Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మరో నాలుగు రోజుల్లో ప్రేమికుల రోజు రాబోతున్నది. ఫిబ్రవరి 14 వస్తుందంటే కొత్త జంటలకు ఎంతో ఉత్సాహం. ఇక కాబోయే జంటల సబరం అంతా ఇంతా కాదు. ఏండ్ల నుండి తమలో దాచుకున్న ప్రేమను బయటకు చెప్పడానికి చాలా మంది ఈ రోజునే వేదిక చేసుకుంటారు. ప్రేమ... సాధారణంగా స్నేహం నుంచే మొదలవుతుంది. ఎవరైనా ఒకరు నచ్చినప్పుడు వారితో ముందుగా స్నేహం చేసుకుంటారు. ఆ తరువాత తమలో వున్న భావాలను, ఇష్టాయిష్టాలను తెలుసుకుని, అనుకోకుండా ప్రేమలో పడిపోతారు. అయితే ప్రేమను వ్యక్తపరచడంలో కొన్ని చిట్కాలు పాటిస్తే ఎదుటి వారు కాదంటారేమో అనే భయం ఉండదు. మరి ఆ చిట్కాలు ఏంటో చూద్దాం...
ఏదో ఓ సందర్భాన ఓ వ్యక్తిపై మీలో ప్రేమభావం కలిగింది. కానీ ఆ వ్యక్తికి కూడా మీపై అంతే ప్రేమ ఉందా అంటే మీ నుంచి సమాధానం రాకపోవచ్చు. ఎందుకంటే ఎదుటివారు మిమ్మల్ని ప్రేమిస్తున్నారా లేదా అనే విషయం మీకు క చ్చితంగా తెలియకపోవచ్చు. అసలు మిమ్మల్ని వారు ఇష్టపడుతున్నారనే విషయం మీకు తెలియకపోవచ్చు. అలాంటి సందర్భంలో మీరు తొందరపడి మీ మనసులోని భావాన్ని వారికి చెప్తే.. వారు మిమ్మల్ని ప్రేమించకపోగా మీ ప్రేమను చులకనగా భావించవచ్చు. ఇలాంటివి జరగకుండా ఉండాలంటే.. ఎదుటివారిలో మీపై ఎలాంటి భావం ఉందనే విషయాన్ని మీరు గ్రహించాలి. వారు మిమ్మల్ని ఇష్టపడుతున్నారా.. లేదా అని తెలుసుకోవాలి.
మాటలతో ఇంప్రెస్ చేయండి
మీ మాటల్తో ఎదుటి వారిని ఇంప్రెస్ చేయండి. ఎలా చేయాలంటారా... ముందుగా మీరు ప్రేమించిన వారితో మాటలు కలపండి. ఆ మాటల సందర్భంలో మీలో ఉన్న ఫ్లస్ పాయింట్స్ వారికి తెలిసేలా చేయండి. అయితే ఉద్ధేశపూర్వకంగా మీరు ఆ పని చేస్తున్నట్టు ఉండకూడదు. అలా చేస్తే మీ ప్రేమకు ఫలితం లేనట్టే.
ప్రశాంత వాతావరణంలో...
కొంతమంది తమలో వున్న ప్రేమానుభావాలను ఎదుటి వారితో చెప్పుకోలేక తలమునకలయిపోతుంటారు. వారితో కలవడానికి కూడా ఇబ్బంది పడుతుంటారు. తమ ప్రేమ గురించి వ్యక్తపరచడానికి ధైర్యం చాలక వాటిని మనసులోనే దాచుకుని వుండిపోతారు. అలా కాకుండా మీరు ప్రేమిస్తున్న వ్యక్తి మీ మనసులోని భావాలను వ్యక్తపరిచే ముందు ప్రశాంతంగా వుండే స్థలాన్ని ఎంచుకుంటే మంచిది. అటువంటి ప్రశాంత వాతావరణంలోనే ఇతరుల మనుసులో వున్న భావాలను తేలికగా అర్థం చేసుకోవచ్చు. అప్పుడు మీలో వున్న భావాలను వ్యక్తపరిస్తే ఫలితం దక్కవచ్చు.
స్నేహితులతో వద్దు
మీరు ప్రేమిస్తున్న వ్యక్తి గురించిగానీ, ప్రేమ వ్యవహారం గురించి కానీ స్నేహితులతో ఎట్టి పరిస్థితుల్లో తెలియనివ్వకుండా జాగ్రత్త తీసుకుంటే మంచిది. ఎందుకంటే కొంతమంది అమ్మాయిలు.. తమ ప్రేమ వ్యవహారాలను స్నేహితుల నుంచి తెలుసుకోడానికి ఇష్టపడరు. పైగా వారు కోపాన్ని పెంచుకుని మీ ప్రేమను తిరస్కరించవచ్చు.
ఓ లేఖ రాయండి
ప్రస్తుత జనరేషన్లో ప్రతి ఒక్కరు తమ ప్రేమను సెల్ ఫోన్లు లేదా సోషల్ మీడియా ద్వారా వ్యక్తపరుచుకుంటారు. అయితే ఇది ఎంతమాత్రం మంచిది కాదు. సాధ్యమైనంతవరకు లేఖ రాయడానికి ఆసక్తి చూపించండి. ఎందుకంటే.. కాగితంపై రాసే మనసులోని భావాలకు ఇతరులు త్వరగా ఆకర్షితులవుతారు. గతంలో ప్రేమ వ్యవహారాలు ఇలాగే జరిగేవి. అవి సక్సెస్ కూడా అయ్యేవి. కాగితంలో రాసే అక్షరాలు మనసులో దాగి వున్న ప్రేమలోతును పూర్తిగా అర్థం చేసుకోవడానికి చాలా వీలుగా వుంటుంది.
మీరు మీరుగానే...
కొందరు తమ ప్రేమను వ్యక్తపరుచుకోవడానికి సినిమాల్లో వున్న హీరో, హీరోయిన్లలా తయారయి రావడం, సినిమాల్లో వుండే ప్రేమ మాటలు చెప్పడం చేస్తుంటారు. అయితే అమ్మాయిలకు ఇది ఎంతమాత్రం నచ్చదు. మీరు మీరుగానే వుండి మీలో వున్న భావాలను వ్యక్తపరిస్తేనే చాలామంచిది. అమ్మాయిలు కూడా అటువంటివాళ్లనే ఇష్టపడతారు. అనవసరమైన విచిత్రచేష్టలు చేయకుండా మీకు మీరుగానే మీ మనసులోని భావాలను వ్యక్తపరిచేందుకు ట్రై చేయండి.
నిలబెట్టుకోవాలంటే
ఎంతో కష్టపడి మీ ప్రేమను వారికి వ్యక్తం చేస్తారు. మీ ప్రేమ ఫలిస్తుంది. అప్పుడు ఆనందానికి అవధులు ఉండవు. కానీ ప్రేమను పొందడం గొప్ప కాదు. ఆ ప్రేమను కలకాలం నిలబెట్టుకోవడమే గొప్ప విషయయని తెలుసుకోవాలి. మరి దానికి ఏం చేయాలంటే...
సమయం కేటాయించండి
మీరు ఇష్టపడుతున్న వ్యక్తి స్వభావం ఏమిటి, వారికి ఏవి నచ్చుతాయి, ఏవి నచ్చవు అనే విషయాలను తెలుసుకోవడం కోసం సమయం కేటాయించాలి. అలా కాకుండా భవిష్యత్తు గురించి ఊహలతో వర్తమానాన్ని నిర్లక్ష్యం చేయడం మంచిది కాదు. ఒక బంధాన్ని ఏర్పరుచుకోవడం సులభం, కానీ దాన్ని నిలబెట్టుకోవడం కష్టం.అందుకే వారి కోసం కొంత సమయం కచ్చితంగా కేటాయించాలి.
వ్యక్తిగత స్వేచ్ఛ ఉండాలి
ప్రతి చిన్న కదలిక గురించి ఆరా తీయడం లేదా ప్రతి చిన్న నిర్ణయం గురించి చెప్పాలనుకోవడం తప్పు. ఒకరిపై మరొకరు అధికారం చెలాయించుకోకుండా అర్థం చేసుకుంటూ ఎవరి పరిధుల్లో వారు ఉన్నంత వరకు ఆ బంధానికి ఎలాంటి ఢోకా ఉండదు.
దూరం పెట్టకండి
ప్రేమించిన వ్యక్తితో గడపటం ఎంత ముఖ్యమో కుటుంబ సభ్యులు, స్నేహితులకు సమయాన్ని కేటాయించడం కూడా అంతే ముఖ్యం. ఈ కొత్త బాంధవ్యం కారణంగా వారిని నిర్లక్ష్యం చేస్తున్నారన్న భావన వారికి రాకూడదు. మీ మధ్య ఉన్న బంధం దెబ్బ తినకూడదు.
మార్చాలనుకోవద్దు..
మీరు కోరుకునే అన్ని లక్షణాలతో భాగస్వామి దొరకడం కష్టం (అసాధ్యం కూడా కావచ్చు). అలాగని వారిని మీకు నచ్చినట్టుగా మార్చాలనుకోవడం పొరపాటు. ఈ కారణంగానే చాలా జంటలు మధ్యలో విడిపోతున్నాయి. పరస్పర అభిరుచులను తెలుసుకుని, వారి భావాలను గౌరవించడం కూడా ప్రేమించడంలో భాగమే.
చివరిగా చెప్పేది ఏమిటంటే... ప్రతి బంధం ప్రత్యేకమైనది. ఎవరికి వారే తమ బంధం మరింత ప్రత్యేకంగా ఉండాలని కోరుకుంటారు. ఈ జాగ్రత్తలను మనసులో పెట్టుకుని మసలుకుంటే మీ బంధం కలకాలం పదిలంగా ఉంటుంది.
- సలీమ