Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సరదాలకు, షికార్లకు కేరాఫ్ టీనేజ్. ఈ ఈడు దాటితే సర్దుబాటులు, పట్టింపులు, ఇతరత్ర బాధ్యతలు సరదాలకు సమయమెక్కడుంటుంది. అందుకే ఏ వయస్సులో చేయాల్సింది ఆ వయస్సులో చేయాలంటారు. ఒకవేళ సరదాగా గడపాలనుకున్నా అవకాశం ఉండదు. చేయాలనుకున్నా మనసొప్పదు చేసినా చూసే వాళ్లు ముక్కున వేలేసుకుంటారు. అయితే.. ఇక్కడ ఒకమాట మాత్రం చెప్పక తప్పదు. యుక్త వయసులో సరదాలు చేసినా అవి హద్దులు దాటొద్దు. టీనేజీ వయస్సు దాటాకా వెనక్కి తిరిగి చూసుకుంటే ఆహ్లాదకరమైన, ఆనందపూరితమైన రోజులే ఉండాలి కానీ బాధపడాల్సిన రోజులు కాదు.
రోజులు మారుతున్నాయి.. మనషులూ మారుతున్నారు. సమాజం కొత్త పుంతలు తొక్కుతోంది. ముఖ్యంగా యువత ఎప్పుటికప్పుడు అప్డేట్ అవుతోంది. కాలంతో పాటు పరిగెడుతోంది. ఆధునికతను పునికిపుచ్చుకునేందుకు, జీవితాన్ని రంగులమయం చేసుకునేందుకు ఉవ్విళ్లూరు తోంది. స్మార్ట్ఫోన్, ఇంటర్నెట్, ద్విచక్ర వాహనాల వినియోగం,స్నేహితులతో షికార్లు తదితర అంశాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది. ఇదంతా బాగానే ఉంది. కాలంతోపాటు మారడం మంచిదే. కానీ.. ఈ సరదాలు శ అతిమించితేనే ప్రమాదం. అంతేకాదు.. సరదాల ముసుగులో విలాసాలకుపోయి వ్యసనపరులుగా మారొద్దు. మద్యం, మాదక పదార్థాల జోలికి అసలే వెళ్లద్దు.
ఇంటర్నెట్
నేటి నిత్యావసరాల్లో ఇది కూడా ఒకటిగా మారి పోయింది. ఇది లేకుండా ఏ పనీ చేయలేని పరిస్థితి. ఈ ఇంటర్ నెట్ మానవునికి సౌఖ్యాన్ని ఇచ్చినదాంతో పాటే కొన్ని ఇబ్బందులకూ గురి చేస్తోంది. ముఖ్యంగా యువత దీని కోసం తమ విలువైన సమయాన్ని వృథా చేసుకుంటోంది. అవసరానికి మించి ఈ మాయాజాలంలో చిక్కుకొంటోంది. సోషల్ మీడియా ద్వారా స్నేహాలు పెంచుకోవడం మంచిదే. కానీ.. ఈ క్రమంలో చాటింగులు చేస్తూ చీటింగులకు గురవుతున్నారు. ముక్కూముహం తెలియని వారికి తమ వ్యక్తిగత వివరాలు చెప్పి మోసపోతున్నారు. ముఖ్యంగా అమ్మాయిలు దీని బారిన పడి వంచనకు గురవుతున్నారు. యువతీయువకులు అసభ్యమైన వెబ్సైట్లు చూడటానికి ఎక్కువ సమయాన్ని కేటాయిస్తున్నారు. ప్రతి 100 మందిలో 65 మంది విద్యా సంబంధిత విషయాలను కోసం అంతర్జాలాన్ని వినియోగిస్తుండగా 87 మంది మాత్రం వేస్ట్ విషయాలతో కూడిన చాటింగ్ కోసం ఉపయోగిస్తున్నారు. దీంతో ఏటా పది శాతం మంది మానసిక రోగాలకు గురవుతున్నారని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. మన సౌఖ్యం కోసం ఉపయోగపడాల్సిన అంతర్జాలం మన జీవితాలను నాశనం చేసే స్థాయికి ఎదిగింది. దీనివల్ల పరస్పర కలహాలు ఏర్పడిన సందర్భాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఇక్కడ యువత ఒక విషయాన్ని గ్రహించాలి. ఇంటర్నెట్ని సద్వినియోగం చేసుకుంటే అది మన మిత్రుడితో సమానం. అదే అనవసరంగా ఉపయోగిస్తే అది మన జీవితాన్ని నాశనం చేసే శత్రువు అవుతుంది.
బైక్ షికారు
బైక్ షికారంటే యువతకు ఉత్సాహం ఉరకలేస్తుంది. అయితే.. దీన్ని కూడా అవసరం మేరకే ఉపయోగించాలి. దీన్ని విలాస వస్తువుగా భావించొద్దు. నిజానికి ఇది తమకు అవసరమా.. లేక అభిరుచా.. అనేది సరిగా బేరీజు వేసు కున్న తర్వాతే దాని వైపు మొగ్గు చూపాలి. సరదాగా షికార్లు కొడుతూ ప్రమాదాలు కొనితెచ్చుకోవద్దు. ఇటీవల రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయిన వారిలో ఎక్కువ మంది యువతే కావడం విషాదకరం.
సరదాలు
స్నేహితులతో కలిసి షికార్లు కొట్టడం యువతకు పరిపాటే. హోటళ్లు, రెస్టారెంట్లు, సినిమాలకు వెళ్లడం, ఎంజారు చేయడం చాలా మందికి అలవాటే. అయితే... ఇది వ్యసనంగా మారొద్దు. స్నేహితులతో కలిసి మద్యం సేవించే దాకా పరిస్థితి రానివ్వొద్దు. మద్యపానం శారీరక, మానసిక ఆరోగ్యానికి హానికరం. చదువు, ఉద్యోగం లాంటి బాధ్యత లను విస్మరించి మందుబాబులుగా మారొద్దు. పబ్బులకు తమ విలువైన సమయాన్ని ధారపోయొద్దు. అంతేకాదు.. మాదక ద్రవ్యాలు(డ్రగ్స్)కు అలవాటు పడి అమూల్య జీవితాన్ని ముగించుకోవద్దు. సరదాగా కాలక్షేపానికో, స్నేహితుల ప్రోద్బలంతోనో అలవాటైన ఈ మాదక ద్రవ్యాలు వ్యసనంగా మారి ప్రాణాలనే హరించే పరిస్థితి ఎదురవు తుంది. నల్ల మందు, గంజాయి,హెరాయిన్, కోకైన్, చరస్, హశస్, మార్ఫియా అనేవి చాలా ప్రమాద కరం. వీటికి అలవాటు పడిన వారు మామూలు మనుషుల్లా మళ్లీ మారడం చాలా కష్టం. కాబట్టి హద్దుదాటిన సరదాలు జీవితాలు హరిస్తాయి. భవిష్యత్తును బలిగొంటాయి. సో.. జాగ్రత్త!