Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'హూ ఈజ్ యువర్ ఫెవరెట్ హీరో'?
అడిగింది టీచర్
'మహేశ్ బాబు'
'రజినీకాంత్'
'ఎన్టీఆర్' అని చెపుతున్నారు పిల్లలు వరుసగా
'నాన్న'.. అంటూ ఓ పాప లేచి
వినయంగా చెప్పింది
'మీ నాన్న అంటే అంత ఇష్టమా?'
ప్రశ్నించింది టీచర్..
'అవును.. మా నాన్నే నా ఫెవరెట్ హీరో' బదులిచ్చింది.ఆ పాప బుంగబూతి
పెట్టినట్టుగా... క్లాస్ అంతా
ఒక్కసారి చప్పట్లు వినిపించాయి...
అవును కదా ? ఏ కూతురైనా, ఏ కొడుకు అయినా ఎంత మంది హీరోలను అభిమానించినా అంతిమంగా వాళ్లకు 'నాన్నే' సూపర్ హీరో. 'మా నాన్న హీరో', 'నాకు మా నాన్నే హీరో' అని చిన్నప్పటి నుంచి చెప్పుకునే ఆ మాటల్లో గాంభీర్యం వేరు.. ఇంట్లో ఎంత మంది ఉన్నా నాన్న డిఫ్రెంట్. నాన్న ప్రేమ డిఫ్రెంట్. నేడు ఫాదర్స్్ డే సందర్భంగా జోష్ కథనం
అమ్మ పరిచయం చేసే మొదటి వ్యక్తి నాన్న.. అప్పటి వరకూ మంచి కొడుగ్గా, మంచి భర్తగా, అన్నయ్యగా, తమ్ముడిగా పేరు తెచ్చుకున్న అతను ఇక మంచి నాన్న అనిపించుకోవాలి. అప్పుడే పుట్టిన బిడ్డగా నాన్న తనకు తానూ ఎన్నో నేర్చుకుంటూ, పుట్టిన బిడ్డకూ నేర్పాలి. అలా మొదటి గురువయ్యాడు . జీవితంలో ఎన్నో చేదు అనుభవాలను చూసి, ఎన్నో అవమానాలకు ఎదుర్కొని కష్టపడి తనకంటూ ఒక స్థాయి సంపాదించాడు. అలా మొదటి రోల్ మాడల్ అవుతాడు.. పుట్టినప్పటి నుంచి నీకు కష్టం అంటే ఏంటో తెలియకుండా, అవమానాలేవి ఎదురవకుండా చూడాలని కలలు కంటాడు. నువ్వు మెల్లిమెల్లిగా ఎదుగుతుంటే నీ భవిష్యత్తును చూసుకుంటూ మురిసిపోతాడు. నీవు మొదటి సారి నాన్న అని పిలిచే సమయం కోసం ఎంత వేచి ఉంటాడో కదా ! ముసిముసి నవ్వులు నవ్వినప్పుడు, నడకనేర్చుకుంటున్న పుడు నాన్నకెంత ఆనందమో.. బుడిబుడి అడుగులతో బడికెళ్తుంటే నాన్న సంతోషం సాగరమై పొంగిపోదా..
నాన్న ఓ రోల్ మోడల్
నడక నేర్పడంలో నాన్న, వేళుపట్టి దారి చూపడంలో నాన్న, దుఖంలో, ఆనందంలో నాన్న.. జీవితంలో ప్రతి ఘడియలో నాన్న.. నాన్నంటే అంతే రిలేషనే కాదు ఎదో తెలియని ఎమోషన్. చిన్నప్పుడు పిల్లల్ని గాల్లోకి ఎగరేసినా నవ్వుతూ కనిపిస్తారు. కిందపడకుండా నాన్న పట్టుకుంటాడనే నమ్మకం అది. జీవితంలో కూడా అంతే. సంతోషంగా ఉంటాం అంటే నాన్నమీద నమ్మకమే.. ఓ అబ్బాయికి ఒక్కో వయస్సులో ఒక్కో రకమైన అభిప్రాయం ఉంటుంది. అప్పటి వరకూ అల్లారుముద్దుగా నాన్నతో పెరిగిన అబ్బాయి టీనేజ్‌లోకి రాగానే తీరు మారిపోంతుంది. నాన్న పెట్టే రూల్స్ విసుగు తెప్పిస్తాయి. త్వరగా ఇంటికి రావాలి, ఉదయాన్నే నిద్రలేవాలి, జులాయిగా తిరగొద్దు అని చెప్పే నాన్న మాటలు టీనేజీ కుర్రాలకు అభద్రతా భావాన్ని కల్పిస్తాయి. అందరి నాన్నలతో పోల్చుకుని, మా నాన్న ఇలా ఉంటే బాగున్ను, అలా ఉంటే బాగున్ను అనే విభిన్న అభిప్రాయాలు ఏర్పడతాయి. 'మా నాన్న ఎప్పుడూ నా మీద నిఘా ఉంచుతాడు' అనే భావనలో ఉంటారు. కానీ అదంతా తన భవిష్యత్ కోసమే అని టీనేజీ దాటితే కానీ తెలియదు. కుటుంబంలో తనకంటూ బాధ్యతలు పెరిగితే గానీ అర్థం కావు. ఈడొచ్చాక పెండ్లి చేసుకుని కుటుంబాన్ని నెట్టుకొచ్చేప్పుడు తెలుస్తుంది. పిల్లలు పుట్టాక నాన్న కష్టం అర్థం అవుద్ది. నెల నెలా ఇళ్లు అద్దె కట్టాలి. స్కూల్ ఫీజులు కట్టాలి. కుటుంబాన్ని సంతోషంగా ఉంచాలి. ఇంతేనా.. ఇంకా ఎన్నో బాధ్యతలు. ఖర్చుతో కూడుకున్నవి, కన్నీళ్లతో కూడుకున్నవి. ఎన్నో పరిస్థితులను నెట్టుకురావాలి. అప్పుడే నాన్న విలువ తెలుస్తుంది. పెంపకం అంటే అర్థం అవుతుంది. అంతెందుకు కీ ఇచ్చి బైక్ నేర్పిందీ నాన్నే కానీ
ఫ్రెండ్స్‌తో కలిసి బయటకెళ్తానంటే బైక్ ఇవ్వడు, స్పీడ్ గా వెళ్లినట్టు తెలిస్తే ఇంటికి వచ్చాక క్లాస్ పీకుతాడు. నాన్న అంటే అంతే మరి అన్నీ నేర్పుతాడు. కానీ పరిధి దాటనివ్వడు. అది నీకేమైనా అవుద్దేమో అనే భయం, తండ్రిగా అది ఆయన బాధ్యత, నీకు, నీ భవిష్యత్తుకు కల్పించాల్సిన భద్రత.
అందుకే నాన్న ఎప్పటికీ రాయల్‌గా రోల్ మోడల్...
నాన్న మనసు బంగారం
నాన్న ఇంట్లో ఆంక్షల హద్దుల్ని గిస్తాడు. రూల్స్ పెడతాడు. నిఘా పెంచుతాడు. అవ్వన్నీ పిల్లల బంగారు భవిష్యత్తు కోసమే. నాన్న మనసు బంగారం. ఎలాంటి పరిస్థితుల్లో అయినా కుటుంబాన్ని సంతోషంగా ఉంచాలనే ధృడమైన ఉక్కులాంటిది కూడా. పిల్లల కన్నీళ్లు చూసి కరిగిపోయే పాదరసం నాన్న మనసు. మెరిసే బంగారం నాన్న.. సంతోషాల సామ్రాజ్యం నాన్న... అందరికోసం శ్రామికుడిలా, నాయకుడిలా నిరంతరం పని చేసి ఉన్నత స్థాయికి పిల్లలు ఎదగాలనుకునే నాన్నను జీవితపు చివరి దశలో వృద్ధాశ్రమంలో వదిలేస్తున్నాం. పిల్లలు ఆనందంగా ఉంటే అదే సంతోషం అనుకునే అల్పసంతోషి నాన్నను కాటికి కాళ్లుజాచే సమయంలో అనాథను చేయటం ఎందుకు ? ఆస్తులు, అంతస్తులు పుచ్చుకుని, పెండ్లాం పిల్లలతో సంతోషంగా ఉండి అమ్మానాన్నను వృద్ధాశ్రమాల్లోకి తోలేస్తున్న పరిస్థితి ఏర్పడింది. కొందరికి నాన్న డబ్బు సంపాదించి ఇవ్వలేకపోవచ్చు. ఆస్తులు కూడగట్టలేకపోవచ్చు. కానీ నాన్న సంపాధించింది విలువలు, సమాజంలో గౌరవం, మంచి పేరు. ఆస్తులు సంపాధించుకోవటం కొడుకుల పని. వాళ్లకు గౌరవాన్ని పెంచడం నాన్న పని.
నాన్నే కారణం..
అందరికీ ఫాదర్స్ డే శుభాకాంక్షలు. నాన్న పేరు పరమేశ్వరం. ఆయన గురించి చెప్పాలంటే చాలా ఉన్నాయి. ఆయనతో అనుబంధం నేను మాటల్లో చెప్పలేను. ఊర్లో వ్యవసాయ కుటుంబం మాది. చిన్నప్పుటి నుంచి సినిమాల్లోకి రావాలనుకునే వాడిని. నాన్న ప్రోత్సాహంతోనే ఇవ్వాళ్ల ఈ రంగంలో రాణించగలుగుతున్న. సక్సెస్ అయ్యాను అంటే నాన్నే కారణం. ఎప్పుడైనా లేట్ నైట్ షూటింగ్‌కి వెళ్తే తిరిగి ఇంటికి వచ్చే వరకూ కూర్చుంటారు. ఇప్పటికీ ఇంటి పని కూడా నాన్నే చూసుకుంటారు. నేను ఇండిస్టీలోకి రావడానికి నాన్న కూడా చాలా కష్టపడ్డారు. తన కష్టానికి ఫలితంగా అమ్మానాన్నలను సంతోషంగా, శ్రమ తెలియకుండా చూసుకుంటున్నా. అమ్మానాన్నలను ప్రేమగా చూసుకోవాలి. వయస్సు వచ్చాక వాళ్లను వృద్ధాశ్రమాల్లో
ఉంచటం బాధాకరమైన విషయం.
నవతెలంగాణతో సినీ నటుడు శ్రీకాంత్...
నాన్నకు ఎందుకో ఏడుపొచ్చింది
నాన్న కష్టానికి ఓ అర్థం ఉంది. నాన్న కన్నీళ్లకూ ఓ అర్థం ఉంది.తన కూతురు భార్యగా ఇంకో ఇంటికెళ్లేటప్పుడు. బిడ్డ కన్నీళ్లు చూసి నాన్న దుఖాన్ని దిగమింగలేక ఏడ్చేస్తాడు. ఇరవై ఏండ్లకు పైగా కలిసి చెప్పుకున్న కబుర్లు, గుండెలపై నిదుర పోయిన ఘడియలకు దూరమవుతున్నామనే భావన. ఇకపై తన కూతురు జీవితం ఎలా ఉంటుందో అనే భయం నాన్న హృదయంలోంచి వచ్చే కన్నీటికి కారణమవుతాయి. చిన్నప్పటి నుంచి బంగారు తల్లికి గోరుముద్దలు తినిపించి, భుజాలపై ఎత్తుకుని ఊరంతా చూపించిన జ్ఞాపకాలు నాన్న గుర్తు చేసుకుంటున్నాడని ఆ కన్నీళ్లు చెబుతాయి. అప్పటి వరకూ 'డాడ్స్ ఏంజిల్', 'నాన్న గారాలపట్టి' గా బతికిన ఆమె ఇప్పుడు పెద్దదై మిస్సెస్ టు సమ్వన్గా ఓ ఇంటిదై పోతోంది. తన కూతురు పెండ్లి సంబురంగా చేయాలన్న తండ్రి కల నెరవేరినా, సజవుగా పెండ్లి తంతు ముగిసినా కొందరి నాన్నలకు ఏదో వెలతి. తెలియని బాధ. అది ఎప్పుడూ వెంటనే వేదన.
- వినోద్ మామిడాల