Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రేమ రెండు మనసులను ప్రేమ రెండు మనసులను ఏకం చేస్తుంది. కోపం ఏకమైన ఆ మనసులను విడగొడుతుంది. భార్యాభర్తల్లో ఎవరు కోపంలో నోరు జారినా వివాహబంధం, కుటుంబ చట్రం వారిని కలిపి ఉంచుతుంది. కానీ ప్రేమలో ఉన్నవాళ్లు కోపంలో నోరుజారితే ఆ బంధం అంతటితో అంతమే. తర్వాత ఎంత బాధపడినా ఒక్కో సారి ఆ ప్రేమ బంధాన్ని తిరిగి పొందలేం. కడివెడు పాలను ఒక్క చుక్క కాలకూట విషం ఎలా అయితే పాడు చేస్తుందో... కోపం కూడా అంతే. దీన్ని ప్రేయసీ ప్రియులు గుర్తించాలి. మీకు అలాంటి ఇబ్బంది రాకుండా ఉండాలంటే ఒక్కసారి ఈ విషయాలు గుర్తు చేసుకోండి.
అభిప్రాయ భేదాల నేవి స్నేహితులు, తోడబుట్టిన వాళ్లు, భార్యాభర్తలకు మాత్రమే పరిమితం కాదు. ప్రేమలోనూ సహజం. మీ పార్ట్నర్తో రిలేషన్షిప్లో ఎంత అణిగిమణిగి ఉన్నా ఏదో ఒక రోజు మాటపట్టింపు రాకుండా ఉండదు. అప్పటి వరకు అణిగి మణిగి ఉన్న అసంతృప్తి బుసలు కొడుతుంది. ఆఫీసులో ఇబ్బంది, స్నేహితులతో గొడవ లాంటి రకరకాల కారణాలుండొచ్చు. అసలు కారణమే లేకపోవచ్చు. మీ మూడ్ పాడయి ఉండొచ్చు. అలాంటి పరిస్థితుల్లో మీ పార్ట్నర్ మీ కోపానికి బలవుతారు. మీలో కోపం కట్టలు తెంచుకుంటున్నా ఆలోచించి మాట్లాడాలి. అనాలోచితంగా మాట్లాడితే ఘర్షణకు దారి తీయవచ్చు.
నిందించొద్దు
'నువ్వు నన్ను అర్థం చేసుకోవు' అనే మాట పొరపాటున కూడా మీ భాగస్వామి చెవిన పడకూడదు. విబేధాలు వచ్చినప్పుడు ఏకపక్షంగా ఇలాంటి స్టేట్మెంట్లు ఇవ్వకూడదు. భాగస్వామికి మీరంటే కేర్ లేదని, అతనిని లేదా ఆమెను నిందించడం పెద్ద తప్పు. తన ప్రేమను ఆపాత్రదానం చేశానా అనే అనుమానం ఆమెలో కలిగేందుకు అవకాశం ఇవ్వకూడదు.
బెదిరింపులు మానుకోండి
'సరే నీ ఇష్టం నీకు నచ్చినట్టే చేసుకో' అనే మాటలో అనుమతితో పాటు 'నేను పట్టించుకోను, లెక్క చేయను' అనే బెదిరింపు దాగుంది. మిమ్మల్ని ప్రేమించేవాళ్లను ఇది బాగా హర్ట్ చేస్తుంది. 'ఇంక నన్ను నువ్వు ప్రేమించాల్సిన అవసరం లేదు' అని చెప్పే దాకా వెళుతుంది. కోపంలో మాట్లాడే మాటలను మీ భాగస్వామి ఎంత కాలం గడిచినా మరిచిపోదు.
దూషణకు దిగకూడదు
కోపంలో ఉన్నప్పుడు ఇలాంటి పదాలను ఉపయోగిస్తూ కేకలు వేయడం, గేలి చేయడం చేయకూడదు. చనువుందని నచ్చని పని చేసినప్పుడు మాటలతో నిందించకూడదు. ఆమెతో లేదా అతడితో ఇబ్బందులున్నా తప్పు అవతలి వ్యక్తిదే అయినా దూషణకు దిగకూడదు. మీ అభిప్రాయాన్ని మాత్రమే చెప్పాలి.
నువ్వింతే.. ఎప్పటికీ మారవు
ఇలాంటి మాటలు మాట్లాడటం అంటే భాగస్వామి మీద అపవాదులు వేయటం తప్ప మరేమి కాదు. 'నువ్వింతే మారవు అనే పదాలకు చాలా అర్థాలు ఉంటాయి. మీరు ఏ ఉద్దేశంతో వాడినా భాగస్వామి తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంది. ఒకవేళ మీరు నిజంగానే ఇబ్బందులు పడుతుంటే 'ఆ విషయం గురించి ఇంతకు ముందెప్పుడూ ఎందుకు ప్రస్తావించలేదు? ఇప్పుడు కోపంతో ఉన్నప్పుడు మాత్రమే ఎందుకు వెళ్లగక్కుతున్నారు' అనే ప్రశ్నలు నుంచి ఎదురవుతాయి. గొడవ మరింత పెరుగుతుంది.