Authorization
Mon Jan 19, 2015 06:51 pm
స్టేజ్ ఎక్కాలంటే భయంగా ఉందా... కాళ్ళు వణికిపోతున్నాయా... అరచేతుల్లో చెమటలు పడుతున్నాయా... గొంతు మూగబోతున్నదా... ముందు రోజు ఎంత ప్రాక్టీస్ చేసినా మీ వల్ల కావడం లేదా... రాయమంటే పుంఖాలుగా రాస్తాం. సరదాగా మాట్లాడమంటే ఎన్ని గంటలైనా కాలక్షేపం చేస్తాం. కానీ స్టేజ్ ఎక్కి పది మంది ముందు మైక్ తీసుకుని మాట్లాడాలంటే మాత్రం జంకుతాం. ఇలాంటి సమస్య మీకే కాదు చాలా మందికి ఎదురవుతుంది. భయాన్ని వదిలిపెట్టి కాస్త ధైర్యం చేస్తే మీకు మించిన స్పీకర్ ఉండరని గుర్తుపెట్టుకోండి. ఈ చిన్న చిట్కాలు మీలోని స్టేజ్ ఫీయర్ను వదిలిస్తాయి. అవేంటో మీరే చూడండీ...
టెన్షన్ సద్దుమణిగి...
వేదిక ఎక్కగానే గుండెల్లో రైళ్లు పరిగెత్తి, కండరాలు పట్టేసి నర్వస్‌గా ఫీలవుతాం. ముందు రోజు రాత్రి ప్రాక్టీస్ చేసిన ప్రసంగ పాఠం ఒక్క ముక్క కూడా గుర్తు రాదు. మాట్లాడబోతే మాట పెగలదు. ఈ మార్పులన్నిటనికీ కారణం టెన్షన్‌తో ఒంట్లో పెరిగిపోయే అడ్రినలిన్ హార్మోన్ ఫలితమే. అయితే ఈ స్థితిని అధిగమించాలంటే నిలబడ్డచోటే కదలకుండా ఉండిపోతే ప్రయోజనం ఉండదు. వేదిక మీద నడుస్తూ చేతులను కదుల్చుతూ హావభావాలు వ్యక్తపరచాలి. ఇలా చేయటం వల్ల బాడీ రిలాక్స్ అవుతుంది. ఆత్మ విశ్వాసం పెరుగుతుంది. దాంతో టెన్షన్ సద్దుమణిగి మామూలు స్థితికొస్తాం.
ప్రాక్టీస్ చేయాలి
పర్ఫెక్షన్ కోసం ప్రాక్టీస్ చేయాలి. కాబట్టి ప్రెజెంటేషన్ స్క్రిప్ట్ ముందుగానే తయారుచేసుకుని దాని గురించి అనుమానాలుంటే స్నేహితుల ముందు ప్రెజెంట్ చేసి నివృత్తి చేసుకోవాలి. వాళ్లూ ఆడియన్స్లాంటివాళ్లే కాబట్టి ప్రసంగిస్తున్నప్పుడు ఏవైనా అనుమానాలు తలెత్తితే ప్రశ్నిస్తారు. ఇన్‌ఫుట్స్ ఏవైనా అవసరమనుకుంటే సూచిస్తారు. అలాగే అద్దం ముందు నిలబడి ప్రాక్టీస్ చేసినా ఫలితం ఉంటుంది.