Authorization
Mon Jan 19, 2015 06:51 pm
విజయానికి ఆత్మవిశ్వాసమే పునాది. అది కొరవడిన జీవితం సంక్లిష్టంగా, బరువుగా నడుస్తుంది. యూత్‌లో ఇది మరీ ఎక్కువ కనిపిస్తుంటుంది. టీనేజ్ పిల్లలు సైతం ఒక దశలో ఒకరకమైన ఆత్మన్యూనతకు గురవుతారు. లక్ష్యం నిర్ధేశించుకున్నా దాని కోసం కృషి చేయడానికి కొన్ని పరిస్థితులను ప్రతికూలంగా ఉంటాయి. అయితే వాటినే ప్రామాణికంగా తీసుకుని కాంప్లెక్స్‌లో ఉంటారు. అలాంటి భావనల నుంచి వెంట వెంటనే బయటపడితే అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవచ్చు. దానికి కొంత మేధస్సు పెంచుకోవాలి. మనసులో పడితే నెగిటివ్ ఫీలింగ్స్‌ని తీసేయాలి. ఇలాంటి కాంప్లెక్స్ నుంచి బయట పడటానికి కొన్ని మెళకువలు పాటించవచ్చు అవేంటో చూద్దాం...
సమాజంలో మనకు మనం ఎదిగే అవకాశాలు ఎప్పుడు సజీవంగానే ఉంటాయి వాటిని ఉపయోగించుకొనే మేధస్సు పెంచుకోవాల్సి ఉంటుంది.ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు కచ్చితంగా ఎల్లప్పుడూ మనసులో మననం చేసికోవాలి. మనలోని అనుకూలతలు మనలోని ప్రతికూలతలు మనకే బాగా తెలుసు. అందుకే ప్రధానంగా మనల్ని మనం అర్థం చేసుకుంటే ప్రతి అవరోధంలో (Failure) ఆత్మన్యూనతకు లోను కాకుండా సమస్యను ఆత్మావిశ్వాసంతో ఎదుర్కొంటూ పడిన ప్రతిసారి పట్టుదలతో పైకి లేచి అడుగు ముందుకు కదపవచ్చు. అందుకే జీవితంలో ఓటమి అనేది పుస్తకంలో చివరి పేజీ కాదు విజయం అనేది మొదటి పేజీ కాదు. మధ్యలో ఇంకా చాలా పేజీలుంటాయి మనల్ని మనం నిరూపించుకోవటానికి.
ఆత్మన్యూనత భావన (Inferiority Comple xity) అనేది అజ్ఞానం కాదు ,నగుబాటు అంతకంటే కాదు. కొన్ని కొన్ని సందర్భాలలో జీవితంలో ఎదుర్కొన్నచిన్న చిన్న అపజయాలే మానసికంగా మనల్ని భయాందోళనలకు గురిచేస్తుంది. ప్రతి ఒక్కరికి స్ఫూర్తి కలిగించే ఒక ఉదాహరణ 'జెస్సికా కాక్స్ ప్రపంచంలోనే మొట్టమొదటి లైసెన్స్ పొందిన విమాన పైలట్ అలాగే అమెరికన్ టైక్వాండో అసోసియేషన్‌లో తొలిసారిగా బ్లాక్ బెల్ట్ పొందిన మహిళ. అమెరికాలో జన్మించిన ఈమె అరుదైన జన్మ లోపం వలన చేతులు లేకుండా జన్మించింది. ఆత్మన్యూనతతో కాకుండా ఆత్మావిశ్వాసం తో అంగ వైకల్యాన్ని సైతం జయించి ప్రపంచంలోనే ఎందరికో ఆదర్శంగా నిలబడింది. మనలోని సామర్ధ్యాలు మనం గుర్తిస్తూ నిరంతర సాధనతో ప్రయత్నిస్తే ఆత్మన్యూనతే బెదిరి ఆమ్మో అనాల్సిందే!'' ఎందుకంటె ఆత్మన్యూనతా భావనలను చాలా సులువుగా ఎదుర్కోవచ్చు దానికి కల్లా కావలసింది మనం పట్టుదలతో కొనసాగించే మన ప్రయత్నాలే మన భవిష్యత్ విజయాలకు గీటురాయిగా నిలుస్తాయనటంలో ఏమీ సందేహం లేదు! సామాజిక,సాంకేతిక మార్పులు సర్వ సాధారణమైన విషయం. కాలానుగుణంగా జరిగే ఈ మార్పులను సహేతుకంగా అర్ధం చేసుకుంటూ విచక్షణతో వాటిలోని ప్రతికూలతలను ప్రక్కన పెట్టి వాటిలోని అనుకూలతలను పట్టుకొని ఫలితాలను సాధించాలి. ఈ విషయంలో ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాల్సిన ప్రధాన విషయం దేనికి పనికిరావు అని అనిపించుకున్నవారు ప్రపంచంలో చరిత్ర సృష్టించిన సందర్భాలు అనేకానేకం! ఏవీ లేవనుకున్నవారు విద్యాపరంగా, సంపదల పరంగా, అధికారాల పరంగా పేరుప్రఖ్యాతులు సాధించిన సందర్భాలు చరిత్రలో కోకోల్లలు. అంగవైకల్యంతో వున్న మహిళా ఒక అద్భుత నాట్యకళా కారిణి కావచ్చు, అంధుడైన ఓ వ్యక్తి ఒక అద్భుత గాయకుడు కావచ్చు, ఒక ఆటో రిక్షా డ్రైవర్ కూతురు సీఏలో లో ఆల్ ఇండియా ఫస్ట్ రావచ్చు, ఒక సాధారణ రైతు కూలి కుటుంబంలోని మహిళ అమెరికన్ సాఫ్ట్ వేర్ కంపెనీ లో సీఈఓ కావచ్చు, ఒక బస్సు కండక్టర్ కొడుకు ఐపీఎస్ కావచ్చు. ఈ విజయాల వెనుక వున్నది ఒకే ఒక మహిమాన్విత శక్తి కృషి, శ్రమ,పట్టుదల,వీడని ప్రయత్నాలు. అందుకే శాశ్వత విజయాలకు, శాశ్వత అపజయాలకు మానవ నిఘంటువులో స్థానమే లేదు! మన కళ్ళ ముందరున్న ఈ ఉదాహరణలే మన ఆత్మవిశ్వాసానికి పునాదులుగా మారాలి.
అమరనాథ్ జగర్లపూడి, కౌన్సెలింగ్ సైకాలజిస్ట్,
9849545257