు.
పోటీతత్వంలో మొదటగా కలిగే మానసిక ఆందోళన... మనకంటే మిగతావారు ముందుకెళ్లి పోతున్నారనే ఒక అనవసర భావన. రెండోది మనలో మనకు అవసరమైన నైపుణ్యాలు ఉన్నా ఇతరుల వేషభాషలు, అందచందాలు చూసి వారి నైపుణ్యాలను గొప్పగా అంచనా వేసి మన ఓటమిని ఊహించుకుని భయపడిపోవడం. ఇది ఏమాత్రం శ్రేయస్కరం కాదు. మనపై మనకు భరోసా ఉంటేనే అన్ని రంగాల్లోనూ రాణిస్తాం. ఇతరులకన్నా తానేం తక్కువ కాదనే ఆత్మవిశ్వాసం పెంచుకుంటేనే విజయాన్ని సాధిస్తాం.
మనలో ఉన్న అనుకూల లక్షణాలను తక్కువ చేసుకుని ఇతరుల్లో అవి ఎక్కువ ఉంటాయనుకునే భ్రమలే ఓటమికి గురిచేస్తాయనే విషయాన్ని మరచిపోవద్దు.
పరీక్ష హాలులో అడిషనల్ పేపర్స్ అధికంగా తీసుకునే ప్రతి విద్యార్థికీ ర్యాంక్స్ రాక పోవచ్చు. వారిని చూసి వారు తనకన్నా గొప్పగా రాసేస్తున్నారని, తానేమీ రాయలేక పోతున్నాని కంగారు పడిపోతే ఇక అంతే! తెలిసిన అంశాలు మరచిపోవడం ఖాయం. అయోమ యంలో సమాధానాలు గుర్తుకురాక పేపర్ని అరకొరగా అలాగే వదిలేసే పరిస్థితి దాపురించొచ్చు.
మరేం చేయాలి?
- చదువులైనా, పోటీ పరీక్షలైనా, ఉద్యోగ ఇంటర్వ్యూ అయినా, వ్యాపారాలైనా మొదట మనపై మన నమ్మకాన్ని పెంచుకోవాలి. ఇతరులతో పోల్చు కుంటూ మనల్ని మనం తక్కువ చేసు కోవద్దు.
- మన భవిష్యత్తును మనం తీర్చిదిద్దు కోవాలనుకున్నప్పుడు మన ప్రయత్నం మనం చేస్తాం. అలాంటప్పుడు ఇతరుల గురించి ఆలోచించడం అనవసరం.
- విజ్ఞానాన్ని పెంచుకోవడానికి అనేక సాధనాలు అందుబాటులో ఉన్నాయి. వాటిని సద్వినియోగం చేసుకోవాలి. అంతే తప్ప 'నా పరిస్థితి ఇక ఇంతే..' అని కుంగిపోవద్దు.
- గెలిచిన ప్రతిసారీ మరో గెలుపునకు కృషి చేయాలి. ఓడిన సందర్భాల్లో దాని తాలూకు మూలాలు వెతకాలి. అనుభవజ్ఞుల సలహాలు, సూచనలతో విజయం వైపు మందుడగు వేయాలి.
- విజయం మొదటి దశ కాదని, ఓటమి చివరి దశ కాదని తెలుసు కోవాలి. పడ్డ ప్రతిసారీ ఆత్మవిశ్వాసం, పట్టుదలతో పైకి లేవాలి.
-నిర్దేశించుకున్న మార్గాన్ని ప్రణాళికాబద్ధంగా రూపొందించుకొని ఏది ముందు, ఏది తర్వాత అనే ప్రాధాన్యతలతో ప్రయత్నాలు చేయాలి.
- మన కృషి, మన ఆచరణ మనకు అండగా ఉన్నప్పుడు ఆత్మన్యూనతా భావానికి లోనుకావద్దు.
- మనలో అంతర్లీనంగా దాగున్న మానసిక శక్తే మనల్ని విజయతీరాల వైపు నడిపిస్తుంది. మన అంతర్గత శక్తితో మనం పోటీ పడితేనే ఏ లక్ష్యాన్నైనా అవలీలగా సాధించ గలం. గూడుకట్టే ప్రయత్నంలో ఎన్నో పర్యాయాలు కింద పడి లేచే సాలీడు అంతిమంగా విజయం సాధిస్తుంది. గూడు కట్టి తీరుతుంది.
- అపురూప ఆలోచనలకు నిలయమైన మన మనసు ఎన్నో అద్భుతాలు సృష్టిస్తుంది. కోరిక నీదైనప్పుడు.. ప్రయత్నమూ నీదే కావాలి. నీతో నీవే పోటీ పడాలి. అప్పుడు ఫలితం కూడా నీకే దక్కుతుంది.
- అమరనాథ్ జగర్లపూడి, కౌన్సెలింగ్ సైకాలజిస్ట్,
9849545257