Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అవకాశం వస్తే ఉద్యోగంలో చేరాలి. చేరిన తర్వాత అదిచేయాలి, ఇదిచేయాలనే డ్రీమ్స్ సాధారణంగా ఎవరికైనా ఉంటాయి. కానీ ఒక సారి ఉద్యోగంలో చేరితే ఉద్యోగం తప్పా ఇంకేమీ చేయలేం అనేది మరికొందరికి అభిప్రాయం... ఉద్యోగంలో పోటీని తట్టుకోవాలి, టీంలో చురుగ్గా ఉండాలి. టార్గెట్స్ రీచ్ అవ్వాలి. వృత్తికి న్యాయం చేయాలి... సరదాలన్నింటినీ త్యాగం చేయాలి. కొత్తగా ఉద్యోగంలో చేరిన యువతకు ఇలాంటి అంశాలు తీవ్ర ఒత్తిడికి గురిచేస్తుంటాయి. మానసిక ఆందోళన కలిగిస్తాయి. అయితే... దీనికీ పరిష్కారం ఉందంటున్నారు నిపుణులు. ఉద్యోగం చేసుకుంటూనే కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్‌తో ఎక్కువ సేపు గడిపేందుకు సమయాన్ని కేటాయించొచ్చని అంటున్నారు. ప్రణాళికాబద్ధంగా పనులు చక్కబెడితే ఇదంతా సాధ్యమే అని సూచిస్తున్నారు. అన్ని పనులూ ఒకేసారి చేయడం ఎవరికైనా కష్టమే. ఒక్కోసారి ఇది సాధ్యం కూడా కాదు. ఏది ముందు, ఏది వెనుక, ఏది ప్రాథమికం, ఏది ద్వితీయం అన్నది తేల్చుకుని ప్రాధాన్యతాక్రమంలో పనులు నిర్వర్తించాలి. అప్పుడే అందులో ప్రావీణ్యత ఉంటుంది. ఇందుకు వాస్తవిక దృష్టి, నిశిత పరిశీలన, పూర్వపరాల పరిగణనతో పాటు తేలిక లక్ష్యాల పట్ల, పురోగమన క్రమం పట్ల స్పష్టమైన అవగాహన ఉండాలి. పునాదిని పటిష్టం చేసుకోవడం, వనరులను సాధ్యమైనంతగా ఎక్కువ ప్రయోజకరంగా వినియోగించుకోవడం, ఉన్న లోపాలను తొలగించుకోవడం లాంటి పద్ధతులు పాటించాలి. అన్ని ఒకేసారి చేద్దామనుకుంటే ప్రతిదీ అసంపూర్ణంగా మిగిలిపోవచ్చు. దేనికైనా ప్లానింగ్ ఉండాలి. అప్పుడే జీవితం పురోగతి వైపు పయనిస్తుంది. ఆధునిక యుగంలో అన్ని రంగాల్లోనూ పోటీతత్వం పెరిగింది. లక్ష్యాలను చేరుకోవడానికి మానసిక ప్రశాంతతను ఫణంగా పెట్టాల్సి వస్తోంది. ముఖ్యంగా కొత్తగా కెరీర్ మొదలెట్టిన యువత ఇలాంటి పరిణామాలను ఎదుర్కొవాల్సి వస్తోంది. ప్రయివేటు కంపెనీల్లో పనిచేసే వారు ప్రాజెక్ట్‌కు తగ్గట్టుగా ఆఫీసు పనుల్లోనే ఎక్కువ సమయాన్ని కేటాయించాల్సి వస్తోంది. అంతేకాదు.. ఒకవేళ ఆఫీసు పనిలో ఏవైనా బ్యాలెన్స్ ఉంటే, వాటిని రాత్రులు మేలుకొని ఇంట్లో పూర్తి చేస్తున్నారు. ఏదైనా ఒక పని మొదలు పెట్టినప్పుడు దానిపైనే దృష్టి సారించాలి. ఆఫీసు పనులను తొందరగా పూర్తి చేసుకుంటే ఇంటికి త్వరగా చేరుకోవచ్చు. అలాగే ఇంట్లో ఉన్న పనులు, బాధ్యతలు మీరొక్కరే తీసుకోకుండా ఎవరి పని వాళ్లు చేసుకుంటే చాలా మంచిది. లేకపోతే తీవ్ర నష్టాలను చవిచూడాల్సి వస్తుంది. ఒక పనిని పూర్తి చేయకముందే ఇతర బాధ్యతలను తీసుకోవడం వల్ల రెండింటికి న్యాయం చేయలేరు. ఒకవేళ ఇలా చేయాల్సి వస్తే వ్యక్తిగత జీవితంలో పొందాల్సిన సంతోషాన్ని ఒక్కసారిగా కోల్పోతారు. మీ సామర్థ్యానికి తగ్గట్టుగా ఒక పనిని ఎంచుకోవాలి. ఆఫీసులో చేస్తున్న పనిమీదే ద ష్టిని కేంద్రీకరించాలి. ఆఫీసులో ఇతరులతో ఎక్కువసేపు మాట్లాడుతూ సమయాన్ని వ థా చేసుకోకూడదు. అంతేకాదు.. సోషల్ నెట్ వర్కింగ్ సైట్లను పని మధ్యలో ఉపయోగించ కూడదు. మధ్యమధ్యలో 10 నిముషాల వరకు విరామం తీసుకుంటే చాలా మంచిది. మెదడు కూడా చురుకుగా పనిచేస్తుంది. ప్రణాళికాబద్ధంగా ఆఫీసు పనులను నిర్వర్తించుకుని వాటిని సాధ్యమైనంత వరకు పూర్తి చేయడానికి ప్రయత్నించాలి. అప్పుడే మీరు వ్యక్తిగతంగా కొంత సమయాన్ని కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్‌కు కేటాయించుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇలా ప్రణాళికలను పాటిస్తే ఆఫీసు పనులతోపాటు కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్‌తో సమయాన్ని హాయిగా గడపొచ్చు.