Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఓ ఫొటోగ్రాఫర్ అన్వేషణలో పడ్డాడు. అతను తీసిన ఫొటోను అతనే నమ్మలేక పోతున్నాడు. దాన్ని పట్టుకుని గాలిస్తున్నాడు. తెలిసిన వారందరినీ ఆరా తీస్తున్నాడు. గ్రామాల్లో తిరుగుతున్నాడు. ఫలితం లేకపోవటంతో అతని అన్వేషణ సోషల్ మీడియాలోకి ఎక్కింది. నమ్మసక్యం కాని ఆ నిజమేంటంటే అతను వెతుకుతున్న ఓ ప్రేమ జంట కోసం.. అతనికి తెలియని ఓ ప్రేమ జంట ఆయన కెమెరాలో చిక్కింది. ఎక్కడో పర్వత అంచున ఆ ప్రేమ జంటను అతని కెమెరా చిత్రించింది. వాళ్లను కలుసుకోవాలనీ అతను తీసిన అద్భుతమైన చిత్రాన్ని వాళ్లకు అందించాలని అన్వేషణ మొదలు పెట్టాడు ఆ ఫొటో గ్రాఫర్.. వివరాల్లోకి వెళ్తే...
అమెరికాకు చెందిన మాథ్యూ డిప్పెల్ అనే ఫొటో గ్రాఫర్ రెండు వారాల క్రితం మిచిగాన్లోని ఓ నేషనల్ పార్క్లో ఫొటోలు తీస్తున్నాడు. అదే సమయంలో సమీపంలోని ఓ పర్వతంపై ప్రియుడు తన ప్రియురాలికి ప్రత్యేక స్టయిల్లో ప్రపోజ్ చేస్తున్న దృశ్యం అతనికి కనిపించింది. ఈ అద్భుత దృశ్యాన్ని తన కెమెరాలో బంధించాడు. కొన్ని క్షణాల్లోనే ఆ ప్రేమ జంట అక్కడి నుంచి మాయమయ్యింది.
ఈ ప్రేమ జంటను కలుసుకోవాలన్న ఆసక్తితో మాథ్యూ డిప్పెల్ స్థానికుల వద్ద ఆరా తీశాడు. అయితే ఫలితం లేకపోయింది. కెమెరా కళ్లకు చిక్కిన ఆ జంటను స్థానికులు ఎవరూ గుర్తుపట్టలేకపోయారు. 'ఫోటో తీసిన కొన్ని క్షణాలకే వారు అక్కడి నుంచి వెళ్లిపోయారు..అక్కడ జరిగినదాన్ని నేను నమ్మలేకపోతున్నా'నని మాథ్యూ డిప్పెల్ తెలిపాడు. అయితే ఎంత వెతికినా ఫలితం లేకపోవటంతో సోషల్ మీడియా ద్వారా కూడా అన్వేషణ మొదలు పెట్టాడు. వాళ్లను గుర్తుపట్టిన వారెవరైనా సమాచారం ఇవ్వాలని కోరాడు. దీనికి సోషల్ మీడియాలో కూడా మంచి స్పందన ఉంది. ఫేస్బుక్, ట్విట్టర్లో ఎక్కువ షేర్లు, రీట్వీట్లు ఉన్నాయి. వేలాది మంది లైక్స్, రీట్వీట్లు చేసినా ఆ ప్రేమ జంటను మాత్రం తాను ఇప్పటి వరకు గుర్తించలేకపోయినట్టు చెబుతున్నాడు మాథ్యూ డిప్పెల్. అయితే తన ప్రయాస వృథా కాదని, ఏదైనా ఒక రోజు తాను కెమెరాలో బంధించిన జంటను కలుసుకుంటానని ఆ ఫోటోగ్రాఫర్ దీమా వ్యక్తంచేస్తున్నాడు. తాను ఎంతో అద్భుతంగా తీసిన ఫోటోను ఆ ప్రేమ జంటకు కానుకగా ఇవ్వాలన్నదే తన ఆకాంక్షగా చెబుతున్నాడు. ఆ జంట కోసం అన్వేషిస్తున్న మాథ్యూ డిప్పెల్కు మీరు కూడా సాయపడగలరేమో చూడండి..