Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చల్లని హేమంత ఋతువులో
పారదర్శకపు ఎద గాజు పలకపై
జ్ఞాపకాల్ని మంచుబిందువుల్లా
బొట్లు బొట్లుగా రాల్చుతుంటావు !
ఎదురెదురుగా నిలబడ్డప్పుడు
కళ్ళల్లోకి కళ్ళుపెట్టి చూస్తూ
నా మనో విరహతెరపై
వివిధ భంగిమల్లో నర్తిస్తుంటావు !
తుహినాన్ని నవ్వుముక్కలుగా కోసి
నాపై సరదాసరదాగా విసురుతూ
సెలయేటి నిస్వనుల్లో లీనమై
ప్రేమ పాఠాల్ని వల్లె వేయిస్తావు !
మాటలకు ఆకర్షణ పసరును పూసి
పాదాలకు కరిగే పాదలేపనం రాసి
నీ ప్రణయ హిమగిరుల్లో
తిరిగిరాని దారుల్లో తిప్పుతుంటావు !
ఆభరణాలన్ని ఒలిచి ఒడ్డున పెట్టి
అల్లనేరేడు పళ్ళలాంటి కురులలో
తుమ్మపువ్వులా తురుముకొని
పికాసో చిత్రమై నన్నల్లుకుంటావు !
-అశోక్ అవారి,
సిద్దిపేట జిల్లా, 9000576581.