Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మీ రోజుల ఎలా గడుస్తున్నాయి? అంటే ఏమంటారు. హ్యాప్పీగా గడుస్తున్నాయా ? రొటీన్‌గా గడుస్తున్నాయా ? ఏం చేపుతారు. ఏ పని చేసినా కొంచెం ఆనందం ముఖ్యం కదా. ఆ ఆనందం పొందాలంటే చేస్తున్న పనిని కూడా ఆనందంగా చేయాలి. అంటే ఎప్పుడూ నవ్వుతూ ఉండాలి. కాబట్టి మీరు రోజుకు ఎంత సేపు నవ్వుతున్నారో చూడండి. ఉదయాన్నే నవ్వుతూ లేవడం అలవాటు చేసుకోండి. అద్దంలో చూస్తూ నవ్వటం అలవాటు చేసుకోండి. ఎన్నో ప్రశ్నలకు సమాధానం చిన్న నవ్వుతో ఇండికేట్ చేయచ్చు. అందుకే హాయిగా నవ్వండి. మనస్ఫూర్తిగా నవ్వి ఎన్ని రోజులయ్యిందో గుర్తు చేసుకోండోసారి. ఎందుకంటారా రోజూ కాసేపు నవ్వడం వల్ల మానసికంగానే కాదు, శారీరకంగానూ ఎంతో మేలు జరుగుతుందని చెబుతున్నారు నిపుణులు. వ్యాయామం చేయడానికి సమయం పెట్టుకున్నట్లే రోజూ ఓ పది నుంచి పదిహేను నిమిషాలు నవ్వడానికీ కేటాయించాలి. దానివల్ల అధికరక్తపోటు సమస్య అదుపులోకి వస్తుంది. శరీరానికి సరిపడే ప్రాణవాయువు అంది, రక్తప్రసరణ సజావుగా సాగడమే అందుకు కారణం. దీంతో శరీరం కూడా ఉత్సాహంగా మారుతుంది. హాయిగా నవ్వడం వల్ల వ్యాధినిరోధకశక్తిని పెంచే కణాలు పెరుగుతాయి. దీంతో అనారోగ్యం దరిచేరదు. నొప్పినీ తగ్గిస్తుంది. రోజూ కాసేపు నవ్వడం వల్ల ఎండార్ఫిన్ల ఉత్పత్తి కూడా జరుగుతుంది. నవ్వు మనలో ఆత్మవిశ్వాసాన్నీ పెంచుతుంది. దీంతో సానుకూల ఆలోచనలు మాత్రమే మనసులో వస్తాయి. క్లిష్టమైన సందర్భాల్లో సరైన నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం పెరుగుతుంది. లాఫ్టర్ థెరపీ ద్వారా కంటినిండా నిద్రపోవచ్చని అంటున్నారు నిపుణులు. రోజంతా నవ్వుతూ, సంతోషంగా ఉండేవాళ్లకి మనసులో ఎటువంటి ఆందోళన ఉండదని, దాంతో ప్రశాంతమైన మనసుతో హాయిగా నిద్రపోతారని చెబుతోందో అధ్యయనం.